క్రీడాకారులు ఎవరైనా గెలవాలనే లక్ష్యంతో అహర్నిశలూ శ్రమించి పోటీల్లో పాల్గొంటారు. కానీ ఢిల్లీకి చెందిన కరణ్ సింగ్‌కు మాత్రం ఆ అదృష్టం దక్కలేదు. తాను ఎంతో కష్టపడి ప్రాక్టిస్ చేసినప్పటికీ పోటీలో పాల్గొనలేకపోయాడు. ఆరేళ్లపాటు శిక్షణ తీసుకుని దేశం తరపున అథ్లెటిక్స్‌లో పాల్గొనాలన్న కరణ్ కల విధి వక్రీకరించడంతో... అనేకమార్లు మోకాళ్ల గాయాలు, సర్జరీల మూలంగా ఆ ఆశలు ఆవిరైపోయాయి. ఇక ఎప్పటికీ తాను పోటీలలో పాల్గొనలేను అని తెలిసినప్పుడు ఎంతో బాధపడ్డాడు. అయినప్పటికీ ప్రతిభ ఉండి మరుగున పడిపోతున్న పిల్లలకు శిక్షణ ఇవ్వడం ద్వారా తన కలను నిజం చేసుకోవచ్చని అనుకున్నాడు కరణ్.
అమెరికాలో అంతర్జాతీయ కోచ్‌ల వద్ద ఆరేళ్లపాటు శిక్షణ పొందిన కరణ్ అప్పటి తన అనుభవంతో ఊటీ జార్ఖండ్ ప్రాంతాల్లోని గిరిజన పిల్లలకు శిక్షణ ఇస్తూ వారిలోని ప్రతిభను వెలికి తీస్తున్నారు. మిడిల్, లాంగ్ డిస్టెన్స్, రన్నింగ్ కాంపిటీషన్లలో వీరిని బరిలో నిలిపేందుకు గట్టిగా తీర్చిదిద్దుతున్నారు. 2028 లా ఒలింపిక్స్ బరిలో ఈ పిల్లలను నిలపడం తన కల అని కరణ్ చెబుతున్నాడు.
ఈ క్రమంలోనే తన సొంత ఊరు అయిన న్యూఢిల్లీ నుంచి ఊటీకి తన మకాం మార్చి 2018 ఆగస్టులో ఊటీలో ‘ఇండియన్ ట్రాక్ ఫౌండేషన్’(ఐటీఎఫ్)ను ఏర్పాటు చేశాడు. ఊటీ పరిసర ప్రాంతాల్లోని గిరిజన తండాల్లోని పిల్లలకు రన్నింగ్‌లో శిక్షణ ఇస్తున్నాడు. 10–16 ఏళ్ల వయసు ఉన్న పిల్లలందర్ని ఒక ఇంట్లో ఉంచి కరణ్, అతని భార్య ఇద్దరు కలిసి వారి బాగోగులు చూసుకుంటున్నారు.
వీరి అవసరాలకయ్యే ఖర్చు మొత్తం వారే భరిస్తూ.. వారికి రన్నింగ్‌లో శిక్షణతోపాటు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తూ సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు. ఏటా ఇక్కడ చేరే పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఐటీఎఫ్ ఏర్పాటు చేసేందుకు కరణ్‌కు మూడేళ్లు పట్టింది. ఐటీఎఫ్‌లో శిక్షణ పొందుతున్న పిల్లలు వివిధ పోటీలలో పాల్గొని విజయం సాధించడంతోపాటు స్టేట్ ఛాంపియన్, నేషనల్ క్రాస్ కంట్రీ ఛాంపియన్‌లుగా నిలుస్తున్నారు. 2028 లా ఒలింపిక్స్‌లో తమ అకాడమీ పిల్లలు తప్పక విజయం సాధిస్తారని కరణ్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment