మా ఓటమికి కారణం అదే.. అతడు స్కోరు చేసి ఉంటే: రుతు | IPL 2024 DC vs CSK Ruturaj Names Whose Performance Cost His Team | Sakshi
Sakshi News home page

#CSK: మా ఓటమికి కారణం అదే.. అతడు స్కోరు చేసి ఉంటే: రుతురాజ్‌

Published Mon, Apr 1 2024 12:37 PM | Last Updated on Mon, Apr 1 2024 1:21 PM

IPL 2024 DC vs CSK Ruturaj Names Whose Performance Cost His Team - Sakshi

సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (PC: CSK/Jio cinema)

కెప్టెన్‌గా ఐపీఎల్‌-2024లో తొలి పరాజయాన్ని చవిచూశాడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి రుతురాజ్‌ గైక్వాడ్‌. ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ.. తదుపరి గుజరాత్‌ టైటాన్స్‌పై సీఎస్‌కే గెలుపొందిన విషయం తెలిసిందే.

అయితే, ముచ్చటగా మూడో మ్యాచ్‌ గెలిచి హ్యాట్రిక్‌ కొడుతుందనుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓటమి పాలైంది. విశాఖపట్నంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ ఫలితంపై స్పందించిన చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌.. పవర్‌ ప్లేలో వైఫల్యమే తమ పరాజయానికి కారణమని పేర్కొన్నాడు.

‘‘ఢిల్లీ ఇన్నింగ్స్‌లో పవర్‌ ప్లేలో మా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చినా.. ఆ తర్వాత మెరుగ్గానే బౌలింగ్‌ చేశారు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన ప్రత్యర్థిని 191 రన్స్‌కు కట్టడి చేయగలిగారు.

తొలి ఇన్నింగ్స్‌లో పిచ్‌ బౌలర్లకు అంతగా అనుకూలించలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో సీమ్‌ కారణంగా బాల్‌ బౌన్స్‌ అయింది. నిజానికి ఈ మ్యాచ్‌లో రచిన్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడితే ఫలితం వేరేలా ఉండేది.

తొలి మూడు ఓవర్లలో మేము అనుకున్నంతగా స్కోరు చేయలేకపోయాం. అప్పటి నుంచే మ్యాచ్‌ మా చేజారిపోయింది. ఒక్క ఓవర్లోనైనా భారీ స్కోరు చేసి ఉంటే రన్‌రేటు తగ్గి ఉండేది. 

అంతేకాదు.. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒకటీ.. రెండు బౌండరీలు ఆపినా బాగుండేది. అయినా.. ఇది మూడో మ్యాచ్‌ మాత్రమే. మేము తిరిగి పుంజుకుంటాం’’ అని రుతురాజ్‌ గైక్వాడ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాగా ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసింది సీఎస్‌కే. ఈ క్రమంలో ఢిల్లీ 191 రన్స్‌ స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో 171 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌(1), రచిన్‌ రవీంద్ర(2) పూర్తిగా నిరాశపరిచారు.

అజింక్య రహానే(45), డారిల్‌ మిచెల్‌(34).. ఆఖర్లో మహేంద్ర సింగ్‌ ధోని(37 నాటౌట్‌) మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు.  ఈ మ్యాచ్‌లో అద్భుత స్పెల్‌(2/21) వేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

చదవండి: #Dhoni: స్ట్రైక్‌రేటు 231.25.. సీఎస్‌కే ఓడిందా?!.. అట్లుంటది మనతోని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement