#RRvsLSG: సిక్సర్ల వర్షం.. వరల్డ్‌కప్‌ జట్టులో చోటు ఖాయమే!? | IPL 2024 Sanju Makes Case for T20 WC Selection With Master Class LSG knock | Sakshi
Sakshi News home page

#Sanju: సిక్సర్ల వర్షం.. ధనాధన్‌ ఇన్నింగ్స్‌.. ప్రపంచకప్‌ జట్టులో చోటు ఖాయమే!

Published Mon, Mar 25 2024 1:07 PM | Last Updated on Mon, Mar 25 2024 2:20 PM

IPL 2024 Sanju Makes Case for T20 WC Selection With Master Class LSG knock - Sakshi

ధనాధన్‌ ఇన్నింగ్స్‌.. ప్రపంచకప్‌ జట్టులో చోటు ఖాయమే(PC: BCCI/PTI)

#Sanju Samson vs KL Rahul: రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ ఐపీఎల్‌-2024 ఎడిషన్‌ను అద్భుతమైన విజయంతో ఆరంభించాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో అదరగొట్టి ప్రశంసలు అందుకుంటున్నాడు. బ్యాటర్‌గా.. సారథిగా సత్తా చాటి తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు.

కాగా జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాజస్తాన్‌ లక్నోతో తలపడింది. సొంతమైదానంలో టాస్‌ గెలిచిన సంజూ శాంసన్‌ సేన తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(12 బంతుల్లో 24) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించగా.. మరో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(9 బంతుల్లో 11) పూర్తిగా నిరాశపరిచాడు.

సూపర్‌ హాఫ్‌ సెంచరీ
ఈ క్రమంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సంజూ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. 52 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 82 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. సంజూకు తోడుగా రియాన్‌ పరాగ్‌(29 బంతుల్లో 43) కూడా రాణించాడు. 

ఇక మరో యంగ్‌ గన్‌ ధ్రువ్‌ జురెల్‌ 12 బంతుల్లో 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్‌ నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి 193 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన లక్నో 20 ఓవర్లలో 173 పరుగులకే పరిమితమై ఓటమిని మూటగట్టుకుంది.

కెప్టెన్‌, ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఈ మ్యాచ్‌లో 44 బంతుల్లో 58 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో నికోలస్‌ పూరన్‌ అద్భుత అర్ధ శతకం(41 బంతుల్లో 64)తో అజేయంగా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2024 అనంతరం వెస్టిండీస్‌- యూఎస్‌ఏ వేదికగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఇక క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ప్రదర్శన ఆధారంగానే టీమిండియా ఆటగాళ్ల బెర్తులు ఖరారు కానున్నాయి.   

వరల్డ్‌కప్‌ రేసులో అందరి కంటే ఓ అడుగు ముందే
ఈ నేపథ్యంలో వికెట్‌ కీపర్ల కోటాలో సంజూ శాంసన్‌ ఈ అద్భుతమైన ప్రదర్శనతో అందరికంటే ఓ అడుగు ముందుకు వేసినట్లే కనిపిస్తోంది. ఆరంభ మ్యాచ్‌లో జితేశ్‌ శర్మ(9) (పంజాబ్‌), ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌ అయి పూర్తిగా నిరాశపరచగా.. ధ్రువ్‌ జురెల్‌(రాజస్తాన్‌), కేఎల్‌ రాహుల్‌ ఫర్వాలేదనిపించారు. 

అయితే, సంజూతో పోలిస్తే వీరంతా వెనుకబడ్డారు. మున్ముందు కూడా సంజూ ఇలాగే బ్యాట్‌ ఝులిపిస్తే ప్రపంచకప్‌ జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లకు కచ్చితంగా ఈ కేరళ బ్యాటరే మొదటి ఆప్షన్‌ అవుతాడనడంలో సందేహం లేదంటున్నారు విశ్లేషకులు. ఆల్‌ ది బెస్ట్‌ సంజూ!!

చదవండి: #Hardikpandya: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది.. హార్దిక్‌ ముఖం మాడింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement