IPL 2024 MI Vs DC: ముంబై అదిరే బోణీ... | IPL 2024 MI Vs DC: Mumbai Indians Beat Delhi Capitals By 29 Runs, Check Full Score Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2024 MI Vs DC Highlights: ముంబై అదిరే బోణీ...

Published Mon, Apr 8 2024 5:56 AM | Last Updated on Mon, Apr 8 2024 9:41 AM

IPL 2024: Mumbai Indians Beat Delhi Capitals by 29 Runs - Sakshi

29 పరుగులతో ఢిల్లీపై గెలుపు

చెలరేగిన రోహిత్, టిమ్‌ డేవిడ్, కిషన్‌

చివరి ఓవర్లో షెఫర్డ్‌ విధ్వంసం

పృథ్వీ షా, స్టబ్స్‌ పోరాటం వృథా

ముంబై: ఎట్టకేలకు ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ తాజా సీజన్‌లో గెలుపు బోణీ కొట్టింది. ఆరంభం నుంచి ఆఖరి బంతిదాకా బ్యాటర్లంతా దంచేయడంతో ముంబై 29 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. మొదట ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఓపెనర్లు రోహిత్‌ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), టిమ్‌ డేవిడ్‌ (21 బంతుల్లో 45 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రొమారియో షెఫర్డ్‌ (10 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసం ఢిల్లీ బౌలర్లను చేష్టలుడిగేలా చేసింది.

అక్షర్‌ పటేల్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేయగలిగింది. పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (25 బంతుల్లో 71 నాటౌట్‌; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్‌ కొయెట్జీ 4 వికెట్లు తీశాడు.  

మూడు దశల్లో ముంబై వీర విహారం
ఓపెనర్లు రోహిత్, ఇషాన్‌ తొలిదశకు అద్భుతంగా శ్రీకారం చుట్టారు. ఇద్దరు అడ్డుఅదుపులేని బాదుడుతో 4.1 ఓవర్లో ముంబై స్కోరు 50కి చేరింది. ఇంకో మూడు ఓవర్లలోనే జట్టు స్కోరు 80 దాటింది. అక్కడే రోహిత్‌ అవుట్‌కాగా స్వల్ప వ్యవధిలో సూర్యకుమార్‌ (0), ఇషాన్‌ కిషన్‌లు కూడా అవుటయ్యారు. తిలక్‌వర్మ (6) అవుటయ్యాక రెండో దశను హార్దిక్‌ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్‌), టిమ్‌ డేవిడ్‌ ధాటిగా నడిపించారు.

16వ ఓవర్లో 150 దాటింది. డేవిడ్‌ సిక్స్‌లతో విరుచుకుపడటంతో మరో మూడు ఓవర్లలో 200 (19వ ఓవర్లో) మైలురాయిని చేరుకుంది. ఆఖరి దశ మాత్రం షెఫర్డ్‌ అరివీర బాదుడుతో స్టేడియం ఊగిపోయింది. నోర్జే వేసిన 20వ ఓవర్‌ అసాంతం ఆడుకున్న షెఫర్డ్‌ 4, 6, 6, 6, 4, 6లతో ఏకంగా 32 పరుగులు పిండేశాడు. ఏ ఒక్కరు కనీసం ఫిఫ్టీ అయినా బాదకుండా టి20 క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ముంబై రికార్డు నమోదు చేసింది.  

పృద్విషా, స్టబ్స్‌ మెరుపులు
మ్యాచ్‌లో ఓడింది కానీ... ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆఖరిదాకా పోరాడింది. వార్నర్‌ (10)తో ఆరంభం కుదరకపోయినా పృథ్వీ షా చక్కని షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అభిõÙక్‌ పోరెల్‌ (31 బంతుల్లో 41; 5 ఫోర్లు)తో రెండో వికెట్‌కు చకచకా 88 పరుగులు జోడించాక 12వ ఓవర్లో బుమ్రా కళ్లు చెదిరే యార్కర్‌కు పృథ్వీ షా నిష్క్రమించాడు. తర్వాత స్టబ్స్‌ భారీ సిక్సర్ల విధ్వంసంతో ముంబై ఇండియన్స్‌ బౌలర్లను వణికించాడు. కానీ అవతలి వైపు నిలిచే బ్యాటరే కరువవడంతో ఛేజింగ్‌లో వెనుకబడింది.

స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) అక్షర్‌ 49; కిషన్‌ (సి అండ్‌ బి) అక్షర్‌ 42; సూర్యకుమార్‌ (సి) సబ్‌–ఫ్రేజర్‌ (బి) నోర్జే 0; హార్దిక్‌ (సి) సబ్‌–ఫ్రేజర్‌ (బి) నోర్జే 39; తిలక్‌ వర్మ (సి) పటేల్‌ (బి) ఖలీల్‌ 6; టిమ్‌ డేవిడ్‌ (నాటౌట్‌) 45; షెఫర్డ్‌ (నాటౌట్‌) 39; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 234.
వికెట్ల పతనం: 1–80, 2–81, 3–111, 4–121, 5–181.
బౌలింగ్‌: ఖలీల్‌ 4–0–39–1, ఇషాంత్‌ 3–0– 40–0, రిచర్డ్‌సన్‌ 4–0–40–0, అక్షర్‌ 4–0– 35–2, లలిత్‌  1–0–15–0, నోర్జే 4–0– 65–2.

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) బుమ్రా 66; వార్నర్‌ (సి) పాండ్యా (బి) షెఫర్డ్‌ 10; పోరెల్‌ (సి) డేవిడ్‌ (బి) బుమ్రా 41; స్టబ్స్‌ (నాటౌట్‌) 71; రిషభ్‌ పంత్‌ (సి) హార్దిక్‌ (బి) కొయెట్జీ 1; అక్షర్‌ పటేల్‌ (రనౌట్‌) 8; లలిత్‌ (సి) ఇషాన్‌ (బి) కొయెట్జీ 2; కుశాగ్ర (సి) తిలక్‌ వర్మ (బి) కొయెట్జీ 0; రిచర్డ్‌సన్‌ (సి) రోహిత్‌ (బి) కొయెట్జీ 2; ఎక్స్‌ట్రాలు 3, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 205.
వికెట్ల పతనం: 1–22, 2–110, 3–144, 4–153, 5–194, 6–203, 7–203, 8– 205.
బౌలింగ్‌: కొయెట్జీ 4–0–34–4, బుమ్రా 4–0–22–2, ఆకాశ్‌ మధ్వాల్‌ 4–0–45–0, రొమారియో షెఫర్డ్‌ 4–0–54–1, నబీ 2–0– 17–0, పీయూశ్‌ చావ్లా 2–0– 32–0.  

ఐపీఎల్‌లో నేడు
చెన్నై X కోల్‌కతా
వేదిక: చెన్నై
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement