గ్లెన్ మాక్స్‌వెల్ (PC: BCCI)
ఐపీఎల్-2024లో దారుణంగా విఫలమైన ఆటగాళ్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ‘స్టార్’ గ్లెన్ మాక్స్‌వెల్ ఒకడు. ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కోసం ఆర్సీబీ యాజమాన్యం ఏకంగా రూ. 11 కోట్లు ఖర్చు చేసింది.
మాక్సీ ఆట తీరుపై నమ్మకంతో ఈ మేరకు భారీ మొత్తానికి అతడిని రీటైన్ చేసుకుంది. కానీ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మేనేజ్‌మెంట్, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు.
పదిహేడో ఎడిషన్ ఆరంభం నుంచే పేలవ ప్రదర్శనతో చతికిల పడ్డ మాక్స్‌వెల్.. మానసిక ఒత్తిడిని కారణంగా చూపి మధ్యలో కొన్ని మ్యాచ్‌లలో దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ కొన్ని మ్యాచ్‌లు ఆడగా.. మాక్సీ తిరిగి వచ్చి మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.
అయితే, ఓవరాల్‌గా ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో ముఖ్యంగా కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.
ఇదిలా ఉంటే.. మాక్సీ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024తో బిజీ కానున్నాడు. అయితే, ఐపీఎల్-2024లో అతడి ఫామ్‌లేమి ప్రభావం ఆస్ట్రేలియా జట్టుపై పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఐపీఎల్ ఫామ్‌తో అసలు సంబంధమే లేదు. మాక్సీ ఇప్పటికే తనను తాను ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. సుదీర్ఘకాలంగా మెగా టోర్నీల్లో అద్భుతంగా రాణించే ఆటగాడు.. పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా ఆడటంలో ఏమాత్రం వెనక్కి తగ్గడు.
టీ20 క్రికెట్‌లో మిడిలార్డర్‌లో ఆడుతున్నపుడు కొన్నిసార్లు రిస్క్ తీసుకోకతప్పదు. ఒక్కసారి క్రీజులో కుదురుకుని మంచి ఇన్నింగ్స్ ఆడాడంటే తనకు తిరుగే ఉండదు.
గతం గురించి చర్చ అనవసరం. గతాన్ని అతడు మార్చలేడు. అయితే, భవిష్యత్తును మాత్రం అందంగా మలచుకోగల సత్తా అతడికి ఉంది’’ అని ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.
ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్ మెగర్క్, మాథ్యూ షార్ట్.
Comments
Please login to add a commentAdd a comment