IPL 2022 Auction- Tilak Varma: ఐపీఎల్ మెగా వేలం-2022లో ముంబై ఇండియన్స్ జట్టు తనను కొనుగోలు చేసిందని తెలియగానే తన కోచ్ సంతోషంతో ఉప్పొంగిపోయారని హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ అన్నాడు. ఆనందం పట్టలేక ఒక్కసారిగా బోరున ఏడ్చేశారని ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ఇక తన తల్లిదండ్రులైతే ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడలేకపోయారన్నాడు. కాగా సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తిలక్ వర్మ తండ్రి నాగరాజు, కోచ్ సాలమ్ బయాష్ ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగాడు.
యువ భారత జట్టులో 19 ఏళ్ల సభ్యుడైన అతడు.. ఇటీవల ముగిసిన దేశవాళీ వన్డే టోర్నీలో విజయ్ హజారే ట్రోఫీలో 180 పరుగులు చేశాడు. అదే విధంగా.. టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 215 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరిగిన మెగా వేలంలో భాగంగా ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తిలక్ వర్మ కోసం పోటీపడింది. ఆఖరికి కోటీ డెబ్బై లక్షలకు అతడిని కొనుగోలు చేయడంతో తిలక్ వర్మకు జాక్‌పాట్ దక్కింది.
ఇక ఐపీఎల్-2022 సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా తిలక్ వర్మ ఫ్రాంఛైజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోచ్‌తో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. ‘‘వేలం జరుగుతున్నపుడు నేను మా కోచ్‌తో వీడియో కాల్ మాట్లాడుతున్నాను. నన్ను ముంబై 1.7 కోట్లకు కొనుగోలు చేసిందని తెలియగానే.. మా కోచ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన తన స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఒక్కసారిగా ఏడ్చేశారు.
మేము పడ్డ కష్టం గుర్తుకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత నేను మా అమ్మానాన్నకు ఫోన్ చేశాను. వాళ్లు ఆనందంతో మాట్లాడలేకపోయారు. వారి కళ్ల వెంట నీళ్లు దుమికాయి. నా కష్టానికి ప్రతిఫలం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
నిజానికి టెన్నిస్ బాల్‌తో నా క్రికెట్ ఆట మొదలైంది. ఆ సమయంలో నన్ను చూసిన మా కోచ్.. ఈ పిల్లాడు బంతిని భలే బాదుతున్నాడే అంటూ ముచ్చటపడ్డారు. నాకు కోచ్ అయ్యారు. ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. నాకు శిక్షణనిస్తే మంచి క్రికెటర్‌గా ఎదుగుతానని ఆయన నమ్మారు. మా తల్లిదండ్రులతో మాట్లాడారు. నన్ను కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేయమని కోరారు.
అందుకు మా అమ్మానాన్న అంగీకరించారు. కానీ ఆర్థిక కష్టాలు వెంటాడాయి. బ్యాట్లు, ప్యాడ్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. అప్పుడు మా కోచ్ ఆయన స్నేహితుడి సాయంతో బ్యాట్ కొనిచ్చారు. అండర్ 14 క్రికెట్ ఆడుతున్నపుడు ఒకే ఒక్క బ్యాట్ ఉండేది. అది మెల్లగా విరిగిపోవడం మొదలైంది. అప్పుడు టేప్‌తో అతికించి దానిని వాడుకునేవాడిని. నాకోసం నా కోచ్ ఎంతో చేశారు’’ అంటూ కష్టాల్లో అండగా నిలబడ్డ గురువు పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.
"When I was sold to MI, my coach had tears in his eyes!" 🥺
— Mumbai Indians (@mipaltan) February 24, 2022
📽️ : The young gun Tilak Varma expresses how emotional his coach and parents were after the Auction! 🙌
Read his exclusive interview 👉 https://t.co/FQ5AfsWdTw #OneFamily #MumbaiIndians pic.twitter.com/hytPLZGKfU
Comments
Please login to add a commentAdd a comment