ఎడిన్‌బరో: అంతర్జాతీయ టి20ల్లో ఆ్రస్టేలియా తరఫున వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన జోష్ ఇంగ్లిస్ (49 బంతుల్లో 103; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) స్కాట్లాండ్‌తో జరిగిన రెండో టి20లో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ ఆసీస్ ఆ్రస్టేలియా 70 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ను చిత్తుచేసింది.
ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (0) డకౌట్ కాగా, మూడో స్థానంలో బరిలోకి దిగిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇంగ్లిస్ రికార్డు విశ్వరూపం చూపాడు.
స్కాట్లాండ్ బౌలర్ల అనుభవరాహిత్యాన్ని సొమ్ము చేసుకుంటూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 43 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గతంతో తనతో పాటు ఫించ్, మ్యాక్స్‌వెల్ పేరిట ఉన్న 47 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును అతను బద్దలుకొట్టాడు.
ఇతర బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్ (29 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ క్యూరీ 3 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ 16.4 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది.
బ్రెండన్ మెక్‌మలెన్ (42 బంతుల్లో 59; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టొయినిస్ 4, కామెరూన్ గ్రీన్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 మ్యాచ్ శనివారం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment