కుస్తీకి స్వస్తి పలికిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్
రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్న డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్
‘‘అమ్మలాంటి రెజ్లింగ్ నా మీద గెలిచింది. నేనేమో ఓడిపోయాను. దయచేసి... మీరంతా నన్ను క్షమించండి. మీ కలలు, నా ధైర్యం అన్నీ ముక్కలయ్యాయి. ఇకపై నాకు పోరాడే శక్తి లేదు. గుడ్‌బై రెజ్లింగ్ 2001–2024. నన్ను అభిమానించిన, మద్దతు తెలిపిన మీ అందరికీ నేనెప్పుడు రుణపడే ఉంటాను’’... కుస్తీనే లోకంగా, ఒలింపిక్స్ పతకమే ధ్యేయంగా ఎదిగి... ఇంటా బయటా క్రీడ, క్రీడేతర శక్తులతో పోరాడిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఈ రిటైర్మెంట్ నిర్ణయంతో మళ్లీ మన గుండెల్ని బరువెక్కించింది.
పారిస్: సెమీస్‌లో గెలిచి... ఫైనల్‌కు ముందు 100 గ్రాముల తేడాతో అనర్హతకు గురైన భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మళ్లీ మ్యాట్‌పైకి దిగే ఉద్దేశం లేదని ప్రకటించింది. రెజ్లింగ్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని గురువారం 29 ఏళ్ల వినేశ్ వెల్లడించింది.
కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఎఎస్) అప్పీలుకు సైతం వెళ్లిన ఆమె తీర్పు వెలువడక ముందే అనూహ్యంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంది. అలసిపోయిన తనకు ఇకపై కుస్తీలో ప్రత్యర్థులను పట్టుపట్టే బలం లేదంటూ గురువారం సోషల్ మీడియా వేదికగా గుడ్‌బై చెప్పింది. ఊహించని ఆమె నిర్ణయానికి భారత క్రీడాలోకం నిర్ఘాంతపోయింది. ఆమెను పోరాట యోధురాలిగా చూసిన క్రీడాకారులంతా వారిస్తున్నారు.
ఆమెను అభిమానించే వారంతా రెజ్లర్ అధైర్యపడొద్దని వేడుకొంటున్నారు. తల్లిలాంటి రెజ్లింగ్‌పై తన ఉక్కు సంకల్పం సడలించవద్దని అదేపనిగా విజ్ఞప్తి చేస్తున్నారు. వినేశ్ పెదనాన్న ద్రోణాచార్య అవార్డీ, కోచ్ మహావీర్ ఫొగాట్ మాట్లాడుతూ భారత్‌కు చేరగానే తనతో మాట్లాడి వీడ్కోలు నిర్ణయాన్ని విరమించుకునేలా చేస్తానని తెలిపారు. ‘నేను బజరంగ్ పూనియా, గీత కలిసి కూర్చొని అమెతో మాట్లాడతాం. అంతా కలిసి ఆమెకు నచ్చజెబుతాం.
2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ కోసం లక్ష్య నిర్దేశం చేస్తాం’ అని మహావీర్ అన్నారు. వినేశ్ పోటీపడ్డ ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన సారా హిల్డర్‌బ్రంట్ (అమెరికా) మాట్లాడుతూ ‘వినేశ్ అనర్హతకు గురవడం బాధాకరం. బరువు తగ్గడం కోసం పడే పాట్లు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అమె కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను’ అని పేర్కొంది.
కల కాదు... ఆమెకు ఒలింపిక్స్ ఓ పీడకల!
ప్రపంచ చాంపియన్íÙప్‌లు, ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో మంచి రికార్డే ఉన్న వినేశ్‌కు ఏ ఒలింపిక్స్ కూడా అచ్చి రాలేదు. అందుకే ఆమె కెరీర్‌లో ఒలింపిక్స్ కల కాదు ఓ పీడకలగా మిగిలిపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో కీలకమైన క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో గాయం వల్ల ముందంజ వేయలేకపోయింది. మళ్లీ ఐదేళ్ల (కోవిడ్ వల్ల 2021లో) తర్వాత టోక్యో విశ్వక్రీడల్లో క్వార్టర్స్‌లోనే ఓటమితో ని్రష్కమించింది. ఇప్పుడు మూడేళ్లకే జరిగిన పారిస్ ఈవెంట్‌లో కనీసం ఖాయమనుకున్న రజతాన్ని అనర్హత వేటు అవహేళన చేసింది.
క్రీడ అనేది మానవ సంకల్పానికి వేడుకలాంటింది. నా కెరీర్లో ఇలాంటి సందర్భాల్ని, వేడుకల్ని చాలాసార్లు చవిచూశాను. వినేశ్ సంకల్పానికి దేశం ఒక్కటై పలికిన జేజేలను మాత్రం ఎప్పుడూ చూడలేదు. పట్టు సడలించని ఆమె సంకల్పాన్ని జాతి యావత్తు వేడుక చేసుకుంటోంది. –అభినవ్ బింద్రా, షూటింగ్‌లో బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత
క్రీడాకారులు జీవితమంతా సవాళ్లతోనే సహవాసం చేస్తారు. ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూస్తారు. కలను నెరవేర్చుకునే రోజు నైపుణ్యంతో రాణిస్తే విజయం చేకూరుతుంది. కానీ ఊహకందని ఈ పొరపాట్లు (స్వల్ప బరువుతో అనర్హత) జరిగితే మాత్రం ఎవరికైనా గుండె బద్దలవుతుంది. –కేంద్ర క్రీడల మాజీ మంత్రి, షూటర్ రాజ్యవర్ధన్ రాథోడ్
మేమంతా వినేశ్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటుందనే నమ్మకంతో ఉన్నాం. కఠోర సాధనతో లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ (2028)లో స్వర్ణం గెలిచి మా పిన్ని (వినేశ్ తల్లి), మా నాన్న మహావీర్ కలల్ని సాకారం చేసుకుంటుంది. ఇంటికొచ్చాక నాన్న ఆమెతో మాట్లాడి రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తారు. –మాజీ రెజ్లర్ బబితా ఫొగాట్
వినేశ్... అంతపని (రిటైర్మెంట్) చేయొద్దు. బాధలో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయం తగదు. నేను భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) తరఫున ఆమె వీడ్కోలుకు బై చెప్పి ఎప్పట్లాగే బౌట్‌లో సత్తాచాటాలని విజ్ఞప్తి చేస్తున్నాను. –డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ సంజయ్ సింగ్
వినేశ్ ప్రొఫైల్
Comments
Please login to add a commentAdd a comment