![LSG VS KKR: De Kock And KL Rahul Smash Records With Unbroken Opening Stand - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/05/19/kd.jpg.webp?itok=4850md1Q)
Photo Courtesy: IPL
ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశలో క్రికెట్ ప్రేమికులకు కావాల్సిన అసలుసిసలైన మజా లభించింది. నిన్న (మే 18) లక్నో సూపర్ జెయింట్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు రెచ్చిపోయి ప్రేక్షకులకు కనువిందు కలిగించారు. ముఖ్యంగా లక్నో ఓపెనర్లు డికాక్ (70 బంతుల్లో 140 నాటౌట్; 10 ఫోర్లు, 10 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 68 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు)లు ఆకాశమే హద్దుగా చెలరేగి చాలాకాలం తర్వాత అసలైన ఐపీఎల్ మజాను ప్రేక్షకులకు అందించారు.
అనంతరం కేకేఆర్ బ్యాటర్లు సైతం అద్భుతమైన పోరాట పటిమ కనబర్చడంతో మ్యాచ్ చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది. అయితే కేకేఆర్ ఆఖరి రెండు బంతులకు రెండు వికెట్లు కోల్పోవడంతో 2 పరుగుల స్వల్ప తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఫలితంగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కథ ముగిసినట్లైంది. లక్నో దర్జాగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.
కాగా, ఈ మ్యాచ్‌లో డికాక్-రాహుల్ విధ్వంసం ధాటికి చాలాకాలంగా పదిలంగా ఉన్న పలు రికార్డులు బద్దలయ్యాయి. ఈ ఇద్దరూ వ్యక్తిగతంగానూ, అలాగే ఓపెనింగ్ జోడీగా పలు కొత్త రికార్డులు నమోదు చేశారు. డికాక్-రాహుల్ సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం.
అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం..
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి వికెట్‌కు అజేయమైన 210 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించిన డికాక్-రాహుల్ జోడీ ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామాయన్ని నెలకొల్పారు. ఈ రికార్డు గతంలో సన్‌రైజర్స్ ఓపెనర్లు జానీ బెయిర్ స్టో-డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. 2019లో ఈ జోడీ తొలి వికెట్‌కు 185 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అంతకుముందు 2017 సీజన్‌లో కేకేఆర్ ఓపెనర్లు గౌతం గంభీర్-క్రిస్ లిన్‌లు తొలి వికెట్‌కు 184 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
ఐపీఎల్ చరిత్రలో తొలి జోడీగా..
ఐపీఎల్ చరిత్రలోనే 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉన్న ఏకైక జోడీగా డికాక్-రాహుల్ జోడీ రికార్డుల్లోకెక్కింది. లీగ్ చరిత్రలో ఏ జోడీ కూడా మొత్తం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయలేదు.
కేకేఆర్‌పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం..
డికాక్-రాహుల్ జోడీ కేకేఆర్‌పై అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని (అజేయమైన 210 పరుగుల) నెలకొల్పింది. 2017లో ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్-శిఖర్ ధవన్‌లు తొలి వికెట్‌కు 139 పరుగులు జతచేశారు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు కేకేఆర్‌పై ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం.
ఐపీఎల్ చరిత్రలో ఏ వికెట్‌కైనా మూడో అత్యుత్తమ భాగస్వామ్యం..
- కోహ్లి-డివిలియర్స్ (229) ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ లయన్స్ (2016)
- కోహ్లి-డివిలియర్స్ (215) ఆర్సీబీ వర్సెస్ ముంబై (2015)
- డికాక్-రాహుల్ (210) లక్నో వర్సెస్ కేకేఆర్ (2022)
ఐపీఎల్‌లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు..
- క్రిస్ గేల్ (175 నాటౌట్) ఆర్సీబీ వర్సెస్ పూణే (2013)
- బ్రెండన్ మెక్ కల్లమ్ (158 నాటౌట్) కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ (2008)
- క్వింటన్ డికాక్ (140 నాటౌట్) లక్నో వర్సెస్ కేకేఆర్ (2022)
- ఏబీ డివిలియర్స్ (133 నాటౌట్) ఆర్సీబీ వర్సెస్ ముంబై (2015)
- కేఎల్ రాహుల్ (132 నాటౌట్) పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ (2020)
పొట్టి క్రికెట్ చరిత్రలో అజేయమైన ఓపెనింగ్ జోడీగా..
డికాక్-రాహుల్ జోడీ పొట్టి క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సాధించింది. ఈ జోడీ టీ20 ఫార్మాట్‌లో అజేయమైన నాలుగో ఓపెనింగ్ జోడీగా రికార్డుల్లోకెక్కింది. 2013 బీపీఎల్‌లో నఫీస్-రాజ్‌షాహీ జోడీ తొలిసారి టీ20ల్లో అజేయమైన ఓపెనింగ్ జోడీ (20 ఓవర్లు ఆడి)గా నిలువగా... 2017లో పాక్ వేదికగా జరిగే నాట్ టీ20 కప్‌లో కమ్రాన్ అక్మల్- సల్మాన్ బట్ జోడీ.. ఇదే ఏడాది (2022) జిబ్రాల్టర్-బల్గేరియా మధ్య జరిగిన అంతర్జాతీయ టీ20లో బ్రూస్-పాయ్ జోడీ పొట్టి ఫార్మాట్‌లో అజేయమైన ఓపెనింగ్ జోడీలుగా నిలిచారు.
రాహుల్ వరుసగా ఐదోసారి..
ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ వరుసగా ఐదో ఏడాది 500 పరుగులను దాటాడు. ఇలా సాధించిన వారిలో రాహుల్ రెండో స్థానంలో నిలిచాడు. డేవిడ్ వార్నర్ (6) తొలి స్థానంలో ఉండగా.. రాహుల్ (5), విరాట్ (5), శిఖర్ (5)లు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు.
మరిన్ని..
- ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్ కీపర్ డికాక్ రికార్డుల్లోకెక్కాడు.
- డికాక్: ఈ సీజన్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (10)లు కొట్టిన బ్యాటర్ రికార్డు. 2019 సీజన్ తర్వాత (పోలార్డ్) ఓ ఇన్నింగ్స్‌లో 10 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా మరో రికార్డు.
- ఐపీఎల్ చరిత్రలో ఓపెనర్లిద్దరు 500 పరుగులు దాటడం ఇది రెండోసారి. 2021లో రుతురాజ్ గైక్వాడ్-ఫాఫ్ డుప్లెసిస్ (సీఎస్‌కే) ఈ అరుదైన ఘనతను సాధించగా, తాజాగా డికాక్ (502), రాహుల్ (537) వారి సరసన చేరారు.
చదవండి: డికాక్ విధ్వంసం.. ఉత్కంఠ పోరులో లక్నోదే విజయం
Comments
Please login to add a commentAdd a comment