
కెప్టెన్ కోహ్లి డకౌట్, పట్టుదలకు మారుపేరైన పుజారా డకౌట్, గత మ్యాచ్ హీరో శ్రేయస్ విఫలం... అయినా సరే న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో తొలి రోజును భారత్ మెరుగైన స్థితిలో ముగించగలిగింది. అందుకు కారణం మయాంక్ అగర్వాల్! ప్రతికూల పరిస్థితుల్లో పట్టుదలగా క్రీజ్‌లో నిలబడిన అతను ఆకట్టుకునే షాట్లతో అజేయ శతకం సాధించాడు. మొత్తం స్కోరులో సగంకంటే ఎక్కువ పరుగులు సాధించి జట్టును ఆదుకున్నాడు. మరోవైపు భారత్ కోల్పోయిన నాలుగు వికెట్లనూ తనే పడగొట్టి కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ తొలి రోజు ఆటపై తనదైన ముద్ర వేశాడు.
ముంబై: న్యూజిలాండ్‌తో శుక్రవారం మొదలైన రెండో టెస్టులో ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 4 వికెట్లకు 221 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (246 బంతుల్లో 120 బ్యాటింగ్; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేయగా, శుబ్‌మన్ గిల్ (71 బంతుల్లో 44; 7 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం మయాంక్‌తో పాటు సాహా (25 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. ఎజాజ్ పటేల్‌కు 4 వికెట్లు దక్కాయి. మోచేతి గాయం కారణంగా న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ విలియమ్సన్ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
పుజారా, కోహ్లి డకౌట్...
ఓపెనర్లు మయాంక్, గిల్ జట్టుకు శుభారంభం అందించారు. న్యూజిలాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేశారు. అయితే తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించిన తర్వాత గిల్‌ను అవుట్ చేసి ఎజాజ్ కివీస్‌కు తొలి వికెట్ అందించాడు. ఆపై అదే స్కోరు వద్ద భారత్ అనూహ్యంగా మరో రెండు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఎజాజ్ ఒకే ఓవర్లో పుజారా (0), కోహ్లి (0)లను పెవిలియన్ పంపించి ఒక్కసారిగా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇలాంటి స్థితిలో మయాంక్‌కు శ్రేయస్ అయ్యర్ (18) కొద్ది సేపు అండగా నిలిచాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 80 పరుగులు జోడించిన అనంతరం అయ్యర్ వికెట్ కూడా ఎజాజ్ ఖాతా లోనే చేరింది. ఈ దశలో జాగ్రత్తగా ఆడిన మయాంక్, సాహా అర్ధసెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
మయాంక్ జోరు...
గత 13 ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక అర్ధసెంచరీ సాధించి జట్టులో స్థానం ప్రశ్నార్ధకంగా మారిన తరుణంలో మయాంక్ ఓపెనర్‌గా తన విలువేంటో చూపించాడు. సహచరులంతా విఫలమైన చోట అద్భుత బ్యాటింగ్‌తో అతను సత్తా చాటాడు. ఫోర్‌తో ఖాతా తెరిచిన అతను చివరి వరకు అదే జోరును కొనసాగించాడు. ఇతర బ్యాటర్లు ఇబ్బంది పడ్డ ఎజాజ్ బౌలింగ్‌లో మయాంక్ రెండు సిక్సర్లు సహా అలవోకగా పరుగులు రాబట్టడం విశేషం. మిచెల్ బౌలింగ్‌లో కొట్టిన కవర్‌డ్రైవ్ బౌండరీతో టెస్టుల్లో అతని నాలుగో సెంచరీ పూర్తయింది.
తొలి సెషన్ వృథా...
ఊహించినట్లుగానే తొలి రోజు ఆటను వర్షం ఇబ్బంది పెట్టింది. ఉదయం అవుట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో నిర్ణీత సమయానికి ఆట ప్రారంభం కాలేదు. దాదాపు తొలి సెషన్ సమయం అంతా వృథా అయింది. మొత్తంగా మొదటి రోజు 20 ఓవర్లు తక్కువగా పడ్డాయి.
అవుటా...నాటౌటా!
కెప్టెన్ కోహ్లి నిష్క్రమణపై శుక్రవారం తీవ్ర చర్చ జరిగింది. ఎజాజ్ బౌలింగ్‌లో బంతి ప్యాడ్లకు తాకగా, బౌలర్ అప్పీల్ చేయడంతో అంపైర్ అనిల్ చౌదరి అవుట్‌గా ప్రకటించాడు. దాంతో కోహ్లి ‘రివ్యూ’ కోరాడు. ఎన్నిసార్లు రీప్లేలు చూసినా థర్డ్ అంపైర్ వీరేంద్ర శర్మకు కూడా స్పష్టత రాలేదు. బంతి ముందుగా ప్యాడ్‌కు తగిలిందా లేక బ్యాట్‌కు తగిలి ఆపై ప్యాడ్ వైపు మళ్లిందా అనేది అర్థం కాలేదు. ఒక కోణంనుంచి చూస్తే బంతి బ్యాట్, ప్యాడ్‌కు ఒకేసారి తగిలినట్లుగా కనిపించింది. చివరకు ‘కన్‌క్లూజివ్ ఎవిడెన్స్’ లేదంటూ ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే అతను మద్దతు పలికాడు. దాంతో మరో అంపైర్ నితిన్ మీనన్ ముందు తన అసంతృప్తిని ప్రదర్శించి మైదానం వీడిన కోహ్లి వెళుతూ వెళుతూ అసహనంతో బౌండరీ కుషన్స్‌ను బ్యాట్‌తో కొట్టాడు. థర్డ్ అంపైర్ కూడా ఆ సమయంలో కొంత ఆందోళనకు లోనయ్యాడేమో... ‘బాల్ ట్రాకింగ్’ కూడా చూడకుండానే తన నిర్ణయాన్ని వెలువరించాడు. చివరకు అనిల్ చౌదరినే దానిని గుర్తు చేయాల్సి వచ్చింది.
పాపం రహానే!
కాన్పూర్ టెస్టు నవంబర్ 29న ముగిసింది. కానీ ఆ టెస్టు ఆఖరి రోజు రహానేకు కూడా స్వల్ప గాయమైందని, రెండో టెస్టు ప్రారంభానికి కొద్ది సేపు ముందు గానీ బీసీసీఐ ప్రకటించలేదు! ఆ మ్యాచ్‌లో చివరి రోజు 90 ఓవర్లూ ఫీల్డింగ్ చేసి, గురువారం నెట్‌ప్రాక్టీస్ చేసి, శుక్రవారం ఉదయం బ్రహ్మాండంగా ఫీల్డింగ్ సాధన చేసిన రహానేకు ‘కాస్త’ ఎడమ తొడ కండరాలు పట్టేశాయంటూ మ్యాచ్ నుంచి తప్పించింది. సరిగ్గా చెప్పాలంటే ఫామ్‌లో లేని రహానేను కోహ్లి కోసం పక్కన పెట్టేందుకు ‘వేటు’ అనకుండా మర్యాదపూర్వకంగా ‘గాయం’ సాకును వాడుకున్నట్లు అనిపించింది. 79 టెస్టుల కెరీర్‌లో సొంత మైదానం ముంబైలో ఒక్క టెస్టూ ఆడని రహానేకు ఇప్పుడూ అవకాశం చేజారింది. ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా కూడా గాయాలతో మ్యాచ్‌కు దూరం కావడంతో వీరిద్దరి స్థానాల్లో సిరాజ్, జయంత్ యాదవ్‌లకు అవకాశం దక్కింది. నాలుగేళ్ల తర్వాత జయంత్‌కు మళ్లీ టెస్టు ఆడే చాన్స్ లభించింది.
ముంబైలో ముంబైకర్ జోరు!
33 ఏళ్ల ఎజాజ్ పటేల్ ముంబైలో పుట్టాడు. ఎనిమిదేళ్ల వయసులో అతని కుటుంబం న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది. ఇప్పుడు అదే ముంబైలో భారత్‌పై టెస్టు మ్యాచ్ ఆడిన అతను ‘సొంత’ గడ్డపై సత్తా చాటాడు. ముంబైతో పలు జ్ఞాపకాలు ఉన్నాయంటూ పదే పదే చెబుతూ వచ్చిన పటేల్, ఇప్పుడు తన ఆటతోనూ దానిని చిరస్మరణీయం చేసుకున్నాడు. ‘అంతా కలలా ఉంది. ఇక్కడ ఆడటమే కాదు తొలి రోజు నాలుగు వికెట్లు తీయడం ఎంతో ప్రత్యేకం. నా సొంత ఊరు, వాంఖెడే మైదానంలో ఈ ప్రదర్శన రావడం నా అదృష్టం’ అంటూ ఎజాజ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (బ్యాటింగ్) 120; గిల్ (సి) టేలర్ (బి) ఎజాజ్ 44; పుజారా (బి) ఎజాజ్ 0; కోహ్లి (ఎల్బీ) (బి) ఎజాజ్ 0; శ్రేయస్ (సి) బ్లన్‌డెల్ (బి) ఎజాజ్ 18; సాహా (బ్యాటింగ్) 25; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (70 ఓవర్లలో 4 వికెట్లకు) 221.
వికెట్ల పతనం: 1–80, 2–80, 3–80, 4–160. బౌలింగ్: సౌతీ 15–5–29–0, జేమీసన్ 9–2–30–0, ఎజాజ్ పటేల్ 29–10–73–4, సోమర్‌విలే 8–0–46–0, రచిన్ రవీంద్ర 4–0–20–0, మిచెల్ 5–3–9–0.