మెరుపు ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ను గెలిపించిన బ్యాటర్
29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 నాటౌట్
అశుతోష్ శర్మ కీలక ఇన్నింగ్స్
గుజరాత్ టైటాన్స్‌కు రెండో ఓటమి
గిల్ జిగేల్ ఇన్నింగ్స్ వృథా
అహ్మదాబాద్: సొంతగడ్డపై మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లను ఓడించిన గుజరాత్ టైటాన్స్‌కు పంజాబ్ కింగ్స్ చెక్ పెట్టింది. గురువారం ఆఖరి ఓవర్లో ఉత్కంఠ రేపిన ఐపీఎల్ పోరులో నిరుటి రన్నరప్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో ఓడింది. మొదట గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ , ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (48 బంతుల్లో 89 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగాడు.
సాయి సుదర్శన్ (19 బంతుల్లో 33; 6 ఫోర్లు) ధాటిగా ఆడాడు. రబడకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు బ్యాటింగ్‌తో పంజాబ్‌ను గెలిపించారు. నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు.
ఓపెనర్ గిల్ ఆఖరిదాకా...
వృద్ధిమాన్ సాహా (11)తో ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన శుబ్‌మన్ ఆఖరిదాకా టైటాన్స్ స్కోరు పెంచే పనిలో పడ్డాడు. కేన్ విలియమ్సన్ (22 బంతుల్లో 26; 4 ఫోర్లు) నింపాదిగా ఆడగా, జట్టు పవర్‌ప్లేలో 52/1 స్కోరు చేసింది. కెప్టెన్ గిల్ ధాటికి సాయి సుదర్శన్ జోరు తోడయ్యాకే గుజరాత్ పుంజుకుంది.
12వ ఓవర్లో జట్టు స్కోరు 100 దాటింది. శుబ్‌మన్ 31 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. చకచకా పరుగులు జతచేస్తున్న సుదర్శన్‌కు హర్షల్ చెక్‌పెట్టగా, విజయ్ శంకర్ (8) నిరాశపరిచాడు. 18వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా డెత్ ఓవర్లలో బ్యాట్ ఝుళిపించాడు.
19వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ 3 వైడ్లు సహా 9 బంతులేయగా తెవాటియా 6, 4 బాదడంతో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. అయితే ఆఖరి ఓవర్ వేసిన అర్ష్దీప్ తొలి నాలుగు బంతుల్లో 5 పరుగులే ఇచ్చాడు. అయితే చివరి రెండు బంతుల్ని తెవాటియా బౌండరీలకు తరలించడంతో టైటాన్స్ 199/4 స్కోరు చేసి సరిగ్గా 200 లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది.
మ్యాచ్ విన్నర్‌గా...
భారీ లక్ష్యఛేదనలో శిఖర్ ధావన్ (1) విఫలమైనా... బెయిర్‌స్టో (13 బంతుల్లో 22; 4 ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్ (24 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా పరుగులు సాధించారు. 13వ ఓవర్లో సికందర్ రజా (15) అవుటైనప్పడు పంజాబ్ స్కోరు 111/5. గెలుపుపై ఆశల్లేని స్థితిలో జితేశ్ శర్మ అండతో శశాంక్ సింగ్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇద్దరు 3.1 ఓవర్లలోనే 39 పరుగులు జోడించారు. రెండు వరుస సిక్సర్లు కొట్టిన జితేశ్‌ను రషీద్ బోల్తా కొట్టించాడు.
ఈ దశలో కింగ్స్ విజయానికి 27 బంతుల్లో 50 పరుగులు కావాలి. ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన అశుతో‹Ù... నిలదొక్కుకున్న శశాంక్‌తో కలిసి ధనాధన్ ఆటతో 19వ ఓవర్లోనే విజయసమీకరణాన్ని సులువు చేశాడు. ఆఖరి ఓవర్‌కు వచ్చేసరికి 6 బంతుల్లో 7 పరుగులు చేయాల్సివుండగా, తొలి బంతికే అశుతోష్ అవుటైనా... శశాంక్ మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించాడు.
గత డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం శశాంక్ సింగ్‌ను కొనుగోలు చేసింది. అయితే వేలం జాబితాలో ఇద్దరు శశాంక్ సింగ్‌లు ఉండగా... తాము కోరుకున్న శశాంక్ సింగ్‌ను కాకుండా అదే పేరుతో ఉన్న మరో శశాంక్ సింగ్‌ను పొరపాటుగా తీసుకున్నామని పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా వ్యాఖ్యానించింది.
ఇది కాస్తా వివాదం కావడంతో ఇద్దరు శశాంక్‌లు తమ దృష్టిలో ఉన్నారని, తాము పొరపాటు చేయలేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ఆనాడు శశాంక్ సింగ్‌ను పొరపాటుగా తీసుకున్నామని భావించిన పంజాబ్ కింగ్స్ జట్టుకు నేడు మ్యాచ్ విన్నర్‌గా అవతరించడం విశేషం.
స్కోరు వివరాలు
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) ధావన్ (బి) రబడ 11; గిల్ (నాటౌట్) 89; విలియమ్సన్ (సి) బెయిర్‌స్టో (బి) హర్‌ప్రీత్ 26; సుదర్శన్ (సి) జితేశ్ (బి) హర్షల్ 33; విజయ్ శంకర్ (సి) హర్‌ప్రీత్ (బి) రబడ 8; తెవాటియా (నాటౌట్) 23; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం ( 20 ఓవర్లలో 4 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–29, 2–69, 3–122, 4–164. బౌలింగ్: హర్‌ప్రీత్ బ్రార్ 4–0–33–1, అర్ష్దీప్ 4–0–33–0, రబడ 4–0–44–2, స్యామ్ కరన్ 2–0–18–0, హర్షల్ పటేల్ 4–0–44–1, సికందర్ రజా 2–0–22–0.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ధావన్ (బి) ఉమేశ్ 1; బెయిర్‌స్టో (బి) నూర్ అహ్మద్ 22; ప్రభ్‌సిమ్రన్ (సి) మోహిత్ (బి) నూర్ అహ్మద్ 35; స్యామ్ కరన్ (సి) విలియమ్సన్ (బి) అజ్మతుల్లా 5; సికందర్ (సి) సాహా (బి) మోహిత్ 15; శశాంక్ (నాటౌట్) 61; జితేశ్ (సి) దర్శన్ (బి) రషీద్ ఖాన్ 16; అశుతోష్ (సి) రషీద్ ఖాన్ (బి) దర్శన్; హర్‌ప్రీత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–13, 2–48, 3–64, 4–70, 5–111, 6–150, 7–193. బౌలింగ్: అజ్మతుల్లా 4–0–41–1, ఉమేశ్ 3–0–35–1, రషీద్ ఖాన్ 4–0–40–1, నూర్ అహ్మద్ 4–0–32–2, మోహిత్ శర్మ 4–0–38–1, దర్శన్ 0.5–0–6–1.
ఐపీఎల్‌లో నేడు
హైదరాబాద్ X చెన్నై
వేదిక: హైదరాబాద్
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment