హామిల్టన్ (న్యూజిలాండ్): కెప్టెన్ కేన్ విలియమ్సన్ (412 బంతుల్లో 251; 34 ఫోర్లు, 2 సిక్స్‌లు) తన కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీ సాధించడంతోపాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడంతో... వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 243/2తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 145 ఓవర్లలో ఏడు వికెట్లకు 519 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. 97 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన విలియమ్సన్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
కీమర్ రోచ్ వేసిన ఇన్నింగ్స్ 81వ ఓవర్లో మూడో బంతిని బౌండరీ దాటించిన విలియమ్సన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇతర బ్యాట్స్‌మెన్ వెనుదిరుగుతున్నా... మరోవైపు విలియమ్సన్ దూకుడు కొనసాగించాడు. ఈసారీ రోచ్ బౌలింగ్‌లోనే బౌండరీ బాది విలియమ్సన్ డబుల్ సెంచరీ సాధించాడు. జేమీసన్ (51 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి ఏడో వికెట్‌కు 94 పరుగులు జోడించాక విలియమ్సన్ అవుటయ్యాడు. జేమీసన్ అర్ధ సెంచరీ పూర్తి కాగానే విలియమ్సన్ కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment