
కొత్త జెర్సీ ఆవిష్కరించిన లక్నో సూపర్ జెయింట్స్ (PC: LSG Twitter)
LSG Latest Jersey For IPL 2023: ఐపీఎల్-2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు సరికొత్త జెర్సీలో దర్శనమివ్వనున్నారు. తమ అరంగేట్ర సీజన్‌లో లక్నో ఆటగాళ్లు టర్కోయిష్ బ్లూ గ్రీన్‌లో ఉన్న జెర్సీలు ధరించగా.. ఈసారి ముదురు నీలం రంగు జెర్సీలో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించి ఫ్రాంఛైజీ తాజాగా ప్రకటన విడుదల చేసింది.
కొత్త రంగు.. కొంగొత్త ఆశలు
‘‘కొత్త రంగు.. నూతనోత్సాహం.. కొంగొత్త ఆశలు.. సరికొత్త శైలి’’తో ముందుకు వస్తున్నామంటూ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. నావీ బ్లూ షర్ట్‌పై ఎరుపు, ఆకుపచ్చ గీతలతో దీనిని రూపొందించారు. ఇక జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో లక్నో ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా, బీసీసీఐ కార్యదర్శి జై షా, లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, మెంటార్ గౌతమ గంభీర్ తదితరులు పాల్గొన్నారు.
మరీ చెత్తగా ఉంది
అయితే, అభిమానులకు మాత్రం ఈ జెర్సీ పెద్దగా నచ్చినట్లు కనిపించడం లేదు. సోషల్ మీడియా వేదికగా లక్నో జెర్సీ లుక్‌పై తమదైన శైలిలో సెటైర్లు పేలుస్తూ మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. ‘‘కొత్త జెర్సీ చూసిన తర్వాత పాత జెర్సీపై మమకారం పెరిగిపోయింది.
ఎందుకంటే.. కొత్తది మరీ చెత్తగా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంతమందేమో ఢిల్లీ క్యాపిటల్స్ పాత జెర్సీ(2013 నాటిది)తో పోలుస్తూ పెద్దగా తేడా ఏమీ లేదు కదా అంటూ డిజైనర్‌కు చురకలు అంటిస్తున్నారు.
ఆరంభంలోనే ప్లే ఆఫ్స్ చేరింది.. కానీ
ఐపీఎల్-2022 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన లక్నో సూపర్‌జెయింట్స్ 14 మ్యాచ్‌లకు గానూ తొమ్మిదింట గెలిచింది. ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించినప్పటికీ టైటిల్ రేసులో వెనుకబడింది రాహుల్ సేన. ఇక లక్నోతో పాటు ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ అరంగేట్ర సీజన్‌లోనే ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ జట్టు ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.
చదవండి: BCCI: వారికి 7 కోట్లు.. వీరికి 50 లక్షలు! నిర్ణయాలు భేష్! మరీ కోట్లలో వ్యత్యాసం.. తగునా?
IPL 2023: కోహ్లికి ముచ్చెమటలు పట్టించిన బౌలర్‌ను తెచ్చుకోనున్న ముంబై ఇండియన్స్
𝑵𝒂𝒚𝒂 𝑹𝒂𝒏𝒈, 𝑵𝒂𝒚𝒂 𝑱𝒐𝒔𝒉, 𝑵𝒂𝒚𝒊 𝑼𝒎𝒆𝒆𝒅, 𝑵𝒂𝒚𝒂 𝑨𝒏𝒅𝒂𝒂𝒛 👕💪#JerseyLaunch | #LucknowSuperGiants | #LSG pic.twitter.com/u3wu5LqnjN
— Lucknow Super Giants (@LucknowIPL) March 7, 2023