63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 124
చెన్నైపై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
రుతురాజ్ అజేయ సెంచరీ వృథా
చెన్నై: నాలుగు రోజుల క్రితం లక్నో వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ఇప్పుడు చెన్నైలో రీప్లేగా జరిగిన పోరులో లక్నోనే మళ్లీ ‘సూపర్’గా ఆడి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో 6 వికెట్ల తేడాతో చెన్నైపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీస్కోరు చేసింది.
ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకాన్ని నమోదు చేశాడు. ‘హిట్టర్’ శివమ్ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి గెలిచింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కస్ స్టొయినిస్ (63 బంతుల్లో 124 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్స్‌లు) అసాధారణ ఇన్నింగ్స్‌తో అజేయ సెంచరీ సాధించి లక్నోను విజయతీరాలకు చేర్చాడు. పూరన్‌తో నాలుగో వికెట్‌కు 70 పరుగులు, దీపక్ హుడాతో అబేధ్యమైన ఐదో వికెట్‌కు 55 పరుగులు జోడించిన స్టొయినిస్ లక్నోకు చిరస్మరణీయ విజయం అందించాడు.
కెప్టెన్ ఇన్నింగ్స్...
రహానే (1), వన్‌డౌన్‌లో మిచెల్ (11), జడేజా (16) చెన్నై టాప్–4 బ్యాటర్లలో ముగ్గురి స్కోరిది! పవర్ ప్లేలో చెన్నై చేసిన స్కోరు 49/2 తక్కువే! ఈ దశలో కెప్టెన్ రుతురాజ్ బౌండరీలతో పరుగుల వేగాన్ని అందుకున్నాడు. గైక్వాడ్ 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 11.3 ఓవర్లలో వందకు చేరింది.
అదే ఓవర్లో జడేజా నిష్క్రమించడంతో వచ్చిన దూబే ఓ రకంగా శివతాండవమే చేశాడు. 15 ఓవర్లలో చెన్నై 135/3 స్కోరు చేసింది. కానీ ఆ తర్వాత దూబే పవర్‌ప్లే మొదలైంది. భారీ సిక్సర్లతో స్కోరు ఒక్కసారిగా దూసుకెళ్లింది.
16వ ఓవర్లో దూబే హ్యాట్రిక్ సిక్స్‌లతో 19 పరుగులు, 18వ ఓవర్లో గైక్వాడ్ 6, 4, 4లతో 16 పరుగులు, 19వ ఓవర్లో మళ్లీ దూబే దంచేయడంతో 17 పరుగులు, ఆఖరి ఓవర్లో 15 పరుగులతో స్కోరు 200 పైచిలుకు చేరింది. చివరి 5 ఓవర్లలో దూబే వికెట్ మాత్రమే కోల్పోయిన చెన్నై 75 పరుగులు సాధించింది. గైక్వాడ్ 56 బంతుల్లో శతకాన్ని, దూబే 22 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నారు.
బ్యాటింగ్ గేర్ మార్చి...
కొండంత లక్ష్యం ముందున్న లక్నోకు ఆరంభంలో అన్ని ఎదురుదెబ్బలే తగిలాయి. ఓపెనర్లు డికాక్ (0), కేఎల్ రాహుల్ (14 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్), దేవదత్ పడిక్కల్ (19 బంతుల్లో 13) నిరాశపరిచారు. టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన స్టొయినిస్ ఒక్కడే గెలిపించేదాకా మెరిపించాడు.
ఈ క్రమంలో 26 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. తర్వాత నికోలస్ పూరన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జోరు పెంచగానే... పతిరణ మరుసటి ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. స్టొయినిస్ 56 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీపక్ హుడా కూడా (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్‌కు పని చెప్పడంతో అనూహ్యంగా లక్నో లక్ష్యం వైపు పరుగు పెట్టింది.
18 బంతుల్లో 47 పరుగుల కష్టమైన సమీకరణం ఇద్దరి దూకుడుతో సులువైంది. 18, 19వ ఓవర్లలో 15 పరుగుల చొప్పున వచ్చాయి. 6 బంతుల్లో 17 పరుగుల్ని స్టొయినిస్ 6, 4, నోబాల్4, 4లతో ఇంకో మూడు బంతులు మిగిల్చి ముగించాడు.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: రహానే (సి) రాహుల్ (బి) హెన్రి 1; రుతురాజ్ (నాటౌట్) 108; మిచెల్ (సి) హుడా (బి) యశ్ 11; జడేజా (సి) రాహుల్ (బి) మోసిన్ 16; దూబే (రనౌట్) 66; ధోని (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–4, 2–49, 3–101, 4–205. బౌలింగ్: హెన్రీ 4–0–28–1, మోసిన్ ఖాన్ 4–0–50–1, రవి బిష్ణోయ్ 2–0–19–0, యశ్ ఠాకూర్ 4–0–47–1, స్టొయినిస్ 4–0–49–0, కృనాల్ పాండ్యా 2–0–15–0.
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) దీపక్ 0; రాహుల్ (సి) రుతురాజ్ (బి) ముస్తఫిజుర్ 16; స్టొయినిస్ (నాటౌట్) 124; పడిక్కల్ (బి) పతిరణ 13; పూరన్ (సి) శార్దుల్ (బి) పతిరణ 34; హుడా (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–0, 2–33, 3–88, 4–158. బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–1, తుషార్ 3–0–34–0, ముస్తఫిజుర్ 3.3–0–51–1, శార్దుల్ 3–0–42–0, మొయిన్ అలీ 2–0–21–0, జడేజా 2–0–16–0, పతిరణ 4–0–35–2.
ఐపీఎల్‌లో నేడు
ఢిల్లీ X గుజరాత్
వేదిక: న్యూఢిల్లీ
రాత్రి7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment