Photo Courtesy: IPL Twitter
అహ్మదాబాద్: ‘‘అద్భుతమైన, అమోఘమైన ఇన్నింగ్స్. ఇతడి బ్యాటింగ్ విధ్వంసాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. తనదైన షాట్లతో మనకు ఆనందాన్ని పంచుతాడు. వహ్వా అనిపించే ప్రదర్శన చేస్తాడు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్, ఆర్సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడొక జీనియస్ అని, ఓపెనర్‌గా పంపిస్తే ఇంకా బాగుంటుందని ఆర్సీబీకి సూచించాడు. కాగా అహ్మదాబాద్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. 42 బంతుల్లో, 75 పరుగులు(3 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో 5 వేల పరుగుల మార్కును చేరుకున్న రెండో విదేశీ ఆటగాడిగా కూడా ఘనత సాధించాడు.
ఈ నేపథ్యంలో సునీల్ గావస్కర్ మాట్లాడుతూ... ‘‘ ఏబీడీ సూపర్బ్‌గా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసి తను కొట్టిన ఓ సిక్సర్ హైలెట్. నాకైతే ఆ థర్డ్‌మాన్ మీదుగా కొట్టిన షాట్ ఫేవరెట్. ఏబీడీ ఒక జీనియస్. తను బ్యాటింగ్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాం అంతే. అతడిని ఓపెనర్‌గా ఎందుకు పంపించకూడదు. అలా అయితే తన విశ్వరూపం మరింతగా చూసే అవకాశం లభిస్తుంది కదా. ఏబీడీ 20 ఓవర్ల ఆట చూడాలని ఎవరికైనా ఉంటుంది కదా. ఒక బ్యాట్స్‌మెన్‌గా ఏబీడీ ఇలాంటి భీకరమైన ఫాంలో ఉన్నపుడు నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment