Justin Langer Resigns As Australia Coach: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్‌గా కొనసాగాలని భావించిన జస్టిన్ లాంగర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తానెంతగానో ప్రేమించే హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేయక తప్పలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)తో అనేక చర్చల అనంతరం.. జస్టిన్ లాంగర్ తన పదవి నుంచి వైదొలిగినట్లు అతడి మేనేజ్‌మెంట్ కంపెనీ డీఎస్‌ఈజీ శనివారం ప్రకటన విడుదల చేసింది.
ఈ మేరకు... ‘‘మా క్లైంట్ జస్టిన్ లాంగర్.. ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా ఈరోజు ఉదయం రాజీనామా చేశారు. క్రికెట్ ఆస్ట్రేలియాతో నిన్నటి చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఆయన తన పదవి నుంచి వైదొలుగుతున్నారు’’ అని పేర్కొంది. కాగా ఆసీస్ క్రికెట్ బోర్డుతో కుదిరిన ఒప్పందం ప్రకారం జస్టిన్ లాంగర్ జూన్ వరకు తన పదవిలో కొనసాగాల్సి ఉంది. అయితే, దీర్ఘకాలం పాటు పదవీ కాలాన్ని పొడిగించాలని కోరగా... బోర్డు అందుకు సుముఖంగా లేనట్లు సమాచారం.
ఈ క్రమంలో సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లే, సీఏ నేషనల్ టీమ్స్ హెడ్ బెన్ ఒలివిర్‌తో ఈ విషయం గురించి చర్చించగా.. సానుకూల ఫలితం రాలేదు. దీంతో లాంగర్ రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే... ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్, ప్రస్తుత టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సహా పలువురు కీలక ఆటగాళ్లతో లాంగర్‌కు అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు సమాచారం. ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనలో ఆస్ట్రేలియాకు పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే.
చదవండి: సాండ్‌విచ్ కూడా తినడానికి అవకాశం ఇవ్వలేదు.. కోచ్‌గా నా బాధ్యత నిర్వర్తించడం తప్పా?
ఈ క్రమంలో ఆటగాళ్లతో విభేదాలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటాడని, అంతా తాను చెప్పినట్లే జరగాలనే నియంతృత్వ ధోరణితో ఉంటాడని ఆటగాళ్లు అతడి వ్యవహారశైలిపై మండిపడినట్లు సమాచారం. ఆయనతో తమకు పొసగడం లేదంటూ కోచ్‌కు వ్యతిరేకంగా గళం విప్పడంతో ఆయనను కొనసాగించేందుకు బోర్డు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా లాంగర్ మార్గదర్శనంలో ఆస్ట్రేలియా తొలిసారిగా టీ20 వరల్డ్‌కప్ చాంపియన్‌గా అవతరించింది. అంతేకాదు ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన యాషెస్ సిరీస్‌లోనూ 4-0 తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment