జూలియన్ రాస్‌వుడ్(PC: PBKS)
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి... ఎన్ని ఫోర్లు బాది ఎంత వేగంగా వికెట్ల మధ్య పరుగెత్తినా టి20 క్రికెట్‌లో సిక్సర్ల మజాయే వేరు. ఇక క్రికెట్ వినోదం ఐపీఎల్‌లో అయితే నేరుగా గ్యాలరీల్లోకి పడే సిక్సర్లను మీటర్ల లెక్కన కొలిచి వాటి విలువను నిర్వాహకులు అమాంతం పెంచేస్తుంటారు.
మరి అలాంటప్పుడు సిక్స్ కొట్టడం కూడా ఒక ప్రత్యేక కళగా గుర్తించి అందులో శిక్షణ ఇస్తే ఎలా ఉంటుంది. దీనికి ఈ సారి ఐపీఎల్‌లో సమాధానం లభించనుంది. తొలి సారి ఒక జట్టు కేవలం సిక్సర్ల కోసమే కోచ్‌ను పెట్టుకోవడం విశేషం.
–సాక్షి క్రీడా విభాగం
హెడ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, మెంటార్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్... ఇలా ఐపీఎల్ జట్ల ప్రధాన సహాయక సిబ్బంది జాబితా చూస్తే చాలా పెద్దదే. ఇప్పుడు ఇందులోకి మరో పాత్ర కూడా వచ్చి చేరింది. అదే పవర్ హిట్టింగ్ కోచ్.
ఈ తరహా శిక్షణలో పేరుపొందిన ఇంగ్లండ్ మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ జూలియన్ రాస్‌వుడ్‌ను పంజాబ్ కింగ్స్ 2022 లీగ్ సీజన్ కోసం ఎంచుకుంది. తమ టీమ్‌లో ఉన్న మయాంక్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, ఒడెన్ స్మిత్, షారుఖ్ ఖాన్ వంటి హిట్టర్ల ఆటకు మరింత మెరుగులు దిద్ది ఫలితం రాబట్టాలని జట్టు ఆశిస్తోంది.
ఏమిటీ భిన్నం...
గతంలో బిగ్‌బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఇంగ్లండ్ కౌంటీల్లో పని చేసిన జూలియన్ రాస్‌వుడ్ ఐపీఎల్‌లోకి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. కార్లోస్ బ్రాత్‌వైట్, బెన్ స్టోక్స్, స్యామ్ బిల్లింగ్స్ తమ సిక్సర్లు బాదే నైపుణ్యం పెంచుకోవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. బౌలర్ గొప్పతనం, మంచి బంతా కాదా అనేది ఏమాత్రం పట్టించుకోరాదని, బలమంతా ఉపయోగించి బంతిని బాదడమే ఏకైక మంత్రమని అతను ఉపదేశిస్తాడు.
‘క్రీజ్‌లో బ్యాటర్ నిలబడిన తీరును బట్టి అతను ఎంత శక్తిని వాడగలడో తెలుస్తుంది. సంప్రదాయ శైలి షాట్లు ఆడే శరీరం, చేతుల సమన్వయం అనేది ఇక్కడ కుదరదు. నా దృష్టిలో ఈ రెండు వేర్వేరు. బేస్ బాల్ తరహాలో ఎడమ కాలు వెనక్కి వెళుతూ తుంటి భాగంపై భారం వేస్తే షాట్ కొట్టడం సులువవుతుంది.
వెస్టిండీస్ ఆటగాళ్లు సహజంగానే ఇలాంటివి ఆడతారు. ఆ నైపుణ్యం లేనివారిని అందుకు అనుగుణంగా తీర్చిదిద్దడమే నా పని’ అని జూలియన్ వివరించాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన సమయంలోనే టెక్సాస్ రేంజర్ బేస్‌బాల్ లీగ్ చూసిన అతను అదే శైలిని టి20 క్రికెట్‌లోకి తీసుకొచ్చాడు.
తనదైన శిక్షణ పద్ధతితో...
పవర్ హిట్టింగ్ శిక్షణకు జూలియన్ భిన్నమైన పద్ధతిని అనుసరిస్తాడు. బరువైన బ్యాట్‌లు, బరువైన బంతులతో పాటు ఆటగాళ్లు చేతులు, మోచేతికి బరువైన వస్తువులు అమర్చి షాట్‌లు ఆడేలా ప్రోత్సహిస్తాడు. నడుము చుట్టూ తాళ్లు చుట్టు దానిని ఒక పోల్‌కు కట్టేసి ఇతర శరీర భాగాలను వాడకుండా కేవలం మోచేతి బలంతోనే షాట్లు సాధన చేయించడంలో జూలియన్ తన ప్రత్యేకత ప్రదర్శిస్తాడు.
‘బేస్‌బాల్‌తో పోలిస్తే క్రికెట్‌లో టెక్నిక్ కాస్త భిన్నమే అయినా బంతిని బలంగా బాదడమే మనకు కావాల్సింది. ఫలితం గురించి ఆలోచించకుండా పూర్తి శక్తిని ఉపయోగిస్తే టి20ల్లో అద్భుతాలు జరుగుతాయి’ అని జూలియన్ విశ్లేషించాడు. అతని మార్గనిర్దేశనంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఎలాంటి ప్రయోజనం పొందుతారో చూడాలి.
🎥 Our powerhouse Julian Woods has big plans for our big hitters 💥#SaddaPunjab #PunjabKings #TATAIPL2022 pic.twitter.com/8XVdltLu2O
— Punjab Kings (@PunjabKingsIPL) March 14, 2022
It is Liam's world & we are just 𝗟𝗶𝘃𝗶𝗻𝗴 in it 😉 #SherSquad, excited to see him display his all-round skills? 🔥#SaddaPunjab #PunjabKings #TATAIPL2022 @liaml4893 pic.twitter.com/mp9KSPeiex
— Punjab Kings (@PunjabKingsIPL) March 21, 2022
Comments
Please login to add a commentAdd a comment