నేటి నుంచి ఐపీఎల్ టోర్నీ
మొదటి పోరులో చెన్నైతో బెంగళూరు ‘ఢీ’
తొలి రోజు గంట పాటు ప్రారంభోత్సవ వేడుకలు
రాత్రి 8 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని ఆటగాడిగా మరో టైటిల్ విజయంలో భాగం అవుతాడా? ఇంకా తొలి ట్రోఫీ కోసమే ఎదురు చూస్తున్న కోహ్లికి ఈ సారైనా దానిని అందుకునే అదృష్టం ఉందా? సారథ్యం కోల్పోయిన రోహిత్ శర్మ తన బ్యాటింగ్ సత్తాతో ముంబైకి మరో విజయం అందిస్తాడా?
చావుకు దగ్గరగా వెళ్లి వచ్చి మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టిన పంత్ కొత్త ఇన్నింగ్స్‌లో ఆటగాడిగా, నాయకుడిగా జట్టును నడిపించగలడా? ముంబై అభిమానుల ఆశలకు విరుద్ధంగా కెప్టెన్సీ అందుకున్న హార్దిక్ పాండ్యా తన ఆటతో, వ్యూహాలతో వారి మనసు గెలవగలడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలన్నీ రాబోయే రెండు నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లభిస్తాయి. క్రికెట్ అభిమానులను ఫోర్లు, సిక్సర్లతో అలరిస్తూ పూర్తి స్థాయి వినోదాన్ని అందించే వేసవి పండగకు సమయం వచ్చేసింది.
చెన్నై వేదికగా నేడు ఐపీఎల్ 17వ సీజన్ మొదలు కానుంది. గత ఏడాదిలాగే 10 జట్లు 74 మ్యాచ్‌లతో టోర్నీ సిద్ధం కాగా... ఎన్నికల కారణంగా తొలి దశలో 21 మ్యాచ్‌లకే బీసీసీఐ షెడ్యూల్ ప్రకటించింది. గత కొద్ది రోజులుగా భారత టెస్టు క్రికెట్‌ను ఆస్వాదించిన ఫ్యాన్స్ రాబోయే దాదాపు ఎనిమిది వారాల పాటు బౌండరీల గురించే చర్చించడం ఖాయం.
చెన్నై: మెగా టి20 టోర్నీ ఐపీఎల్–2024కు రంగం సిద్ధమైంది. ఎంఎ చిదంబరం స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తలపడుతుంది. గత రెండు సీజన్ల తరహాలోనే ప్రతీ జట్టు 14 మ్యాచ్‌ల చొప్పున ఆడుతుంది.
లీగ్ దశలో 70 మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) ఉంటాయి. తుది షెడ్యూల్ ప్రకటించకపోయినా... మే 26న ఫైనల్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్లలో చెన్నై, ముంబై ఐదేసిసార్లు విజేతగా నిలవగా కోల్‌కతా 2 సార్లు టైటిల్ సాధించింది.
దక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల ఖాతాలో ఒక్కో ట్రోఫీ చేరాయి. చెపాక్ మైదానంలో మొదటి మ్యాచ్‌కు ముందు ప్రత్యేక ఆరం¿ోత్సవ వేడుకలు జరుగుతాయి. ఎఆర్ రెహమాన్, సోనూ నిగమ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 17వ ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏడాది టోర్నీకి సంబంధించిన విశేషాలు...
♦ తాజా సీజన్‌లో పలు జట్లకు కొత్త కెపె్టన్లు వచ్చారు. ముంబైకి రోహిత్ స్థానంలో పాండ్యా, హైదరాబాద్‌కు మార్క్‌రమ్ స్థానంలో కమిన్స్, చెన్నైకి ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, గుజరాత్‌కు పాండ్యా స్థానంలో శుబ్‌మన్ గిల్ బాధ్యతలు చేపడుతున్నారు. గాయం నుంచి కోలుకొని వచ్చిన రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఢిల్లీ, కోల్‌కతా జట్ల పగ్గాలు చేపట్టారు. మిగతా నలుగురు కేఎల్ రాహుల్ (లక్నో), సంజూ సామ్సన్ (రాజస్తాన్), డుప్లెసిస్ (బెంగళూరు), శిఖర్ ధావన్ (పంజాబ్)లు గత సీజన్‌లాగే ఈసారి సారథులుగా కొనసాగనున్నారు.
♦ ఎనిమిది జట్ల ‘హోం’ వేదికల్లో ఎలాంటి మార్పు లేకపోగా... ఢిల్లీ తమ తొలి రెండు మ్యాచ్‌లను విశాఖపట్నంలో ఆడుతుంది. పంజాబ్ కింగ్స్ ఈసారి మొహాలిలో కాకుండా కొత్తగా ముల్లన్‌పూర్‌లో కట్టిన స్టేడియాన్ని తమ హోం గ్రౌండ్‌గా మార్చుకుంది.
♦ ఈ సీజన్‌లో కొత్తగా రెండు నిబంధనలు వచ్చాయి. ఒక ఓవర్లో రెండు బౌన్సర్లను అనుమతిస్తారు. చెలరేగిపోతున్న బ్యాటర్లను కొంత వరకు నిలువరించేందుకు పేస్ బౌలర్లకు ఇది ఒక అదనపు బలంగా పనికొస్తుంది. ‘స్మార్ట్ రీప్లే’ సిస్టంను కూడా తొలిసారి అమలు చేస్తున్నారు. దీని ద్వారా అంపైర్ రివ్యూ ఫలితాలను మరింత వేగంగా, కచ్చితంగా అందించే అవకాశం ఉంటుంది. టీవీ అంపైర్, హాక్ ఐ ఆపరేటర్ కలిసి ఒకే చోట కూర్చునే ఏర్పాటు చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. గత సీజన్‌లో అమల్లోకి వచ్చిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన ఈసారి కూడా కొనసాగుతుంది.
♦ ఐపీఎల్ తర్వాత వెంటనే టి20 ప్రపంచకప్ ఉండటంతో భారత జట్టులో చోటు సంపాదించుకునేందుకు పలువురు యువ ఆటగాళ్లకు ఈ టోర్నీ అవకాశం కల్పిస్తోంది.
♦ ఐపీఎల్ వేలంలో ఆసీస్ స్టార్ బౌలర్లు మిచెల్ స్టార్క్ రూ. 24 కోట్ల 75 లక్షలకు, ప్యాట్ కమిన్స్ రూ.20 కోట్ల 50 లక్షలకు అమ్ముడుపోయారు. ఈ నేపథ్యంలో తమ జట్లు కోల్‌కతా, హైదరాబాద్‌లను గెలిపించే విషయంలో వీరిద్దరిపై తీవ్ర ఒత్తిడి ఉండటం ఖాయం.
♦ గాయం కారణంగా లేదా వేలంలో అమ్ముడుపోకపోవడం వల్ల తాజా సీజన్‌కు దూరమైన కొందరు కీలక ఆటగాళ్లలో షమీ, మార్క్ వుడ్, ప్రసిధ్ కృష్ణ, జేసన్ రాయ్, హ్యారీ బ్రూక్, డెవాన్ కాన్వే, ఎన్‌గిడి, మదుషంక, స్టీవ్ స్మిత్, హాజల్‌వుడ్, బెన్ స్టోక్స్, జో రూట్, ఆడమ్ జంపా తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment