IPL 2023, GT Vs RR: ‘పిచ్చి వేషాలు వేసినా నన్నెవరూ ఏం చేయలేరు; అదే అర్జున్‌ టెండుల్కర్‌ను చూడండి!’ | Fans Brutally Slam Riyan Parag For Failing Yet Again - Sakshi
Sakshi News home page

#Riyan Parag: ‘పిచ్చి వేషాలు వేసినా నన్నెవరూ ఏం చేయలేరు! అదే అర్జున్‌ టెండుల్కర్‌ను చూడండి!’.. మామూలుగా కాదు..

Published Mon, Apr 17 2023 9:38 AM | Last Updated on Mon, Apr 17 2023 10:19 AM

IPL 2023 GT Vs RR: Fans Brutally Slam Riyan Parag If Nepotism Had Face - Sakshi

రియాన్‌ పరాగ్‌ (Photo Credit: IPL/ Twitter)

IPL 2023 GT Vs RR: రాజస్తాన్‌ రాయల్స్‌ యువ ‘ఆల్‌రౌండర్‌’ రియాన్‌ పరాగ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారుతున్న అతడిని తప్పించాలంటూ అభిమానులు రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌కు సూచిస్తున్నారు. ఆట తక్కువ.. ఓవరాక్షన్‌ ఎక్కువ ఉన్న రియాన్‌ను పక్కనపెట్టాల్సిన సమయం వచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

అల్లరి చేష్టలతో
రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున 2019లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అరంగేట్రం చేశాడు అసోం కుర్రాడు రియాన్‌ పరాగ్‌. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడిన అతడు.. 16 పరుగులు చేశాడు. అదే విధంగా 3 ఓవర్ల బౌలింగ్‌లో 24 పరుగులు ఇచ్చాడు. అరంగేట్ర మ్యాచ్‌లో పర్వాలేదనిపించిన రియాన్‌ పరాగ్‌.. నాటి నుంచి నేటి దాకా ఆట కంటే కూడా మైదానంలో తన చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు.

చెత్త ప్రదర్శన
గత సీజన్‌లో కేవలం 183 పరుగులు చేసి ఒక్క వికెట్‌ మాత్రమే తీసిన రియాన్‌ పరాగ్‌.. ఐపీఎల్‌-2023లోనూ విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 39. గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో అతడి ప్రదర్శన మరీ చెత్తగా ఉంది.

జట్టు కష్టాల్లో ఉన్న వేళ క్రీజులోకి వచ్చిన రియాన్‌ పరాగ్‌ 7 బంతులు ఎదుర్కొని కేవలం 5 పరుగులు చేశాడు. మేనేజ్‌మెంట్‌ వరుస అవకాశాలు ఇస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు అతడి ఆట తీరు, మేనేజ్‌మెంట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఏం పొడిచాడని?
‘‘తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు 51 మ్యాచ్‌లలో 41 ఇన్నింగ్స్‌ ఆడిన రియాన్‌ పరాగ్‌ చేసిన పరుగులు 561. సగటు 16.03. బౌలింగ్‌లోనూ పెద్దగా పొడిచిందేమీ లేదు! అయినా బంధుప్రీతి అంటే ఇదే కాబోలు. వరుసగా ఫెయిల్‌ అవుతున్నా అవకాశాలు మాత్రం వస్తూనే ఉంటాయి.

బంధుప్రీతి అంటే ఇదేనేమో
మైదానంలో తన చేష్టలు చూస్తుంటే ఆటకు స్వస్తి చెప్పి త్వరలోనే చీర్‌ లీడర్స్‌తో పాటు చేరతాడేమో అనిపిస్తోంది. ఆటపై దృష్టి పెట్టకుండా ప్రత్యర్థి బ్యాటర్లు అవుటైనపుడు వెకిలిగా వ్యవహరించడం.. తనను జట్టు నుంచి తీసివేసే దమ్ము ఎవరికీ లేదన్నట్లు ప్రవర్తించడం రియాన్‌కు చెల్లింది. రాజస్తాన్‌ ఓనర్లతో సంబంధాలు బాగున్నాయి(రియాన్‌ అంకుల్‌కు సెలక్షన్‌ మెంబర్‌తో దోస్తీ ఉందన్న ఉద్దేశంలో) గనుకే రియాన్‌ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడు.

అర్జున్‌ను చూడండి
అదే అర్జున్‌ టెండుల్కర్‌ విషయంలో చూడండి. తన తండ్రి సచిన్‌ టెండుల్కర్‌కు ముంబై ఇండియన్స్‌తో సత్సంబంధాలు ఉన్నా 2-3ఏళ్ల పాటు బెంచ్‌ మీదే ఉన్నాడు. ఈరోజు అరంగేట్రం చేశాడు’’ అంటూ ఈ 21 ఏళ్ల బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ను నెట్టింట కామెంట్లతో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. కాగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఆఖరి ఓవర్‌ వరకు పోరాడి 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

చదవండి: చెత్తగా ప్రవర్తించారు.. నితీశ్‌ రాణా, హృతిక్‌కు బీసీసీఐ షాక్‌! సూర్యకు భారీ జరిమానా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement