వరుణ్ చక్రవర్తి, నరైన్
వరుణ్ చక్రవర్తి (4–0–20–5) ... ఈ మ్యాచ్‌కు ముందు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో తీసిన వికెట్లు 7. ఒక మ్యాచ్‌లో గరిష్టంగా పడగొట్టిన వికెట్లు 2. అందుకే ఈ మ్యాచ్‌లోనూ అతనిపై పెద్దగా అంచనాల్లేవు. కానీ ఒక స్పెల్ అతన్ని అందరూ గుర్తుంచుకునేలా చేసింది. బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించింది. పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించింది. బ్యాటింగ్‌లో నరైన్, నితీశ్ రాణా మెరుపులు... వరుణ్ చక్రవర్తి మాయాజాలం కోల్‌కతాకు ఘనవిజయాన్ని అందించాయి.
అబుదాబి: బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ టి20 టోర్నీలో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోన్న ఢిల్లీ క్యాపిటల్స్‌పై 59 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఓపెనర్ నితీశ్ రాణా (53 బంతుల్లో 81; 13 ఫోర్లు, 1 సిక్స్), సునీల్ నరైన్ (32 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 56 బంతుల్లోనే 115 పరుగుల్ని జోడించి మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. నోర్జే, రబడ, స్టొయినిస్ తలా 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుణ్ చక్రవర్తి (5/20) మాయాజాలానికి దాసోహమైంది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (38 బంతుల్లో 47; 5 ఫోర్లు), రిషభ్ పంత్ (33 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. కమిన్స్ 3 వికెట్లు పడగొట్టాడు.
తడబాటు...
కోల్‌కతా ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలైంది. దూకుడుగా ఆడే ప్రయత్నంలో శుభ్‌మన్ గిల్ (9) రెండో ఓవర్‌లోనే అవుటయ్యాడు. నితీశ్ రాణా క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తుండగా... నోర్జే అద్భుత యార్కర్‌కు త్రిపాఠి (13) వద్ద సమాధానం లేకపోయింది. ఈ రెండు వికెట్లను దక్కించుకున్న నోర్జే పవర్‌ప్లేలో కోల్‌కతాను 36/2తో కట్టడి చేశాడు. దినేశ్ కార్తీక్ (3) కూడా చేతులెత్తేశాడు.
ఎదురు దాడి...
ఈ దశలో క్రీజులోకి వచ్చిన నరైన్ ఎదురుదాడి చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో వరుసగా 6,4 బాదాడు. రాణా కూడా బ్యాట్ ఝళిపించడంతో తుషార్ 18 పరుగుల్ని సమర్పించుకున్నాడు. ఈ ఓవర్‌లో నరైన్ రెండు ఫోర్లు, రాణా సిక్సర్ ఢిల్లీపై ఆధిపత్యం చాటుకున్నారు. బౌలర్ ఎవరైనా బాదడమే లక్ష్యంగా పెట్టుకున్న వీరిద్దరూ చకచకా పరుగులు సాధించారు. ఓవర్‌లో కనీసం రెండు బౌండరీలు ఉండేలా వీరి విధ్వంసం సాగింది. ఈ క్రమంలో తొలుత 35 బంతుల్లో నితీశ్ అర్ధసెంచరీ అందుకున్నాడు. స్టొయినిస్ బౌలింగ్‌లో దూకుడు పెంచిన నరైన్ 6, 4 బాది అర్ధసెంచరీకి చేరువయ్యాడు.
అశ్విన్ ఓవర్‌లో ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న అతను 24 బంతుల్లోనే ఆ మార్క్‌ను అందుకున్నాడు. 4, 6తో 15 పరుగులు పిండుకున్నాడు. తర్వాత కాసేపటికే నరైన్‌ను అవుట్ చేసి రబడ ఈ జోడీని విడదీశాడు. కానీ మరో ఎండ్‌లో రాణా మాత్రం తడబడలేదు. అదే ఓవర్‌లో ఓ బౌండరీ బాదిన రాణా నోర్జే బౌలింగ్‌లో మరో ఫోర్‌తో ధాటి కొనసాగించాడు. మోర్గాన్ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. రబడ బౌలింగ్‌లో 6,4 బాదాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో వరుస బంతుల్లో వీరిద్దరినీ అవుట్ చేసిన స్టొయినిస్ కోల్‌కతాను 200లోపే కట్టడి చేశాడు.
ఆరంభంలోనే షాక్...
భారీ లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. రహానే (0)ను అవుట్ చేసిన కమిన్స్ ప్రమాదకరంగా కనిపించాడు. అనుకున్నట్లే మూడో ఓవర్‌లో అద్భుత బంతితో ధావన్ (6) ఆఫ్‌స్టంప్‌ను గిరాటేసిన కమిన్స్ కోల్‌కతా శిబిరంలో ఆనందాన్ని నింపాడు. మరోవైపు ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను శ్రేయస్ భుజానికెత్తుకున్నాడు. దీంతో పవర్‌ప్లేలో ఢిల్లీ కూడా కోల్‌కతా చేసిన స్కోరే సాధించింది. పంత్ జతగా అయ్యర్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వికెట్‌కు ప్రాధాన్యమిచ్చిన వీరిద్దరూ ఆచితూచి బౌండరీలు బాదుతూ పరుగులు జోడించారు.
వరుణ్ తిప్పేశాడు...
ఈ జంట క్రీజులో కుదురుకుంటోన్న సమయంలో వరుణ్ తొలిసారిగా బంతిని అందుకున్నాడు. వేసిన రెండో బంతికే పంత్‌ను పెవిలియన్ చేర్చాడు. సిక్స్ కొట్టి జోరు కనబరిచిన హెట్‌మైర్ (10), క్రీజులో పాతుకుపోయిన శ్రేయస్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి మ్యాచ్ గతిని మార్చేశాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 110/5 తో నిలిచింది. ఢిల్లీ విజయ సమీకరణం 30 బంతుల్లో 85 పరుగులుగా ఉండగా 16వ ఓవర్‌లో మళ్లీ బంతినందుకున్న వరుణ్ తొలి బంతికి స్టొయినిస్ (6), ఐదో బంతికి అక్షర్ (9)లను అవుట్ చేసి ఢిల్లీని దెబ్బ తీశాడు. ఆ తర్వాత ఢిల్లీ కోలుకోలేకపోయింది. చివరి రెండు ఓవర్లలో రబడ (9)ను కమిన్స్, తుషార్ (1)ను ఫెర్గూసన్ అవుట్ చేసి కోల్‌కతాకు ఘనవిజయాన్ని అందించారు.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) అక్షర్ పటేల్ (బి) నోర్జే 9; నితీశ్ రాణా (సి) తుషార్ (బి) స్టొయినిస్ 81; రాహుల్ త్రిపాఠి (బి) నోర్జే 13; దినేశ్ కార్తీక్ (సి) పంత్™ (బి) రబడ 3; సునీల్ నరైన్ (సి) రహానే (బి) రబడ 64; మోర్గాన్ (సి) రబడ (బి) స్టొయినిస్ 17; కమిన్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 194.
బౌలింగ్: 1–11, 2–35, 3–42, 4–157, 5–194, 6–194.
బౌలింగ్: తుషార్ దేశ్‌పాండే 4–0–40–0, నోర్జే 4–0–27–2, రబడ 4–0–33–2, అక్షర్ పటేల్ 1–0–7–0, స్టొయినిస్ 4–0–41–2, రవిచంద్రన్ అశ్విన్ 3–0–45–0.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: రహానే (ఎల్బీడబ్ల్యూ) (బి) కమిన్స్ 0; ధావన్ (బి) కమిన్స్ 6; శ్రేయస్ అయ్యర్ (సి) నాగర్‌కోటి (బి) వరుణ్ 47; రిషభ్ పంత్ (సి) గిల్ (బి) వరుణ్ 27; హెట్‌మైర్ (సి) రాహుల్ త్రిపాఠి (బి) వరుణ్ 10; స్టొయినిస్ (సి) రాహుల్ త్రిపాఠి (బి) వరుణ్ 6; అక్షర్ పటేల్ (బి) వరుణ్ 9; రబడ (సి) రాహుల్ త్రిపాఠి (బి) కమిన్స్ 9; రవిచంద్రన్ అశ్విన్ (నాటౌట్) 14; తుషార్ దేశ్‌పాండే (సి) మోర్గాన్ (బి) ఫెర్గూసన్ 1; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 135.
వికెట్ల పతనం: 1–0, 2–13, 3–76, 4–95, 5–95, 6–110, 7–112, 8–132, 9–135.
బౌలింగ్: కమిన్స్ 4–0–17–3, ప్రసిధ్ కృష్ణ 2–0–19–0, కమలేశ్ నాగర్‌కోటి 2–0–11–0, ఫెర్గూసన్ 4–0–30–1, నరైన్ 4–0–37–0, వరుణ్ చక్రవర్తి 4–0–20–5.
అంకితం!
నితీశ్ రాణాకు అత్యంత ఆత్మీయుడైన అతని మామ సురీందర్ మార్వా గురువారం మరణించారు. మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించిన అనంతరం ఆయన పేరుతో ఉన్న కేకేఆర్ జెర్సీని ప్రదర్శిస్తూ రాణా ఇలా నివాళి అర్పించాడు.
Comments
Please login to add a commentAdd a comment