
ఇండోర్: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలిసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టాలనుకున్న ఆంధ్ర జట్టు ఆశలు గల్లంతయ్యాయి. సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 4 పరుగుల తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 95/4తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 69.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది.
హనుమ విహారి (136 బంతుల్లో 55; 5 ఫోర్లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనుభవ్ (6/52) ఆరు వికెట్లతో ఆంధ్రను దెబ్బ తీశాడు. 129/8తో ఇబ్బందుల్లో పడిన ఆంధ్ర జట్టును అశి్వన్ హెబర్ (22), గిరినాథ్ రెడ్డి (15) తొమ్మిదో వికెట్‌కు 32 పరుగులు జత చేసి గెలుపు దిశగా తీసుకెళ్లారు.
అయితే గిరినాథ్‌నూ అనుభవ్ వెనక్కి పంపించాడు. గెలుపు కోసం చివరి వికెట్‌కు మరో 9 పరుగులు చేయాల్సి ఉండగా ఆంధ్ర నాలుగు పరుగులు జోడించింది. అయితే ఖెజ్రోలియా బౌలింగ్‌లో హెబర్ ఎల్బీడబ్ల్యూ కావడంతో ఆంధ్ర శిబిరం తీవ్ర నిరాశలో మునిగింది. మరో క్వార్టర్ ఫైనల్లో తమిళనాడు ఇన్నింగ్స్, 33 పరుగుల తేడాతో సౌరాష్ట్రను ఓడించి సెమీస్‌లోకి అడుగు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment