ముంబై: భారత క్రికెట్ దేశవాళీ సీజన్ 2021–22లో మరో ప్రధాన టోర్నీకి రంగం సిద్ధమైంది. ఇటీవలే ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టి20ల్లో సత్తా చాటిన ఆటగాళ్లు ఇప్పుడు వన్డే క్రికెట్‌లో తమ విలువేంటో చూపించేందుకు సన్నద్ధమయ్యారు. నేటి నుంచి జరిగే వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మొత్తం 38 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. దేశంలోనే ఏడు వేదికల్లో (ముంబై, జైపూర్, రాంచీ, చండీగఢ్, రాజ్‌కోట్, తిరువనంతపురం, గువహటి)లలో మ్యాచ్‌లు జరుగుతాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై, మరో పెద్ద జట్టు తమిళనాడు మధ్య జరిగే తొలి పోరుతో టోర్నీ మొదలవుతుంది. కొన్నాళ్ల క్రితమే ముస్తాక్ అలీ టి20 టోర్నీని నెగ్గిన తమిళనాడు అమితోత్సాహంతో ఉంది.
భారత సీనియర్ జట్టులో సభ్యులుగా ఉన్నవారు కాకుండా పలువురు గుర్తింపు పొందిన క్రికెటర్లు విజయ్ హజారే ట్రోఫీలో ఆయా జట్ల తరఫున కీలకపాత్ర పోషించనున్నారు. హర్షల్ పటేల్, రాహుల్ చహర్, దీపక్ చహర్, యశస్వి జైస్వాల్, దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, అంబటి తిరుపతి రాయుడు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
మొత్తం 38 జట్లను ఎలైట్.. ప్లేట్ గ్రూప్‌లుగా విభజించారు. ఎలైట్ ‘ఎ’, ‘బి’, ‘సి’, ‘డి’, ‘ఇ’ గ్రూప్‌లలో ఆరు జట్లు చొప్పున ఉన్నాయి. మరో ఎనిమిది జట్లతో ప్లేట్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఐదు ఎలైట్ గ్రూప్‌ల నుంచి ‘టాప్’లో నిలిచిన ఐదు జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇవే గ్రూప్‌లలో రెండో స్థానంలో నిలిచిన ఐదు జట్లు... ప్లేట్ గ్రూప్ టాపర్ (మొత్తం ఆరు జట్లు) మధ్య ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. డిసెంబర్ 27న ఫైనల్ జరుగుతుంది. ఎలైట్ ‘ఎ’ గ్రూప్‌లో ఆంధ్ర... ఎలైట్ ‘సి’ గ్రూప్‌లో హైదరాబాద్ ఉన్నాయి.
హైదరాబాద్ జట్టు: తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హిమాలయ్, అలంకృత్, అతుల్ వ్యాస్, భవేశ్ సేథ్, మికిల్ జైస్వాల్, కవిన్ గుప్తా, త్రిషాంక్ గుప్తా, చందన్ సహాని, తనయ్ త్యాగరాజన్, అజయ్‌దేవ్ గౌడ్, గౌతమ్ రెడ్డి, మనీశ్ రెడ్డి, రక్షణ్ రెడ్డి, టి. రవితేజ, అక్షత్ రెడ్డి, కొల్లా సుమంత్, తిలక్ వర్మ, సీవీ మిలింద్, రాహుల్ బుద్ధి, అబ్దుల్ ఖురేషీ, అద్నాన్ అహ్మద్, మొహమ్మద్ అఫ్రిది.
Comments
Please login to add a commentAdd a comment