Kane Williamson Hits 5th Double Century Becomes-1st Cricketer More 200s - Sakshi
Sakshi News home page

Kane Williamson: కేన్‌ మామ డబుల్‌ సెంచరీ.. కివీస్‌ తరపున తొలి బ్యాటర్‌గా

Published Thu, Dec 29 2022 6:22 PM | Last Updated on Thu, Dec 29 2022 8:34 PM

Kane Williamson Hits 5th Double Century Becomes-1st Cricketer More 200s - Sakshi

పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ డబుల్‌ సెంచరీతో మెరిశాడు. మూడోరోజు ఆటలో సెంచరీతో మెరిసిన విలియమ్సన్‌ తాజా డబుల్‌ సెంచరీతో కొన్ని రికార్డులు బద్దలు కొట్టాడు. విలియమ్సన్‌ ఖాతాలో టెస్టుల్లో ఇది ఐడో డబుల్‌ సెంచరీ. కివీస్‌ తరపున అత్యధిక డబుల్‌ సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా కేన్‌ విలియమ్సన్‌ చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ నాలుగు డబుల్‌ సెంచరీలు బాదాడు. తాజాగా కేన్‌ మామ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.

►ఇక ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో టెస్టుల్లో ఎక్కువ డబుల్‌ సెంచరీలు కింగ్‌ కోహ్లి పేరిట ఉన్నాయి. కోహ్లి టెస్టుల్లో ఇప్పటివరకు ఏడు డబుల్‌ సెంచరీలు బాది తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రెండో స్థానం కేన్‌ విలియమ్సన్‌దే కావడం విశేషం. కేన్‌ మామ ఐదు డబుల్‌ సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.

►ఇక కేన్‌ విలియమ్సన్‌ ఆఖరిసారి సెంచరీ, డబుల్‌ సెంచరీ కొట్టింది పాకిస్తాన్‌పైనే. 2021 జనవరిలో క్రైస్ట్‌చర్చి వేదికగా పాక్‌తో జరిగిన టెస్టులో ఏకకాలంలో సెంచరీ, డబుల్‌ సెంచరీ సాధించాడు. అప్పుడు కేన్‌ విలియమ్సన్‌ 238 పరుగులు చేశాడు. తాజాగా రెండేళ్ల తర్వాత మళ్లీ అదే పాక్‌ జట్టుపై సెంచరీ చేయడంతో పాటు ఈసారి కూడా డబుల్‌ సెంచరీ ఫీట్‌ సాధించాడు. పాక్‌పై టెస్టుల్లో ఒకే మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీ, డబుల్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గా కేన్‌ విలియమ్సన్‌ నిలిచాడు.

పాక్‌, కివీస్‌ల తొలి టెస్టు డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జీవం లేని పిచ్‌పై బ్యాటర్లు పండుగ చేసుకుంటున్నారు. తాజాగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్‌ రెండు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఇమాముల్‌ హక్‌ 45, నుమన్‌ అలీ 4 పరుగులతో ఆడుతున్నారు. పాక్‌ ఇంకా 97 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు న్యూజిలాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 612 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. కేన్‌ విలియమ్సన్‌(200 నాటౌట్‌).. ఇష్‌ సోదీ 65 పరుగులు చేయగా.. టామ్‌ లాథమ్‌ సెంచరీ మెరిశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement