పంజాబ్‌ హీరో.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించాడు! ఎవరీ శశాంక్‌ సింగ్‌? | IPL 2024: Who is Shashank Singh? | Sakshi
Sakshi News home page

#Shashank Singh: పంజాబ్‌ హీరో.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించాడు! ఎవరీ శశాంక్‌ సింగ్‌?

Published Fri, Apr 5 2024 12:24 AM | Last Updated on Fri, Apr 5 2024 12:11 PM

IPL 2024: Who is Shashank Singh?  - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) నుంచి మరో టాలెంటడ్‌ బ్యాటర్‌ వరల్డ్‌ క్రికెట్‌కు పరిచయమయ్యాడు. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్ధి బౌలర్లకు వణకుపుట్టించాడు. అతడే పంజాబ్‌ కింగ్స్‌ యువ కెరటం శశాంక్‌ సింగ్‌. ఐపీఎల్‌-2024లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శశాంక్‌ సింగ్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

ధావన్‌, బెయిర్‌ స్టో, సికిందర్‌ రజా వంటి వరల్డ్‌ క్లాస్‌ బ్యాటర్లు విఫలమైన చోట.. శశాంక్‌ సింగ్‌ సత్తాచాటాడు. పంజాబ్‌కు ఓటమి తప్పదు అనుకున్న వేళ శశాంక్‌ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 73 పరుగులకే 4 వికెట్లు పంజాబ్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.

ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటి అతడు మాత్రం తన హిట్టింగ్‌ను కొనసాగించి పంజాబ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శశాంక్ 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఫలితంగా పంజాబ్‌  200 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి  ఛేదించింది. ఈ క్రమంలో ఎవరీ  శశాంక్ సింగ్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

ఎవరీ శశాంక్ సింగ్‌?

32 ఏళ్ల శశాంక్ సింగ్ 1991 నవంబర్‌ 21న ముంబైలో జన్మించాడు. ప్రస్తుతం శశాంక్ సింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఛత్తీస్‌గఢ్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 21 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన శశాంక్ 1072 ప‌రుగులు చేశాడు. అంతకుముందు 2015-16 విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా లిస్ట్-ఏ క్రికెట్లో ముంబై తరఫున అరంగేట్రం చేశాడు. 

త‌న లిస్ట్‌-ఏ కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 30 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 275 ప‌రుగులు చేశాడు. అదే ఏడాదిలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీతో ముంబై తరపున శశాంక్ సిం టీ20 డెబ్యూ కూడా చేశాడు. ఈ రెండో ఫార్మాట్లలో పోల్చుకుంటే టీ20ల్లో శశాంక్‌ మంచి రి​కార్డు ఉంది. ఆఖరిలో వచ్చి మెరుపులు మెరిపించడమే శశాంక్ స్పెషల్‌. ఇప్పటివరకు 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన శశాంక్‌.. 137.34 స్ట్రైక్‌ రేట్‌తో 754 పరుగులు చేశాడు. శశాంక్‌ బౌలింగ్‌ చేసే సత్తా కూడా ఉంది. మూడు ఫార్మాల్లో కలిపి తన పేరిట 60 వికెట్లు ఉన్నాయి.

ఇక 2017లో ఐపీఎల్‌ కోసం అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్) జట్టు అతన్ని 10లక్షలకు సొంతం చేసుకుంది. కానీ అతడికి అరంగేట్రం చేసే ఛాన్స్‌ రాలేదు.  ఆ తర్వాత  2019, 2020 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ అతడిని సొంతం చేసుకుంది. అక్కడ కూడా అతడికి డెబ్యూ ఛాన్స్‌ రాలేదు.

అనంతరం ఐపీఎల్‌-2022 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని బేస్ ప్రైస్ 20 లక్షల​కు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్‌-2022 సీజన్‌లో సీఎస్‌కేపై ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి శశాంక్‌ అడుగుపెట్టాడు. అయితే ఐపీఎల్‌-2023 మినీ వేలంలో అతడిని ఎస్‌ఆర్‌హెచ్‌ విడిచిపెట్టింది. ఆ ఏడాది వేలంలోకి వచ్చిన శశాంక్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. మళ్లీ ఐపీఎల్‌-2024 వేలంలో తన పేరును శశాంక్‌ రిజిస్టర్‌ చేసుకున్నాడు. కనీస ధర 20 లక్షలకు పంజాబ్‌ కొనుగోలు చేసింది

అయితే వేలంలో ఇద్దరూ శశాంక్‌ సింగ్‌లు ఉండడంతో పంజాబ్‌ కింగ్స్‌ కాస్త కన్ఫ్యూజ్‌ అయింది. పంజాబ్‌ పొరపాటున వేరే శశాంక్‌ సింగ్‌ అనుకోని ఈ ఛత్తీస్‌ఘడ్‌ ఆల్‌రౌండర్‌ శశాంక్‌ సింగ్‌ని కొనుగోలు చేసిందని వార్తలు వినిపించాయి. ఆ  తర్వాత పంజాబ్‌ సరైన శశాంక్‌ సింగ్‌ని కొనుగోలు చేశామని క్లారిటీ ఇచ్చింది. ఇలా కన్ఫ్యూజిన్‌లో పంజాబ్‌ జట్టులోకి వచ్చిన శశాంక్‌ ఇప్పుడు సంచలన విజయాన్ని అందించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement