IPL 2021 SRH Vs MI : Live Score Updates, Match Highlights In Telugu - Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2021: ఎస్‌ఆర్‌హెచ్‌ హ్యాట్రిక్‌ పరాజయం‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Published Sat, Apr 17 2021 7:11 PM | Last Updated on Sun, Apr 18 2021 2:47 AM

IPL 2021: SRH Vs Mumbai Indians Match Live Updates - Sakshi

photo courtesy IPL

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ వరుసగా మూడో పరాజయాన్ని నమోదు చేసింది. చెపాక్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 13 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ముంబై విధించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 19.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్‌ అయింది. అయితే ఆరంభంలో బెయిర్‌ స్టో(22 బంతుల్లో 43, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడడంతో 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 57 పరుగులు సాధించి విజయం దిశగా నడుస్తున్నట్లు అనిపించింది. కానీ బెయిర్‌ స్టో ఔటైన తర్వాత మనీష్‌ పాండే(2) విఫలమయ్యాడు. ఆపై కాసేపటికి వార్నర్‌(36) రనౌట్‌ అ‍య్యాడు. దాంతో సన్‌రైజర్స్‌ ఒక్కసారిగా గాడి తప్పినట్లయ్యింది. విజయ్‌ శంకర్‌(28) కాసేపు మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. చివర్లో వరుసగా వికెట్లు పడటంతో ఇంకా రెండు బంతులు ఉండగానే సన్‌రైజర్స్‌ ఆలౌటైంది. చివరి ఓవర్లో బౌల్ట్‌ రెండు వికెట్లు తీయడంతో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

గత మ్యాచ్‌లో కేకేఆర్‌పై విజయంలో​ కీలకపాత్ర పోషించిన రాహుల్‌ చహర్‌ మరోసారి మెరవడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో విజయ్‌ శంకర్‌ 28 పరుగులతో ప్రతిఘటించినా బుమ్రా బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ముంబై బౌలర్లో రాహుల్‌ చహర్‌, బౌల్ట్ 3, బుమ్రా‌, కృనాల్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. అంతకముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌.. ఆరంభంలో రోహిత్‌ శర్మ 32, డికాక్‌ 40 పరుగులు చేయగా.. ఆఖర్లో పొలార్డ్‌ (35, 22 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్‌) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్‌ బౌలర్లలో విజయ్‌ శంకర్‌, ముజీబ్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. ఖలీల్‌ అహ్మద్‌ ఒక వికెట్‌ తీశాడు.

ఏడో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ పరాజయం దిశగా సాగుతుంది. బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ నాలుగో బంతికి అబ్దుల్‌ సమద్‌ హార్దిక్‌ పాండ్యా అద్బుత త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఓవర్‌ చివరి బంతికి రషీద్‌ ఖాన్‌ డకౌట్‌ అయ్యాడు. ప్రస్తుతం 18.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ​

మెరిసిన చహర్‌..
ముంబై ఇండియన్స్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ మరోసారి మెరిశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఎస్‌ఆర్‌హెచ్‌ను దెబ్బతీశాడు. ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో తొలుత 102 పరుగుల వద్ద 11 పరుగులు చేసిన విరాట్‌ సింగ్ అవుటయ్యాడు.‌ అదే ఓవర్‌ ఐదో బంతికి అభిషేక్‌ శర్మ మిల్నేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. 

డేవిడ్‌ వార్నర్‌ రనౌట్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ 90/3
ఎస్‌ఆర్‌హెచ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. తాజాగా 36 పరుగులు చేసిన వార్నర్‌ హార్దిక్‌ పాండ్యా డైరెక్ట్‌ త్రోకు బలయ్యాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 91 పరుగుల వద్ద మూడో వికెట్‌  కోల్పోయింది.

పాండే అవుట్‌.. రెండో వికెట్‌ డౌన్‌
151 పరుగుల  లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చేసిన మనీష్‌ పాండే రాహుల్‌ చహర్‌ బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ‌

బెయిర్‌ స్టో అవుట్‌..
ముంబై ఇండియన్స్‌తో​ జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్‌ బెయిర్‌ స్టో రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌లో కృనాల్‌ వేసిన రెండో బంతికి బెయిర్‌ స్టో దురదృష్టవశాత్తు హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 8 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 68 పరుగులు చేసింది. వార్నర్‌ 23, మనీష్‌ పాండే 1 పరుగుతో క్రీజులో ఉ‍న్నారు.

