IPL 2022 Mega Auction: 10 జట్లు... చేతిలో రూ. 561.50 కోట్లు... అదృష్టం పరీక్షించుకోనున్న 600 మంది... క్రికెట్ అభిమానుల పండగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అసలు ఆటకు ముందు ‘నోట్లాట’కు రంగం సిద్ధమైంది. నాలుగేళ్ల విరామం తర్వాత పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు అందుబాటులోకి వస్తూ మెగా వేలం జరగనుంది. అబ్బో అనిపించే ఆశ్చర్యాలు, అయ్యో అనిపించే నిరాశలు, ఆహా అనిపించే ఎంపికలు, అంతేనా అనిపించే సర్దుబాట్లు... ఎప్ప టిలాగే ఇలా అన్ని భావోద్వేగాలు అభిమానుల నుంచి కనిపించవచ్చు.
ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తన పేరు రాగానే ఆటగాళ్ల లబ్‌డబ్ చప్పుళ్ల వేగం గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క సీజన్ వరకే కాకుండా భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుంటూ ఫ్రాంచైజీలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. వేలంలో ఎవరు ఎంత ధరతో రికార్డులు బద్దలు కొడతారనేది ఆసక్తికరం!
వేలం వేదిక: బెంగళూరు
వేలం తేదీలు: ఫిబ్రవరి 12, 13
మొత్తం జట్లు: ఇప్పటికే ఉన్న 8 టీమ్‌లతో పాటు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా వచ్చాయి.
ఇప్పటికే రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల సంఖ్య: 33
వేలం బరిలో ఉన్నవారు: 600 మంది (377 మంది భారతీయులు, 223 విదేశీ ఆటగాళ్లు)
వేలంలో ఎంపికయ్యే అవకాశం ఉన్న ఆటగాళ్లు: 227 (గరిష్టంగా)
ఒక్కో టీమ్‌లో ఎంత మంది: కనిష్టంగా 18, గరిష్టంగా 25 (ఇందులో 8 మంది విదేశీయులు)
ఒక్కో జట్టు ఖర్చు చేయాల్సిన సొమ్ము: గరిష్టంగా ప్రతీ జట్టుకు రూ. 90 కోట్ల వరకు ఖర్చు చేసే అనుమతి ఉండగా...ఆటగాళ్లను ఎంచుకునేందుకు కనిష్టంగా 67.5 కోట్లయినా వాడాలి.
తొలి రోజు ఎంత మంది: శనివారం వేలంలో 161 మంది క్రికెటర్లు మాత్రమే అందుబాటులోకి వస్తారు. మిగిలిన ఆటగాళ్ల కోసం ఆదివారం కూడా వేలం ‘యాక్సెలరేటెట్ ప్రాసెస్’ ద్వారా కొనసాగుతుంది. అంటే 161 పోగా, మిగిలిన 439 మందిని ఆదివారం వేలంలోకి తీసుకురారు. తొలి రోజు ముగిసిన తర్వాత పది ఫ్రాంచైజీలు ఇంకా ఎవరెవరు వేలంలో ఉంటే బాగుంటుందని తమ సూచనలు ఇస్తాయి. ఆ ఆటగాళ్లు పేర్లు మాత్రమే రెండో రోజు వేలంలో వినపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment