కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్
ఆక్లాండ్: ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతూ ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సిన న్యూజిలాండ్ క్రికెటర్లు స్వదేశం వెళ్లరాదని భావిస్తున్నారు. కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో పలు ఆంక్షల నడుమ న్యూజిలాండ్‌కు వెళ్లి తిరిగి ఇంగ్లండ్ వెళ్లడం అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. దాంతో వారంతా భారత జట్టుతో పాటు ఇక్కడి నుంచే ఇంగ్లండ్ వెళ్లే అవకాశం ఉంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తోనే తలపడేందుకు టీమిండియా కూడా ఇంగ్లండ్ వెళ్లనుంది.
కెప్టెన్ విలియమ్సన్, బౌల్ట్, జేమీసన్, సాన్‌ట్నర్ కివీస్ టెస్టు జట్టులో సభ్యులుగా ఉన్నారు. ‘న్యూజిలాండ్‌కు వచ్చి రెండు వారాలు క్వారంటైన్ తర్వాత ఇంగ్లండ్ బయల్దేరడం అంత సులువు కాదు. అందుకే మా వాళ్లంతా భారత్‌లోనే ఉండిపోవడం మంచిది. టెస్టు జట్టులో లేని వారు స్వదేశం వచ్చేందుకు కూడా మేం ఏర్పాట్లు చేయాల్సి ఉంది. విమాన రాకపోకల సమస్య కూడా తీవ్రంగా ఉంది. ఈ అంశంలో బీసీసీఐతో చర్చిస్తున్నాం’ న్యూజిలాండ్ క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హీత్ మిల్స్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment