ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ గెలిచాక సొంత పట్టణం అంబాలకు (హర్యానా) విచ్చేసిన కేకేఆర్ స్టార్ పేసర్ వైభవ్ అరోరాకు ఘన స్వాగతం లభించింది. వైభవ్‌ను అతని సన్నిహితులు, అభిమానులు, అంబాల వాసులు డప్పు వాయిద్యాల మధ్య పూల మాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వైభవ్‌తో ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు.
అనంతరం వైభవ్ ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఐపీఎల్ 2024 సీజన్ ముగిసి వారం రోజులు పూర్తయినా జనాలు ఇంకా అదే మూడ్‌లో ఉన్నారు. 27 ఏళ్ల వైభవ్ ఈ ఐపీఎల్ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనలతో చెలరేగాడు. వైభవ్ ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి కేకేఆర్ విజయంలో ప్రధానపాత్ర పోషించాడు.
Vaibhav Arora gets a hero's welcome to his hometown after IPL win. 🏆pic.twitter.com/PhWOMk76Y6
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2024
రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన వైభవ్.. సహచరుడు హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్‌లతో కలిసి కేకేఆర్ పేస్ అటాక్‌ను లీడ్ చేశాడు. లోయర్ ఆర్డర్‌లో ఉపయోగకర బ్యాటర్ కూడా అయిన వైభవ్‌ను కేకేఆర్ ఈ సీజన్ వేలంలో 60 లక్షలకు సొంతం చేసుకుంది. వైభవ్ ఇప్పటివరకు 21 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. వైభవ్ దేశవాలీ క్రికెట్‌లో హిమాచల్ ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు.
2021లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్ ఆ సీజన్‌లో కేకేఆర్‌కు ఆడి ఆతర్వాతి సీజన్‌లో (2022) పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్‌లో వైభవ్ తిరిగి కేకేఆర్ పంచన చేరాడు. ఈ సీజన్‌లో వైభవ్‌కు చాలా పాపులారిటీ వచ్చింది. సన్‌రైజర్స్‌తో జరిగిన ఫైనల్లో వైభవ్ 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి అత్యంత కీలకమైన ట్రవిస్ హెడ్ వికెట్ తీశాడు. ఈ సీజన్ ప్రదర్శనల కారణంగా కేకేఆర్ తదుపరి సీజన్‌లోనూ ఇతన్ని రీటెయిన్ చేసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment