వాళ్లిద్దరూ అదరగొట్టారు.. ఫీల్డింగ్‌ కూడా అద్భుతం: రుతురాజ్‌ | 'Dhoni Worked Personally With Him': Ruturaj On CSK Star Incredible Rise - Sakshi
Sakshi News home page

#MS Dhoni: వాళ్లిద్దరూ అదరగొట్టారు.. ఫీల్డింగ్‌ కూడా అద్భుతం: రుతురాజ్‌

Published Wed, Mar 27 2024 9:22 AM | Last Updated on Wed, Mar 27 2024 10:05 AM

IPL 2024 Dhoni Worked Personally With Him: Ruturaj On CSK Star Incredible Rise - Sakshi

దూబేతో రుతురాజ్‌ (PC: IPL X)

ఐపీఎల్‌-2024లో వరుసగా రెండో విజయం సాధించడం పట్ల చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టి కృషితో గుజరాత్‌ టైటాన్స్‌ వంటి పటిష్ట జట్టును ఓడించామని పేర్కొన్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో ప్రతి ఒక్క సీఎస్‌కే ఆటగాడూ రాణించాడని ప్రశంసలు కురిపించాడు.

కాగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ పదిహేడో ఎడిషన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీని ఓడించిన సీఎస్‌కే.. తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తు చేసింది. సొంతమైదానం చెపాక్‌లో మంగళవారం నాటి మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో శుబ్‌మన్‌ గిల్‌ సేనపై జయభేరి మోగించింది.

ఈ నేపథ్యంలో విజయానంతరం సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మ్యాచ్‌ పరిపూర్ణమైంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో మా వాళ్లు అదరగొట్టారు. 

సాధారణంగా చెన్నైలో వికెట్‌ ఎలా ఉంటుందో కచ్చితంగా అంచనా వేయలేం. అందుకే తొలుత బ్యాటింగ్‌ చేసినా.. బౌలింగ్‌ చేసినా రాణించడం మాత్రం ముఖ్యం. అయితే, వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడితే ఆఖర్లో మనకు ఉపయోగకరంగా ఉంటుంది.

ఇక ఈరోజు రచిన్‌ పవర్‌ ప్లేలో అత్యద్బుతంగా బ్యాటింగ్‌ చేశాడు. మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చి వేశాడు. అదే విధంగా.. దూబే.. అతడికి ఆత్మవిశ్వాసం మెండు. మేనేజ్‌మెంట్‌తో పాటు మహీ భాయ్‌ కూడా వ్యక్తిగతంగా అతడిని మెటివేట్‌ చేశాడు. జట్టులో తన పాత్ర ఏమిటో అతడికి బాగా తెలుసు. దూబే జట్టుతో ఉండటం మాకు అతిపెద్ద సానుకూలాంశం. 

ఇక ఈరోజు నేను మా వాళ్ల ఫీల్డింగ్‌కు కూడా ఫిదా అయ్యాను’’ అని పేర్కొన్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించడం వల్లే గెలుపు సాధ్యమైందని రుతురాజ్‌ గైక్వాడ్‌ పేర్కొన్నాడు. కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ తొలుత బౌలింగ్‌ చేసింది.

చెన్నై ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌(36 బంతుల్లో 46), రచిన్‌ రవీంద్ర(20 బంతుల్లో 46) రాణించగా.. నాలుగో స్థానంలో వచ్చిన శివం దూబే(23 బంతుల్లో 51) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మెరుపు అర్ధ శతకం సాధించాడు. డారిల్‌ మిచెల్‌(24- నాటౌట్‌) సైతం తన వంతు పరుగులు జతచేశాడు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి చెన్నై 206 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడ్డ గుజరాత్‌ 143 పరుగుల వద్దే నిలిచిపోవడంతో సీఎస్‌కే చేతిలో ఓటమి తప్పించుకోలేకపోయింది. చెన్నై బౌలర్లలో దీపక్‌ చహర్‌, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌, తుషార్‌ దేశ్‌పాండే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. డారిల్‌ మిచెల్‌, మతీశ పతిరణ ఒక్కో వికెట్‌ తీశారు.

చదవండి: #WHAT A CATCH: వారెవ్వా ధోని.. 42 ఏళ్ల వ‌య‌స్సులో క‌ళ్లు చెదిరే క్యాచ్‌! వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement