శ్రీలంక చేతిలో అఫ్గన్ ఓటమి (PC: ACC)
Afghanistan vs Sri Lanka: ఆసియా కప్-2023 నుంచి అఫ్గనిస్తాన్ నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో రెండు పరుగుల స్వల్ప తేడాతో ఓడి నిరాశగా ఇంటిబాట పట్టింది. గ్రూప్-బిలో ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో అఫ్గన్‌పై గెలిచిన దసున్ షనక బృందం సూపర్-4లో ఎంట్రీ ఇచ్చి ముందడుగు వేసింది.
కచ్చితంగా సూపర్-4కి అర్హత సాధిస్తారనుకున్నాం
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ పీయూశ్ చావ్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక- అఫ్గన్ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ.. ‘‘అఫ్గనిస్తాన్ బ్యాటింగ్ చూస్తే కచ్చితంగా వాళ్లు సూపర్-4కు అర్హత సాధిస్తారని అనిపించింది. కానీ.. ఎప్పుడైతే ముజీబ్ ఉర్ రహమాన్ వికెట్ కోల్పోయిందో.. ఫజల్‌హక్ ఫారూకీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అంతా తలకిందులైంది.
అతడు కనీసం సింగిల్ తీయడానికి కూడా ప్రయత్నించలేదు. క్రీజులోకి వచ్చాడు.. అలా స్టక్ అయిపోయాడు. బహుశా.. కనీసం సింగిల్ అయినా తీయాలని ఎవరూ అతడికి చెప్పలేదేమో! ముజీబ్ అవుట్ కాకపోయినా.. ఫారూకీ సింగిల్ తీసినా.. తర్వాతి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ బాది ఉంటే.. అఫ్గనిస్తాన్‌కు అనుకూలంగా ఫలితం వచ్చి ఉండేది.
అతిపెద్ద పొరపాటు
కానీ అలా జరుగలేదు. బహుశా.. ఇంకా తాము రేసులో ఉన్నామనే విషయాన్ని తెలిపే షీట్ మైదానంలో ఉన్న వాళ్లకు అంది ఉండదు. కీలక సమయంలో అఫ్గనిస్తాన్ చేసిన అతిపెద్ద పొరపాటు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో పీయూశ్ చావ్లా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా పాకిస్తాన్‌లోని లాహోర్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
వన్‌డౌన్ బ్యాటర్, వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 92 పరుగులతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గన్.. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. నాలుగో స్థానంలో వచ్చిన రహ్మత్ షా(45), కెప్టెన్ హష్మతుల్లా షాహిది(59), మహ్మద్ నబీ(65) ఇన్నింగ్స్‌తో గాడిన పడింది.
ఆ విషయం తెలియదా?
అయితే, రన్‌రేటు పరంగా వెనుకబడ్డ అఫ్గనిస్తాన్ 37.1 ఓవర్లలో టార్గెట్ ఛేదిస్తే సూపర్-4లో అడుగుపెట్టే అవకాశం. ఈ పరిస్థితుల్లో బ్యాటర్లంతా తలా ఓ చెయ్యి వేయగా.. 37 ఓవర్లలో స్కోరు 289 పరుగులకు చేరింది.
మరో బంతికి ఇంకో 3 పరుగులు తీస్తే చాలు విజయం సాధిస్తామనగా.. ధనంజయ డిసిల్వా అఫ్గనిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టాడు. అతడి బౌలింగ్‌లో 37.1వ ఓవర్ వద్ద ముజీబ్ ఉర్ రహమాన్ అవుట్ అయ్యాడు.
అయినప్పటికీ అఫ్గనిస్తాన్ సాంకేతికంగా.. 37.3 ఓవర్లలో 294 పరుగులు, 37.4 ఓవర్లలో 295 పరుగులు సాధిస్తే.. క్వాలిఫై అయ్యే అవకాశం ముంగిట నిలవగా.. ధనుంజయ మళ్లీ దెబ్బేశాడు. సింగిల్ కూడా తీయకుండా బిగుసుకుపోయిన ఫారూకీని ఎల్బీ డబ్ల్యూ చేశాడు. దీంతో అఫ్గనిస్తాన్ ఆటగాళ్ల హృదయాలు ముక్కలయ్యాయి.
చదవండి: అవును.. టీమిండియాలో నాకు చోటు లేదు.. ఇక: భువీ కీలక నిర్ణయం
What a thrilling match! Sri Lanka secures a spot in the Super 4s with a heart-pounding 2-run victory over Afghanistan! 🇱🇰🇦🇫#AsiaCup2023 #AFGvSL pic.twitter.com/PxL53z217r
— AsianCricketCouncil (@ACCMedia1) September 5, 2023
Comments
Please login to add a commentAdd a comment