ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌ను గెలిపించిన కార్తీక్ త్యాగి..
చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ 2 పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌లో పంజాబ్ గెలుపునకు 4 పరుగులు అవసరం కాగా, కేవలం ఒకే పరుగు చేసి ఘోర ఓటమిని చవిచూసింది. చివరి ఓవర్ వేసిన కార్తీక్ త్యాగి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టి ఆర్‌ఆర్ జట్టుకు చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌ఆర్ జట్టు 185 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.
పంజాబ్ రెండో వికెట్ డౌన్.. మయాంక్(67) ఔట్
అర్ధసెంచరీతో అలరించిన పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (43 బంతుల్లో 67; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. 13వ ఓవర్ ఆఖరి బంతికి తెవాతియా బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 126/2. క్రీజ్‌లో ఎయిడెన్ మార్‌క్రమ్(2), నికోలస్ పూరన్ ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.. కేఎల్ రాహుల్(49) ఔట్
120 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 49; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చేతన్ సకారియా బౌలింగ్‌లో కార్తిక్ త్యాగికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 12 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 120/1. క్రీజ్‌లో మయాంక్ అగర్వాల్ (39 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎయిడెన్ మార్‌క్రమ్ ఉన్నారు.
సిక్సర్‌తో ఫిఫ్టి పూర్తి చేసిన మయాంక్
ఆరంభంలో నెమ్మదిగా ఆడిన పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (35 బంతుల్లో 58; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆతర్వాత గేర్ మార్చి సూపర్ ఫిఫ్టి సాధించాడు. 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన మయాంక్.. అర్ధసెంచరీతో పాటు ఐపీఎల్‌లో 3000 పరుగులు పూర్తి చేశాడు. అంతకుముందు ఇదే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (26 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సైతం 3000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. రాహుల్, మాయంక్‌ల ధాటికి పంజాబ్ 10 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 106 పరగులు చేసింది. పంజాబ్ గెలుపుకు 60 బంతుల్లో 80 పరుగులు చేయాల్సి ఉంది.
నిలకడగా ఆడుతున్న పంజాబ్ ఓపెనర్లు.. 6 ఓవర్ల తర్వాత 49/0
186 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మయాంక్ అగర్వాల్ (18 బంతుల్లో 15; ఫోర్) నిలకడగా ఆడుతున్నారు. ఫలితంగా 6 ఓవర్ల తర్వాత పంజాబ్ వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. పంజాబ్ గెలుపుకు 84 బంతుల్లో 137 పరుగులు సాధించాల్సి ఉంది.
అర్షదీప్ పాంచ్ పటాకా.. రాజస్థాన్ రాయల్స్ ఆలౌట్.. పంజాబ్ టార్గెట్ 186
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. ఆరంభంలో దూకుడుగా ఆడడంతో రాజస్తాన్ స్కోరు 200 దాటుతుందని అంతా భావించారు. కానీ ఆఖర్లో పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ 5 వికెట్లతో టాప్ లేపగా.. షమీ 3 వికెట్లతో రాణించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ 36, యశస్వి జైశ్వాల్ 49 పరుగులతో రాణించారు. ఆ తర్వాత లివింగ్ స్టోన్ 25 పరుగులతో రాణించడం.. చివర్లో మహిపాల్ లామ్రోర్ (17 బంతుల్లో 43 పరుగులు, 2 ఫోర్లు, 4 సిక్సర్ల)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
Photo Courtesy: IPL
షమీ దెబ్బ .. రాజస్తాన్ 178/8
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. షమీ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఐదో బంతికి భారీ షాట్‌కు యత్నించిన మోరిస్ లాంగాన్‌లో మార్‌క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు ఓవర్ రెండో బంతికి 2 పరుగులు చేసిన రాహుల్ తెవాటియా క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 19 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
చిచ్చర పిడుగు లోమ్రార్(43) ఔట్.. 6వ వికెట్ కోల్పోయిన ఆర్‌ఆర్
ఐపీఎల్ పుణ్యమా అని మరో యంగ్ టాలెంట్ వెలుగు చూసింది. రాజస్థాన్ ఆటగాడు మహిపాల్ లోమ్రార్ (17 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. అయితే, అర్షదీప్ వేసిన 18వ ఓవర్ తొలి బంతికి లాంగ్ ఆన్‌లో ఉన్న మార్‌క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో రాజస్థాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 17.1 ఓవర్ల తర్వాత ఆర్‌ఆర్ స్కోర్ 169/6. క్రీజ్‌లో తెవాతియా(1), క్రిస్ మోరిస్ ఉన్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. రియాన్ పరాగ్(4) ఔట్
షమీ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ మూడో బంతికి రియాన్ పరాగ్(5 బంతుల్లో 4) ఔట్ కావడంతో రాజస్థాన్ 166 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో మహిపాల్ లోమ్రార్(15 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్ తెవాతియా ఉన్నారు.
పాపం యశస్వి.. పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్
రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (36 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఐపీఎల్‌లో తన మొట్టమొదటి అర్ధసెంచరీ నమోదు చేసుకునే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. 49 పరుగుల వద్ద హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో మయాంక్ సూపర్ క్యాచ్ అందుకోవడంతో యశస్వీ పెవిలియన్‌కు చేరాడు. 14.2 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 136/4. క్రీజ్‌లో మహిపాల్ లోమ్రార్(7 బంతుల్లో 16; 2 సిక్సర్లు), రియాన్ పరాగ్ ఉన్నారు.
ఫాబియన్ అలెన్ సూపర్ క్యాచ్.. లివింగ్‌స్టోన్(25) ఔట్
అర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో డీప్ మిడ్‌వికెట్‌లో ఫాబియన్ అలెన్ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకోవడంతో హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్) పెవిలియన్ బాట పట్టక తప్పలేదు. 12 ఓవర్లు ముగిసే సరికి ఆర్‌ఆర్ మూడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. క్రీజ్‌లో యశస్వీ జైస్వాల్ (28 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ ఉన్నారు.
Photo Courtesy: IPL
డేంజర్ మ్యాన్ సామ్సన్ (4) ఔట్.. ఆర్‌ఆర్ సెకెండ్ వికెట్ డౌన్
ఇషాన్ పోరెల్ వేసిన 8వ ఓవర్ తొలి బంతికి వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో రాజస్థాన్ కెప్టెన్ సంజూ సామ్సన్(5 బంతుల్లో 4) పెవిలియన్‌కు చేరాడు. 7.1 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 68/2. క్రీజ్‌లో యశస్వీ జైస్వాల్ (17 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్), లియామ్ లివింగ్‌స్టోన్ ఉన్నారు.
Photo Courtesy: IPL
తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. ఎవిన్ లూయిస్(36) ఔట్
భారీ విధ్వంసం సృష్టించేలా కనిపించిన ఎవిన్ లూయిస్ (21 బంతుల్లో 36; 7 ఫోర్లు, సిక్స్)ను అర్షదీప్ సింగ్ బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 6వ ఓవర్ మూడో బంతికి కవర్స్ దిశగా ఆడే క్రమంలో మయాంక్‌కు క్యాచ్ ఇచ్చి లూయిస్ వెనుదిరిగాడు. 5.3 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 54/1. క్రీజ్‌లో యశస్వీ జైస్వాల్ (12 బంతుల్లో 15; 3 ఫోర్లు), సామ్సన్ ఉన్నారు.
చితక్కొడుతున్న లూయిస్.. 5 ఓవర్ల తర్వాత ఆర్‌ఆర్ స్కోర్ 53/0
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అదరగొట్టిన విండీస్ విధ్వంసకర హిట్టర్ ఎవిన్ లూయిస్ (20 బంతుల్లో 36; 7 ఫోర్లు, సిక్స్).. రాజస్థాన్ తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనూ తన మార్కు చితక్కొట్టుడును కొనసాగించాడు. పంజాబ్ బౌలర్ ఇషాన్ పోరెల్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఏకంగా నాలుగు బౌండరీలు బాదిన అతను.. దీపక్ హూడా వేసిన మరుసటి ఓవర్(5వ ఓవర)లోనూ మరో 2 ఫోర్లు కొట్టాడు. మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (10 బంతుల్లో 15; 3 ఫోర్లు) సైతం చెత్త బంతులను బౌండరీలకు తరలించడంతో 5 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు 50 పరుగుల స్కోర్‌ను దాటింది.
Photo Courtesy: IPL
దుబాయ్: ఐపీఎల్-2021 సెకెండ్ ఫేస్‌లో భాగంగా నేడు(మంగళవారం) పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి దశలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్.. మూడు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉండగా... ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ ఆరో స్థానంలో కొనసాగుతోంది.
ఇక, ఇరు జట్ల మధ్య తొలి దశలో జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో పంజాబ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్ (119) భారీ సెంచరీతో రాణించినా విజయం దక్కలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(91) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. దీపక్ హుడా(64), క్రిస్ గేల్(40) ధాటిగా ఆడారు. అనంతరం రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు మాత్రమే చేసి పోరాడి ఓడింది.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్( కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, ఎయిడెన్ మార్క్రమ్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఇషాన్ పోరెల్, ఫాబియన్ అలెన్, ఆదిల్ రషీద్, హర్ప్రీత్ బ్రార్, ఆర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ
రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్, కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, రియాన్ పరాగ్, మహిపాల్ రోమ్రార్, క్రిస్ మోరిస్, రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగి, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా
Comments
Please login to add a commentAdd a comment