
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేజ్ చేస్తుండగా.. ఓ వ్యక్తి సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలో చొరబడి స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మవైపు దూసుకొచ్చాడు. ఊహించని ఈ పరిణామంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ రోహిత్.. ఆతర్వాత ఆ వ్యక్తిని కౌగిలించుకుని గ్రౌండ్‌లో నుంచి బయటికి వెళ్లాలని సూచించాడు.
రోహిత్‌ను కౌగించుకున్న అనంతరం ఆ వ్యక్తి పక్కనే ఉన్న ఇషాన్ కిషన్‌తో సైతం కరచాలనం చేసి కౌగిలించుకున్నాడు. అనంతరం సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తికి పట్టుకుని బయటకు లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
A fan invaded the pitch and met Rohit Sharma and Ishan Kishan.pic.twitter.com/NusKCxHVJP
— CricTracker (@Cricketracker) April 1, 2024
ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో ముంబై రాజస్థాన్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుత సీజన్‌లో ముంబైకు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై చెత్త ప్రదర్శన చేసి నిర్ణీత ఓవర్లలో కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్‌లో రోహిత్ సహా ముగ్గురు (నమన్ ధీర్, డెవాల్డ్ బ్రెవిస్) గోల్డెన్ డకౌట్లయ్యారు. తిలక్ వర్మ (32), హార్దిక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బౌల్ట్ (4-0-22-3), చహల్ (4-0-11-3), బర్గర్ (4-0-32-2), ఆవేశ్ ఖాన్ (4-0-30-1) అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని వణికించారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్.. 15.3 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. రియాన్ పరాగ్ (54 నాటౌట్) మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. యశస్వి (10), బట్లర్ (13) మరోసారి నిరాశపరిచారు. సంజూ శాంసన్ 12, అశ్విన్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 3 వికెట్లు పడగొట్టగా.. మఫాక తన మొట్టమొదటి ఐపీఎల్ వికెట్ దక్కించుకున్నాడు.