దాటిగా ఆడుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌
ఐపీఎల్‌ 14వ సీజన్‌లో తొలి విజయం సాధించాలన్న కసితో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌ ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ధాటిగా ఆడుతుంది. ముఖ్యంగా ఓపెనర్‌ బెయిర్‌ స్టో సిక్సర్ల వర్షం కురిపిస్తుండడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 6 ఓవర్లలోనే 9కి పైగా రన్‌రేట్‌తో 57 పరుగులు చేసింది. ప్రస్తుతం బెయిర్‌ స్టో 41, వార్నర్‌ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.

బెయిర్‌ స్టో దూకుడు.. ఎస్‌ఆర్‌హెచ్‌ 
ముంబై ఇండియన్స్‌ విధించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తుంది. ఓపెనర్‌ బెయిర్‌ స్టో సిక్సర్లతో దూకుడైన ఆటతీరు ప్రదర్శిస్తుండడంతో 4 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. ప్రస్తుతం బెయిర్‌ స్టో 33, వార్నర్‌ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

పొలార్డ్‌ మెరుపులు.. ముంబై 150/5
చెపాక్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు 151 పరుగుల టార్గెట్‌ విధించింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఒక దశలో 140 స్కోరైనా దాటుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే చివర్లో పొలార్డ్‌ (35, 22 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్‌) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగలిగింది. కాగా అంతకముందు రోహిత్‌ శర్మ 32 పరుగులతో దాటిగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆ తర్వాత డికాక్‌ 40 పరుగులు చేయగా..మిగతావారు విఫలమయ్యారు. ఎస్ఆర్‌హెచ్‌ బౌలర్లలో విజయ్‌ శంకర్‌, ముజీబ్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. ఖలీల్‌ అహ్మద్‌ ఒక వికెట్‌ తీశాడు.

4వ వికెట్‌ కోల్పోయిన ముంబై
ముంబై ఇండియన్స్‌ 114 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయింది. ముజీమ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ ఐదో బంతిని ఇషాన్‌ కిషన్‌ ప్లిక్‌ చేయగా.. గ్లోవ్స్‌ను తాకి కీపర్‌ బెయిర్‌ స్టో చేతిలో పడింది. ప్రస్తుతం ముంబై 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.

2000 పరుగులు పూర్తి.. ఆపై వికెట్‌
ఐపీఎల్‌లో డీకాక్‌ రెండు  వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ముజీబ్‌ వేసిన 14 ఓవర్‌ నాల్గో బంతికి సింగిల్‌ తీయడం ద్వారా ఐపీఎల్‌లో రెండు వేల పరుగుల మైలురాయిని చేరాడు. అనంతరం సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ సుచిత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. డీకాక్‌ 39 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేసి ఔటయ్యాడు. దాంతో 98 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్‌ను నష్టపోయింది. 

12 ఓవర్లలో ముంబై 89/2
12 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్‌ రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. డీకాక్‌(34), ఇషాన్‌ కిషన్‌(5) క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్‌ శర్మ(32) తొలి వికెట్‌గా ఔట్‌ కాగా, సూర్యకుమార్‌(10) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. వీరిద్దర్నీ విజయ్‌ శంకర్‌ ఔట్‌ చేశాడు. ముంబై ఇండియన్స్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోవడంతో స్కోరు బోర్డు ‍ మందగించింది.

సూర్యకుమార్‌ యాదవ్‌(10)ఔట్
సూర్యకుమార్‌ యాదవ్‌(10) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. సిక్స్‌ కొట్టి మంచి ఊపు మీద కనిపించిన సూర్యకుమార్‌.. విజయ్‌ శంకర్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. అతనికే రిటర్న్‌ క్యాచ్‌ పెవిలియన్‌ చేరాడు. దాంతో ముంబై 71 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. రైట్‌ లెంగ్త్‌లో వేసిన బంతిని ఫ్లిక్‌ చేసే క్రమంలో సూర్యకుమార్‌ తడబడ్డాడు. దాంతో ఆ బంతిని స్ట్రైట్‌గా ఆడబోయి బౌలర్‌ విజయ్‌ శంకర్‌కే క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 

రోహిత్‌ శర్మ ఔట్‌.. తొలి వికెట్‌ డౌన్‌
చెపాక్‌ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. విజయ్‌ శంకర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌ మూడో బంతిని లాంగాన్‌ మీదుగా భారీ షాట్‌ ఆడేందుకు రోహిత్‌ విరాట్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై 55 పరుగుల వద్ద తొలి వికెట్‌ నష్టపోయింది. ప్రస్తుతం డికాక్‌ 17, సూర్యకుమార్‌ యాదవ్‌ 4 పరుగులతో క్రీజులో​ ఉన్నారు. 

సిక్సర్ల రోహిత్‌.. ముంబై స్కోరు 48/0
ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ వరుస ఓవర్లలో రెండు సిక్సర్లు బాదాడు. ముజీబ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌లో 5వ బంతిని డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాత భువీ వేసిన ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లో ఐదో బంతిని మరోసారి మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. ప్రస్తుతం ముంబై 5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. రోహిత్‌ 26, డికాక్‌ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఫోర్‌తో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ముంబై
ఎస్‌ఆర్‌హెచ్‌తో జరగుతున్న మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌  ఫోర్‌తో ఆరంభించింది. భువీ వేసిన మొదటి ఓవర్‌ మొదటి బంతినే ముంబై ఓపెనర్‌ క్వింటర్‌ డికాక్‌ ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాత ఓవర్‌ ఐదో బంతికి డికాక్‌ మరో ఫోర్‌ బాదాడు. ప్రస్తుతం ముంబై 2 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. డికాక్‌ 9, రోహిత్‌ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్‌లో విజయం కోసం ఎదురుచూస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నేడు ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. చెపాక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌ ఎంచుకుంది.కాగా ఈ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్‌ ఒక మార్పుతో బరిలోకి దిగగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగు మార్పులతో బరిలోకి దిగింది.

రికార్డుల పరంగా చూసుకుంటే ఇరు జట్లు పోటాపోటీగా ఉన్నాయి. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 16 మ్యాచ్‌ల్లో చెరో 8 మ్యాచ్‌లు గెలుపొందాయి. ఇక టీమ్స్ సాధించిన స్కోర్లని ఓసారి పరిశీలిస్తే.. హైదరాబాద్‌పై ముంబయి చేసిన అత్యధిక స్కోరు 208 పరుగులు కాగా.. ముంబైపై హైదరాబాద్ చేసిన అత్యధిక స్కోరు 178 పరుగులుగా ఉంది. ఇక ముంబై అత్యల్ప స్కోరు 87కాగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ 96 పరుగులుగా ఉంది. ఇక ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబయి, హైదరాబాద్ జట్లు రెండు మ్యాచ్‌ల్లో తలపడగా..చెరొక మ్యాచ్‌‌లో విజయం సాధించాయి.

ఇరు జట్ల బలబలాల విషయానికి వస్తే..  ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో ఫామ్ అందుకోగా.. ఇక జానీ బెయిర్‌ స్టో, మనీశ్ పాండే మెరుపులు మెరిపిస్తున్నా.. చివరి వరకూ క్రీజులో ఉండి కూడా మ్యాచ్‌లు గెలిపించలేకపోతున్నాడు. విజయ్ శంకర్, అబ్దుల్ సమద్‌లు ఫాంలో లేకపోవడం కలవరపెడుతుంది.ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ రాకతో హైదరాబాద్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతమైంది.

ముంబయి ఇండియన్స్ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ నిలకడగా ఆడుతున్నప్పటికీ.. హిట్‌మ్యాన్ మార్క్ ఇన్నింగ్స్‌ కనబడటం లేదు. మరో ఓపెనర్ డికాక్ ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. అయితే.. సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడుతూ ఆ జట్టు బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. ఇషాక్ కిషన్, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్లు చేజార్చుకుంటున్నారు. దాంతో.. ఈరోజు మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బౌలింగ్ పరంగా ముంబయి ఇండియన్స్ ఇప్పుడు మంచి సమతూకంతో కనిపిస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.. ఆ టీమ్ పేస్ దళాన్ని నడిపిస్తుండగా.. స్పిన్నర్ రాహుల్ చాహర్ మ్యాచ్‌లను మలుపు తిప్పే ప్రదర్శన కనబరుస్తున్నాడు.
తుది జట్లు: 
ఎస్‌ఆర్‌హెచ్‌: డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), మనీష్ పాండే, విజయ్ శంకర్, జానీ బెయిర్‌ స్టో, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్,అభిషేక్‌ శర్మ, ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌, ఖలీల్‌ అహ్మద్‌, విరాట్‌ సింగ్‌

ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్‌ డికాక్‌‌, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, ఆడమ్‌ మిల్నే‌, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా,  రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement