
File Photo
ఐపీఎల్-2022లో అదరగొడుతోన్న లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో అతడిని దక్కించుకోవడానికి లక్నోతో ఏ జట్టు పోటీపడకపోవడం, అతడికి భారీ ధర దక్కకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఆకాశ్ చోప్రా తెలిపాడు. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డికాక్ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. 52 బంతుల్లో 80 పరుగులు సాధించి లక్నో విజయంలో డికాక్ కీలక పాత్ర పోషించాడు.
"ఐపీఎల్ మెగా వేలంలో క్వింటన్ డి కాక్‌ను కొనుగోలు చేసి లక్నో సూపర్ జెయింట్స్ సరైన నిర్ణయం తీసుకుంది. వేలంలో డికాక్ మార్క్యూ(ప్రధాన) జాబితాలో ఉన్నాడు. అయినప్పటికీ అతడి కోసం జట్లు ఎందుకు పోటీ పడలేదో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అతడు వేలంలో 10 కోట్లకు అమ్ముడుపోతాడని నేను భావించాను. కానీ అతడిని కేవలం 6.75 కోట్లకే లక్నో కొనుగోలు చేసింది.
అతడిని అంత తక్కువ ధరకు కొనుగోలు చేస్తారని అని నేను అనుకోలేదు. కానీ లక్నో మాత్రం అతడిని దక్కించుకుని సరైన నిర్ణయం తీసుకుంది. అతడు బ్యాట్‌తో పాటు కీపర్‌గా అద్భుతంగా రాణిస్తాడు. అదే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా డికాక్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. నోర్జే లాంటి స్టార్ పేసర్‌కు చుక్కలు చూపించాడు. తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు" అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022 LSG Vs DC: రిషభ్ పంత్‌కు భారీ షాక్! అసలే వరుస ఓటములు.. ఇప్పుడిలా!