దేశవాళీ క్రికెట్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2024లో టీమిండియా యువ క్రికెటర్లందరూ భాగం కాబోతున్నారు. సీనియర్లు మినహా కీలక ఆటగాళ్లంతా ఈ రెడ్‌బాల్ టోర్నీ బరిలో దిగనున్నారు. శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ తదితరులతో పాటు.. అగ్రశ్రేణి ఆటగాళ్లు రవీంద్ర జడేజా, మహ్మద సిరాజ్, కేఎల్ రాహుల్ కూడా ఈ దులిప్ ట్రోఫీలో ఆడనున్నారు.
ఇందుకు సంబంధించి ఏ,బి,సి,డి జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. ఈ జట్లకు వరుసగా శుబ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ప్రకటనకు ముందు.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా దులిప్ ట్రోఫీ ఆడబోతున్నారనే వార్తలు వినిపించాయి.
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా ఈ నవతరం దిగ్గజాలు కూడా దేశవాళీ క్రికెట్ ఆడతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, రోహిత్, కోహ్లితో పాటు జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఈ టోర్నీకి దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి మాత్రమే మినహాయింపు ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా స్పందించారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి మినహాయింపు ఇవ్వడం గురించి చెబుతూ.. ‘‘వాళ్లు తప్ప మిగతా వాళ్లంతా దులిప్ ట్రోఫీలో ఆడుతున్నారు. ఇందుకు వారందరిని ప్రశంసించాలి. అంతేకాదు.. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇది హర్షించదగ్గ పరిణామం.
ఇక రోహిత్, కోహ్లి వంటి మేటి ఆటగాళ్లను కూడా దులిప్ ట్రోఫీలో ఆడాలని పట్టుబట్టడం సమంజసం కాదు. వాళ్లు గాయాల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత బోర్డుపై ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లలోని అంతర్జాతీయ క్రికెటర్లందరూ దేశవాళీ టోర్నీలు ఆడరు. బోర్డులు కూడా వారిని ఆడమని బలవంతపెట్టవు. ఆటగాళ్లకు తగిన గౌరవం ఇవ్వాలి కదా!’’ అని జై షా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.
ఇక బంగ్లాదేశ్‌లో పరిస్థితుల దృష్ట్యా భారత్‌తో టెస్టు సిరీస్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఇంతవరకు మేము బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులతో మాట్లాడలేదు. అక్కడ కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంది. వాళ్లు మమ్మల్ని సంప్రదిస్తారేమో చూడాలి. లేదంటే.. మేమే వాళ్లను సంప్రదిస్తాం.
ఎందుకంటే టీమిండియాకు బంగ్లాదేశ్‌తో సిరీస్ అత్యంత ముఖ్యమైనది’’ అని జై షా బదులిచ్చారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలవాలంటే బంగ్లాతో రెండు మ్యాచ్‌ల సిరీస్ తప్పనిసరి. ఈ రెండింటిలో గెలిచి అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment