మరొక రోజులో ఐపీఎల్ 15వ సీజన్‌కు తెరలేవనుంది. ఇంతకముందు ఉన్న ఎనిమిది జట్లకు తోడుగా మరో రెండు జట్లు వచ్చి చేరాయి. దీంతో రెండు గ్రూఫులుగా విడదీసి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. వీటికి అదనంగా కొత్త రూల్స్, 25 శాతం మంది ప్రేక్షకులకు అనుమతితో ఈసారి ఐపీఎల్ కన్నుల పండువగా జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ ఐపీఎల్‌లో ఎన్నడూ లేనంతగా ఈసారి నలుగురు కొత్త కెప్టెన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
-సాక్షి, వెబ్‌డెస్క్
వారే రవీంద్ర జడేజా,మయాంక్ అగర్వాల్, డుప్లెసిస్, హార్దిక్ పాండ్యా. వీరందరికి కెప్టెన్సీ కొత్తే. కత్తిమీద సాములాంటి కెప్టెన్సీని ఎలా డీల్ చేస్తారో.. వీరిలో ఎవరు కెప్టెన్‌గా మెయిడెన్ టైటిల్ కొట్టనున్నారో వేచిచూద్దాం. దానికి ముందు ఈ నలుగురి గురించి ఒకసారి తెలుసుకుందాం.
రవీంద్ర జడేజా(సీఎస్‌కే కెప్టెన్)
ఎంఎస్ ధోని అనూహ్య నిర్ణయంతో రవీంద్ర జడేజా ఆఖరి నిమిషంలో కెప్టెన్ అయ్యాడు. ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు ధోని తాను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. ధోనియే స్వయంగా ఆ బాధ్యతను జడేజాకు అప్పగించాడని.. ఇకపై జడ్డూనే జట్టును ముందుండి నడిపిస్తాడని సీఎస్‌కే ట్వీట్ చేసింది. అయితే జడేజాకు కెప్టెన్‌గా అనుభవం లేదు. తన 13 ఏళ్ల కెరీర్‌లో జడేజా ఏనాడు ఒక్క మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించలేదు. మరి అనుభవం లేని జడేజా సీఎస్‌కే ఎలా ముందుకు నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. పైగా లీగ్ ముంబై ఇండియన్స్ తర్వాత అత్యధిక టైటిల్స్ గెలిచిన జట్టుగా సీఎస్‌కేకు పేరు ఉంది.
ఇక ఐపీఎల్‌లో ధోని కెప్టెన్సీ రికార్డు అమోఘం. లీగ్ చరిత్రలోనే ఒక జట్టను అత్యధిక సార్లు ఫైనల్ తీసుకెళ్లిన కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు. మరి అతని వారసత్వాన్ని జడేజా కొనసాగిస్తాడా.. లేక ఒక సీజన్‌కే కెప్టెన్‌గా పరిమితమవుతాడా అనేది చూడాలి. అయితే ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ జట్టులో పెద్దన్న పాత్ర పోషించడం గ్యారంటీ. జడేజాకు సహాయం చేయడంలో ముందుంటాడు. ఈ విషయాన్ని జడేజా కూడా చెప్పాడు. ధోని భయ్యా నాకు ఒక లిగసీని సెట్ చేశాడు.. దానిని నేను ముందుకు తీసుకెళ్లాలి. కెప్టెన్సీ అనేది నాకు పెద్ద బాధ్యత.. కానీ ధోని భయ్యా ఉన్నాడుగా పర్లేదు అని పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్‌లో జడేజా ప్రస్థానం రాజస్తాన్ రాయల్స్‌తో మొదలైనప్పటికి ఎక్కువకాలం ఆడింది మాత్రం సీఎస్‌కేకే. 2012 నుంచి సీఎస్‌కేలో ఉన్న జడేజా ఇప్పటివరకు ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లాడి 2386 పరుగులు చేశాడు.
ఫాఫ్ డుప్లెసిస్(ఆర్‌సీబీ కెప్టెన్)
ఐపీఎల్‌లో అత్యంత దురదృష్టమైన జట్టుగా ఆర్‌సీబీకి పేరుంది. ప్రతీసారి మంచి అంచనాలతో బరిలోకి దిగే ఆర్‌సీబీ అసలు ఆటలో బోల్తా కొడుతుంది. పేపర్‌పై బలంగా కనిపించే ఆర్‌సీబీ మూడుసార్లు ఫైనల్ మెట్టుపై జారిపడింది. అలాంటి ఆర్‌సీబీకి కోహ్లి వెన్నుముక అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధోని లాగే కోహ్లి కూడా ఆరంభం నుంచి ఆర్‌సీబీ తరపునే ఆడాడు. 2013లో ఆర్‌సీబీ కెప్టెన్ అయిన కోహ్లి 9 ఏళ్ల పాటు జట్టును నడిపించాడు. ఈ తొమ్మిదేళ్లలో కోహ్లి నాయకత్వంలో ఆర్‌సీబీ ఒకసారి ఫైనల్ చేరుకోగా.. మరో మూడుసార్లు ప్లేఆఫ్ వరకు వచ్చింది. మిగతా ఐదుసార్లు లీగ్ దశలోనే నిష్క్రమించింది.
అయితే 2021 ఐపీఎల్ సీజన్ మధ్యలోనే కోహ్లి తాను కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు.. వచ్చే సీజన్ నుంచి ఆటగాడిగా మాత్రమే ఉంటానని పేర్కొన్నాడు. దీంతో ఆర్‌సీబీకి కొత్త కెప్టెన్ ఎవరొస్తారనేది ఆసక్తికరంగా మారింది. మెగావేలం ముగిసిన తర్వాత దినేష్ కార్తిక్, మ్యాక్స్‌వెల్ పేర్లు బాగా వినిపించినప్పటికి.. అనూహ్యంగా డుప్లెసిస్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు ఒక్కసారి టైటిల్ గెలవని ఆర్‌సీబీపై తీవ్ర ఒత్తిడి ఉంది. మరి ఆ ఒత్తిడిని డుప్లెసిస్ అధిగమించి ఆర్‌సీబీని విజేతగా నిలుపుతాడా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక ఐపీఎల్‌లో ధోని సారధ్యంలో సీఎస్‌కేకు ఆడిన డుప్లెసిస్ మంచి ప్రదర్శన కనబరిచాడు. పలుమార్లు తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. సౌతాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఎంత పేరు సంపాదించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే పేరు ఐపీఎల్‌లోనూ దక్కించుకున్నాడు. ఇకపోతే డుప్లెసిస్‌కు కెప్టెన్సీ ఐపీఎల్‌లో కొత్త కావొచ్చు.. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం అతను సౌతాఫ్రికాకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇది అతనికి కలిసొచ్చే అంశం. తన హయాంలో సౌతాఫ్రికా కొన్ని మేజర్ సిరీస్‌ల్లో విజయాలు అందుకుంది. మరి అదే జోరును డుప్లెసిస్ ఐపీఎల్‌లోనూ కనబరుస్తాడని ఆశిద్దాం. ఆర్‌సీబీకి తొలి టైటిల్ అందించే కెప్టెన్‌గా డుప్లెసిస్ నిలుస్తాడేమో చూద్దాం. ఇక ఐపీఎల్‌లో డుప్లెసిస్ 100 మ్యాచ్‌ల్లో 2935 పరుగులు సాధించాడు.
మయాంక్ అగర్వాల్(పంజాబ్ కింగ్స్ కెప్టెన్)
ఐపీఎల్‌లో ఇంతవరకు టైటిల్ గెలవని మరో జట్టు పంజాబ్ కింగ్స్(గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్). ఎన్నోసార్లు కెప్టెన్లు మారినా జట్టు తలరాత మాత్రం మారలేదు. లీగ్ చరిత్రలో 2008లో ప్లే ఆఫ్, 2014 ఫైనల్ మినహా పంజాబ్ ఎప్పుడు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేదు. గతేడాది సీజన్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో పంజాబ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే కేఎల్ రాహుల్ ఈసారి కొత్తగా వచ్చిన లక్నో ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వెళ్లడంతో పంజాబ్ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు.
కొన్నేళ్లుగా పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న మయాంక్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదగాడు. గత సీజన్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన మయాంక్‌ను రూ. 12 కోట్లతో రిటైన్ చేసుకుంది. అతనిపై నమ్మకంతో ధావన్‌ను కాదని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయంలో ధావన్ కూడా మయాంక్‌కే ఓటు వేశాడు. తనకంటే మయాంక్ సమర్ధుడని తెలిపాడు. అయితే మయాంక్‌కు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం పెద్దగా లేదు. మరి కొత్త కెప్టెన్‌గా మయాంక్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. మయాంక్ ఐపీఎల్ కెరీర్ పరిశీలిస్తే.. 100 మ్యాచ్‌ల్లో 2131 పరుగులు చేశాడు.
హార్దిక్ పాండ్యా(గుజరాత్ టైటాన్స్)
అదృష్టం కొద్ది కెప్టెన్ అయిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది హార్దిక్ పాండ్యా మాత్రమే. మెగావేలానికి ముందే కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ హార్దిక్‌పై నమ్మకముంచి రూ. 15 కోట్లకు రిటైన్ చేసుకుంది. అసలు ఫామ్‌లో లేని ఆటగాడు ఇలా ఒక జట్టుకు కెప్టెన్ అవుతాడని ఎవరు ఊహించి ఉండరు. ముంబై ఇండియన్స్‌లో కొన్నేళ్ల పాటు కీలక ఆటగాడిగా ఉన్న పాండ్యా గతేడాది నుంచి సరైన ఫామ్‌లో లేడు. ఆల్‌రౌండర్ ట్యాగ్‌తో టి20 ప్రపంచకప్ ఆడినప్పటికి దారుణంగా నిరాశపరిచాడు.
దీంతో టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. అప్పటినుంచి క్రికెట్ ఆడని హార్దిక్ కెప్టెన్‌గా నేరుగా ఐపీఎల్ ద్వారానే గ్రౌండ్‌లో అడుగుపెట్టనున్నాడు. అసలే దూకుడుకు మారుపేరుగా ఉండే హార్దిక్ కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇంతవరకు ఒక్క ఫార్మాట్‌లో కెప్టెన్ పాండ్యాకు అనుభవం లేదు. ఇక ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా 92 మ్యాచ్‌లాడి 1476 పరుగులతో పాటు బౌలింగ్‌లో 42 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IPL 2022: ఐపీఎల్ మోస్ట్ లక్కీ ప్లేయర్ కర్ణ్ శర్మ.. అతను అడుగుపెడితే టైటిల్ నెగ్గాల్సిందే..!
IPL 2022: చెలరేగిన డుప్లెసిస్.. ఆర్సీబీ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే..!
Comments
Please login to add a commentAdd a comment