హాకీలో పసిడి వెలుగులు | Indian mens hockey team won the gold medal | Sakshi
Sakshi News home page

హాకీలో పసిడి వెలుగులు

Oct 7 2023 3:14 AM | Updated on Oct 7 2023 3:14 AM

Indian mens hockey team won the gold medal - Sakshi

ఏ లక్ష్యంతోనైతే చైనా గడ్డపై భారత పురుషుల హాకీ జట్టు అడుగుపెట్టిందో దానిని దిగ్విజయంగా అందుకుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడలకు నేరుగా అర్హత పొందాలన్న లక్ష్యాన్ని టీమిండియా సాధించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌ జట్టుతో జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వంలోని భారత హాకీ జట్టు ఆద్యంతం ఆధిపత్యం చలాయించి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. పోటీల 13వ రోజు భారత్‌ ఖాతాలో మొత్తం తొమ్మిది పతకాలు చేరాయి.

ఆర్చరీలో రజతం, కాంస్యం... రెజ్లింగ్‌లో మూడు కాంస్యాలు... బ్రిడ్జ్, సెపక్‌తక్రా, బ్యాడ్మింటన్‌లో ఒక్కో కాంస్య పతకం లభించాయి. ప్రస్తుతం భారత్‌ 95 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. నేడు క్రికెట్, ఆర్చరీ, కబడ్డీ, మహిళల హాకీ, చెస్, రోలర్‌ స్కేటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్‌ క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు పతకాల బరిలో ఉన్నారు. క్రికెట్, ఆర్చరీ, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ ద్వారా భారత్‌కు కచ్చి తంగా ఏడు పతకాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌ తొలిసారి నేడు అధికారికంగా 100 పతకాల  మైలురాయిని దాటనుంది.   

హాంగ్జౌ: పక్కా ప్రణాళికతో, పూరిస్థాయిలో సన్నద్ధమై ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన భారత పురుషుల హాకీ జట్టు తమ లక్ష్యాన్ని సాధించింది. లీగ్‌ దశ నుంచి ప్రత్యర్థి జట్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచిన టీమిండియా తుది పోరులోనూ ఈ దూకుడు కొనసాగించింది. దాంతో ఆసియా క్రీడల్లో తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.

డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌ జట్టుతో శుక్రవారం జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని భారత జట్టు 5–1 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా ఆసియా క్రీడల విజేత హోదాలో టీమిండియా వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడలకు నేరుగా అర్హత పొందింది. జపాన్‌తో జరిగిన తుది పోరులో భారత్‌ తరఫున కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (32వ, 59వ ని.లో) రెండు గోల్స్‌ చేయగా... అమిత్‌ రోహిదాస్‌ (36వ ని.లో), మన్‌ప్రీత్‌ సింగ్‌ (25వ ని.లో), అభిషేక్‌ (48వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు.

జపాన్‌ జట్టుకు సెరెన్‌ తనాకా (51వ ని.లో) ఏకైక గోల్‌ అందించాడు. ఓవరాల్‌గా ఆసియా క్రీడల్లో భారత్‌ నాలుగోసారి స్వర్ణ పతకం సాధించింది. 1966 బ్యాంకాక్, 1998 బ్యాంకాక్, 2014 ఇంచియోన్‌ ఆసియా క్రీడల్లోనూ భారత్‌ బంగారు పతకాలు సొంతం చేసుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో దక్షిణ కొరియా 2–1తో చైనా జట్టుపై గెలిచింది. హర్మన్‌ప్రీత్‌ 13 గోల్స్‌తో టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. జపాన్‌ జట్టును ఏమాత్రం తక్కువ చేయకుండా ఆడిన భారత్‌ అవకాశం వచ్చి నపుడల్లా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ వైపు దూసుకెళ్లింది.

ఈ క్రమంలో కొన్నిసార్లు గోల్‌ చేసే అవకాశాలను చేజార్చుకుంది. తొలి 25 నిమిషాల వరకు భారత్‌ను నిలువరించిన జపాన్‌ ఆ తర్వాత తడబడింది.    అభిషేక్‌ ‘డి’ ఏరియా వద్ద నుంచి కొట్టిన రివర్స్‌ షాట్‌ను జపాన్‌ గోల్‌కీపర్‌ నిలువరించాడు. తిరిగి వచ్చిన బంతిని అక్కడే ఉన్న మన్‌ప్రీత్‌ లక్ష్యానికి చేర్చడంతో భారత్‌ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్‌ జోరు పెంచగా... జపాన్‌ డీలా పడింది.  

‘క్రికెట్‌’ ఫైనల్లో భారత్‌ 
తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్న భారత క్రికెట్‌ జట్టు స్వర్ణ పతకానికి విజయం దూరంలో నిలిచింది. టి20 ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో టీమిండియా ఫైనల్‌ చేరింది. సెమీఫైనల్లో భారత్‌ తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో అఫ్గానిస్తాన్‌తో భారత్‌ ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్‌ నాలుగు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 97 పరుగుల లక్ష్యాన్ని 9.2 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి అందుకుంది. భారత్‌ తరఫున హైదరాబాద్‌ క్రికెటర్‌ తిలక్‌ వర్మ (26 బంతుల్లో 55 నాటౌట్‌; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (26 బంతుల్లో 40 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. అంతకుముందు బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 96 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సాయికిశోర్‌ 3 వికెట్లు, వాషింగ్టన్‌ సుందర్‌ 2 వికెట్లు తీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement