
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు (కేకేఆర్) భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సీజన్ మొత్తనికి దూరమ్యాడు. దీంతో అతనికి రీ ప్లేస్‌మెంట్‌గా 27 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ చేతన్ సకారియాను ఎంపిక చేసుకుంది కేకేఆర్ మేనేజ్‌మెంట్. మాలిక్‌ను కేకేఆర్ ఈ సీజన్ మెగా వేలంలో రూ. 75 లక్షలకు దక్కించుకుంది.
మాలిక్ కేకేఆర్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వైదొలిగాడు. జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ది చెందిన మాలిక్ 2021లో సన్‌రైజర్స్ తరఫున అరంగేట్రం చేసి గత సీజన్ వరకు అదే జట్టుకు ఆడాడు. మూడు సీజన్లలో అద్బుతమైన ప్రదర్శనలు చేసిన మాలిక్.. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున 26 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనల కారణంగా మాలిక్ టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన మాలిక్ భారత్ తరఫున 10 వన్డేలు, 8 టీ20లు ఆడి 24 వికెట్లు తీశాడు.
సకారియా విషయానికొస్తే.. గుజరాత్‌లో పుట్టి దేశవాలీ క్రికెట్‌లో సౌరాష్ట్రకు ఆడే సకారియా గత సీజన్‌లో కేకేఆర్‌తో పాటే ఉన్నాడు. అయితే ఆ సీజన్‌లో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన సకారియా ఆతర్వాత రెండు సీజన్ల పాటు (2022, 2023) రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడు. సకారియా తన ఐపీఎల్ కెరీర్‌లో 19 మ్యాచ్‌లు ఆడి 8.43 ఎకానమీతో 20 వికెట్లు తీశాడు.
ఐపీఎల్ ప్రదర్శనల కారణంగా సకారియా భారత జట్టుకు ఆడే అవకాశం కూడా దక్కించుకున్నాడు. 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సకారియా ఓ వన్డే, 2 టీ20లు ఆడి 3 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా 46 టీ20లు ఆడిన సకారియా 65 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం కేకేఆర్ సకారియాను రూ. 75 లక్షల బేస్ ధరకు దక్కించుకుంది.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025లో కేకేఆర్ ప్రయాణం సీజన్ ఆరంభ మ్యాచ్‌తోనే మొదలవుతుంది. మార్చి 22న జరిగే మ్యాచ్‌లో కేకేఆర్ ఆర్సీబీని ఢీకొంటుంది. ఈ సీజన్‌లో కేకేఆర్‌కు కొత్త కెప్టెన్ వచ్చాడు. గత సీజన్‌లో టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్‌ను వెళ్లడంతో కేకేఆర్ మేనేజ్‌మెంట్ అజింక్య రహానేను నూతన కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంది. రహానేకు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వెంకటేశ్ అయ్యర్ ఎంపికయ్యాడు.
2025 ఐపీఎల్ సీజన్ కోసం కేకేఆర్ జట్టు..
అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్ (వైస్ కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, అంగ్‌క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, మొయిన్ అలీ, రమన్‌దీప్ సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, లవ్‌నిత్ సిసోడియా, రహ్మానుల్లా గుర్బాజ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జే, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్
Comments
Please login to add a commentAdd a comment