IPL 2022 RR Vs RCB: Dinesh Karthik And Shahbaz Super Innings Helps RCB To Beat RR By 4 Wickets - Sakshi
Sakshi News home page

IPL 2022: శభాష్‌ షహబాజ్‌... సూపర్‌ కార్తీక్‌! ఆర్సీబీ సంచలన విజయం

Published Wed, Apr 6 2022 7:21 AM | Last Updated on Wed, Apr 6 2022 12:10 PM

IPL 2022: DK And Shahbaz Super Innings RCB Beat RR By 4 Wickets - Sakshi

షహబాజ్‌ అహ్మద్, దినేశ్‌ కార్తీక్‌( PC: IPL/BCCI)

IPL 2022 RCB Vs RR- Shahbaz, Dinesh Karthik- ముంబై: 170 పరుగుల ఛేదనలో బెంగళూరు స్కోరు ఒకదశలో 87/5... మరో 45 బంతుల్లో 83 పరుగులు చేయాలి... ఐపీఎల్‌లో పెద్దగా అనుభవం లేని షహబాజ్‌ అహ్మద్, చాలా కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వని దినేశ్‌ కార్తీక్‌ క్రీజ్‌లో ఉన్నారు. దాంతో ఆర్‌సీబీ విజయంపై అంతా అపనమ్మకం! అయితే వీరిద్దరు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చెలరేగారు. 33 బంతుల్లోనే 67 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.

మంగళవారం జరిగిన పోరులో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (47 బంతుల్లో 70 నాటౌట్‌; 6 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, హెట్‌మైర్‌ (31 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), పడిక్కల్‌ (29 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. బట్లర్, హెట్‌మైర్‌ నాలుగో వికెట్‌కు 51 బంతుల్లో అభేద్యంగా 83 పరుగులు జోడించారు.

అనంతరం బెంగళూరు 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. షహబాజ్‌ అహ్మద్‌ (26 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), దినేశ్‌ కార్తీక్‌ (23 బం తుల్లో 44 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిశారు.  

చివర్లో దూకుడు... 
ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు క్రీజ్‌లో ఉన్నా బట్లర్‌ ఆడింది 47 బంతులే... బట్లర్‌ ఎంత బలంగా కొట్టినా బంతి ఫీల్డర్లను దాటలేదు, ఫలితంగా ఒక్క ఫోర్‌ కూడా లేదు... రెండు సార్లు క్యాచ్‌లు మిస్‌!  బ్యాటింగ్‌కు అసలు ఏమాత్రం అనుకూలించని పిచ్‌పై నిర్లక్ష్యంగా ఆడి వికెట్‌ పారేయకుండా బట్లర్‌ పట్టుదలగా నిలవడం వల్లే జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.

కొద్దిసేపు పడిక్కల్, చివర్లో హెట్‌మైర్‌ అతనికి అండగా నిలిచి ఇన్నింగ్స్‌లో కీలకపాత్ర పోషించారు. కీలక సమయంలో రెండు లైఫ్‌లు బట్లర్‌ నిలదొక్కుకునేలా చేశాయి. 10 పరుగుల వద్ద ఆకాశ్‌ దీప్‌ రిటర్న్‌ క్యాచ్‌ వదిలేయగా, 11 పరుగుల వద్ద విల్లీ అంచనా తప్పి క్యాచ్‌ పట్టుకోవడంలో విఫలమయ్యాడు.

బట్లర్, పడిక్కల్‌ రెండో వికెట్‌కు 49 బంతుల్లో 70 పరుగులు జోడించగా, సామ్సన్‌ (8) ప్రభావం చూపలేకపోయాడు. 18 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 127 పరుగులు. అయితే చివరి 2 ఓవర్లలో 42 పరుగులతో రాయల్స్‌ పండగ చేసుకుంది. సిరాజ్‌ వేసిన 19వ ఓవర్లో బట్లర్‌ 2 సిక్స్‌లు సహా 19 పరుగులు రాగా, ఆకాశ్‌ దీప్‌ వేసిన 20వ ఓవర్లో బట్లర్‌ రెండు, హెట్‌మైర్‌ ఒక సిక్స్‌ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి.  

కోహ్లి రనౌట్‌... 
ఛేదనలో ఆర్‌సీబీకి సరైన ఆరంభం లభించింది. డుప్లెసిస్‌ (20 బంతుల్లో 29; 5 ఫోర్లు), రావత్‌ (25 బంతుల్లో 26; 4 ఫోర్లు) వేగంగా పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లేలో స్కోరు 48 పరుగులకు చేరింది. ఒకదశలో వీరిద్దరు ఏడు బంతుల వ్యవధిలో ఐదు ఫోర్లు కొట్టారు. అయితే చహల్‌ తన తొలి ఓవర్లోనే డుప్లెసిస్‌ను అవుట్‌ చేసి రాయల్స్‌కు మొదటి వికెట్‌ అందించాడు.

ఆ తర్వాత బెంగళూరు పరుగు వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి కోహ్లి (5) అనూహ్యంగా రనౌట్‌ కాగా, తర్వాతి బంతికే విల్లీ (0) వెనుదిరిగాడు. రూథర్‌ఫర్డ్‌ (5) కూడా విఫలం కావడంతో ఆర్‌సీబీ 87 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది.

బెంగళూరు ఆశలు కోల్పోయిన ఈ స్థితిలో షహబాజ్, కార్తీక్‌ భాగస్వామ్యం ఒక్కసారిగా మ్యాచ్‌ను మలుపు తిప్పింది. వీరిద్దరి దూకుడైన ఆటతో ఆర్‌సీబీ విజయం దిశగా దూసుకుపోయింది. అశ్విన్‌ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్‌తో కార్తీక్‌ జోరు మొదలు పెట్టగా, ప్రసిధ్‌ బౌలింగ్‌లో షహబాజ్‌ ఫోర్, సిక్స్‌ బాదాడు. బౌల్ట్‌ ఓవర్లోనూ మరో ఫోర్, సిక్స్‌ తో చెలరేగిన షహబాజ్‌ అదే ఓవర్లో అవుటైనా... కార్తీక్‌ నిలబడి బెంగళూరును గెలిపించాడు. 

చదవండి: Ravi Shastri: "అతడు యార్కర్ల కింగ్‌.. ప్రపంచకప్‌లో అతడి సేవలను కోల్పోయాం"

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement