Ind vs Ire: Jasprit Bumrah records historic achievement on his debut as T20I captain - Sakshi
Sakshi News home page

IND vs IRE: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. ధోని, కోహ్లికి కూడా సాధ్యం కాలేదు!

Published Sat, Aug 19 2023 11:29 AM | Last Updated on Sat, Aug 19 2023 3:06 PM

Jasprit Bumrah records historic achievement on his debut as T20I captain - Sakshi

టీమిండియా స్పీడ్‌ స్టార్‌ జస్ప్రీత్‌ బుమ్రా తన రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే వికెట్ల వేట మొదలు పెట్టాడు. డబ్లిన్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో తను వేసిన మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.  తన నాలుగు ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.

తద్వారా బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 కెప్టెన్‌గా అరంగేట్రంలోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు. కాగా ఈ సిరీస్‌కు సీనియర్లందరూ దూరం కావడంతో బుమ్రానే యువ భారత జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. టీ20ల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన తొలి ఫాస్ట్‌బౌలర్‌ కూడా బుమ్రానే కావడం గమానర్హం.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఐర్లాండ్‌పై డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో  2 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బారీ మెకార్తీ (33 బంతుల్లో 51 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించాడు.

భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిధ్‌ కృష్ణ, రవి బిష్ణోయ్‌ తలా 2 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు​. . తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ వర్షంతో ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి భారత విజయ సమీకరణం 45 పరుగులుగా ఉంది.  రెండు పరుగుల అధిక్యంలో ఉండటంతో డీఎల్‌ఎస్‌  ప్రకారం భారత్‌ను విజేతగా నిర్ణయించారు.
చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ!


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement