రాణించిన స్యామ్ కరన్
4 వికెట్లతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్
ముల్లన్‌పూర్: కొత్త సీజన్‌లో, కొత్త మైదానంలో పంజాబ్ కింగ్స్ భాంగ్రా ఆడుకుంది. తొలి పోరులో చక్కటి విజయంతో బోణీ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. షై హోప్ (25 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిషేక్ పొరేల్ (10 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
అనంతరం పంజాబ్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్యామ్ కరన్ (47 బంతుల్లో 63; 6 ఫోర్లు, 1 సిక్స్), లయమ్ లివింగ్‌స్టోన్ (21 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఐదో వికెట్‌కు 42 బంతుల్లో 67 పరుగులు జోడించి గెలిపించారు.
అంతా అంతంతమాత్రంగా...
ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (21 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ మార్‡్ష (12 బంతుల్లో 20; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ప్రారంభించారు. తొలి 3 ఓవర్లలో వీరిద్దరు 33 పరుగులు రాబట్టారు. మార్ష్ వెనుదిరిగినా...కెరీర్‌లో తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న హోప్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. 10.3 ఓవర్లలో స్కోరు 94/3తో మెరుగ్గా అనిపించింది. అయితే ఈ దశలో బ్యాటింగ్ తడబడింది.
పంత్ (18) ప్రభావం చూపలేకపోగా...భుయ్ (3), స్టబ్స్ (5) విఫలమయ్యారు. అక్షర్ పటేల్ (13 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించగలిగాడు. అయితే చివర్లో పొరేల్ దూకుడు ఢిల్లీకి చెప్పుకోదగ్గ స్కోరు అందించింది. స్కోరు 137/7 వద్ద క్రీజ్‌లోకి వచ్చిన అతను హర్షల్ వేసిన ఆఖరి ఓవర్లో చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో అతను వరుసగా 4, 6, 4, 4, 6 బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి.
రాణించిన లివింగ్‌స్టోన్...
ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లోనే 4 ఫోర్లతో శిఖర్ ధావన్ (16 బంతుల్లో 22; 4 ఫోర్లు) జోరు ప్రదర్శించాడు. అయితే అతనితో పాటు బెయిర్‌స్టో (9) ఐదు బంతుల వ్యవధిలో వెనుదిరగ్గా...ప్రభ్‌సిమ్రన్ సింగ్ (17 బంతుల్లో 26; 5 ఫోర్లు) జట్టును ఆదుకున్నాడు. కానీ ప్రభ్‌సిమ్రన్‌తో పాటు జితేశ్ శర్మ (9) తన వరుస ఓవర్లలో అవుట్ చేసి కుల్దీప్ ఆశలు పెంచాడు.
గెలుపు కోసం 51 బంతుల్లో 75 పరుగులు చేయాల్సిన దశలో కరన్, లివింగ్‌స్టోన్ జత కలిశారు. 33 పరుగుల వద్ద కరన్ ఇచ్చిన క్యాచ్‌ను స్టబ్స్ వదిలేయడం కలిసొచ్చింది. వీరిద్దరిని కొద్ది సేపు ఢిల్లీ బౌలర్లు నిలువరించగలిగారు. అయితే మార్‡్ష వేసిన 15వ, 17వ ఓవర్లలో కలిపి మొత్తం 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో పంజాబ్ 36 పరుగులు రాబట్టడంతో ఆట స్వరూపం మారిపోయింది.
విజయానికి పది పరుగుల దూరంలో కరన్ అవుటైనా...లివింగ్‌స్టోన్ మిగతా పనిని పూర్తి చేశాడు. మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ ఆరో ఓవర్లోనే ఇషాంత్ గాయపడటం కూడా ఢిల్లీని దెబ్బ తీసింది. ప్రధాన బౌలర్ దూరం కావడంతో ప్రత్యామ్నాయం లేక పరుగులు ఇస్తున్నా సరే మార్ష్‌తో బౌలింగ్ చేయించాల్సి వచ్చింది.
స్కోరు వివరాలు:
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) జితేశ్ (బి) హర్షల్ 29; మార్ష్ (సి) చహర్ (బి) అర్ష్‌దీప్ 20; హోప్ (సి) బ్రార్ (బి) రబాడ 33; పంత్ (సి) బెయిర్‌స్టో (బి) హర్షల్ 18; భుయ్ (సి) జితేశ్ (బి) బ్రార్ 3; స్టబ్స్ (సి) శశాంక్ (బి) చహర్ 5; అక్షర్ (రనౌట్) 21; సుమీత్ (సి) జితేశ్ (బి) అర్ష్‌దీప్ 2; పొరేల్ (నాటౌట్) 32; కుల్దీప్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 174.
వికెట్ల పతనం: 1–39, 2–74, 3–94, 4–111, 5–111, 6–128, 7–138, 8–147, 9–174.
బౌలింగ్: స్యామ్ కరన్ 1–0–10–0, అర్‡్షదీప్ 4–0–28–2, రబాడ 4–0–36–1, హర్‌ప్రీత్ బ్రార్ 3–0–14–1, రాహుల్ చహర్ 4–0–33–1, హర్షల్ 4–0–47–2.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ధావన్ (బి) ఇషాంత్ 22; బెయిర్‌స్టో (రనౌట్) 9; ప్రభ్‌సిమ్రన్ (సి) వార్నర్ (బి) కుల్దీప్ 26; స్యామ్ కరన్ (బి) అహ్మద్ 63; జితేశ్ (స్టంప్డ్) పంత్ (బి) కుల్దీప్ 9; లివింగ్‌స్టోన్ (నాటౌట్) 38; శశాంక్ (సి) పంత్ (బి) అహ్మద్ 0; బ్రార్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 177.
వికెట్ల పతనం: 1–34, 2–42, 3–84, 4–100, 5–167, 6–167.
బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–43–2, ఇషాంత్ 2–0–16–1, మార్ష్ 4–0–52–0, అక్షర్ 4–0–25–0, కుల్దీప్ 4–0–20–2, సుమీత్ 1.2–0–19–0.
Comments
Please login to add a commentAdd a comment