కొత్త చరిత్ర సృష్టించడానికి, చరిత్రలో నిలిచిపోవడానికి భారత మహిళల హాకీ జట్టు ఒకే ఒక్క విజయం దూరంలో ఉంది. ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీఫైనల్ చేరి అర్జెంటీనా చేతిలో ఓడిపోయిన భారత జట్టు నేడు జరిగే కాంస్య పతక పోరులో 2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది. లీగ్ దశలో బ్రిటన్ చేతిలో 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయిన భారత్ ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. గుర్జీత్ కౌర్, వందన కటారియా, కెప్టెన్ రాణి రాంపాల్, గోల్‌కీపర్ సవితా పూనియా మరోసారి భారత్‌కు కీలకం కానున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై టీమిండియా మరింత దృష్టి పెట్టాలి. ఫినిషింగ్ లోపాలను సవరించుకోవాలి. క్వార్టర్ ఫైనల్లో మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించిన భారత మహిళలు పట్టుదలతో, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడితే కాంస్య పతకం గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఫైనల్‌కు చేరుకోకపోవడంతో బ్రిటన్ కనీసం కాంస్య పతకంతోనైనా తిరిగి వెళ్లాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో కాంస్య పతక పోరు హోరాహోరీగా సాగడం ఖాయమనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment