2024, మార్చి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (ఏప్రిల్ 4) ప్రకటించింది. పురుషుల క్రికెట్‌లో ఈ అవార్డు కోసం ఐర్లాండ్ పేసర్ మార్క్ అదైర్, న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ, శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ పోటీపడనున్నారు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్‌నర్, ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ మైయా బౌచియర్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ ఈ అవార్డు రేసులో ఉన్నారు.
మార్క్ అదైర్: మార్చి నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఆల్ ఫార్మాట్ సిరీస్‌లలో అదైర్ అద్భుతంగా రాణించాడు. తొలుత జరిగిన ఏకైక టెస్ట్‌లో 8 వికెట్లతో అదరగొట్టిన అదైర్.. ఆతర్వాత వన్డే సిరీస్‌లో 3 వికెట్లు, టీ20 సిరీస్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు.
కమిందు మెండిస్: ఈ శ్రీలంక ఆల్‌రౌండర్ మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20, టెస్ట్ సిరీస్‌లో విశేషంగా రాణించాడు. టీ20ల్లో పర్వాలేదనిపించిన కమిందు.. తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. కమిందు తన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 328 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాట్ హెన్రీ: మార్చిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో హెన్రీ ఆద్భుతంగా రాణించాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను న్యూజిలాండ్ 0-2 తేడాతో కోల్పోయినప్పటికీ హెన్రీ 17 వికెట్లతో సత్తా చాటాడు. ఈ సిరీస్‌లో బ్యాట్‌తోనూ పర్వాలేదనిపించిన హెన్రీ 25.25 సగటున 101 పరుగులు చేశాడు.
ఆష్లే గార్డ్‌నర్: మార్చి నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గార్డ్‌నర్ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించింది. ఈ సిరీస్‌లో ఆమె 52 పరుగులు సహా ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును సైతం గెలుచుకుంది. ఈ సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. గార్డ్‌నర్ రికార్డు స్థాయిలో నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు గెలుచుకుంది.
మైయా బౌచియర్: బౌచియర్ మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో విశేషంగా రాణించింది. ఈ సిరీస్‌లో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచిన ఆమె 55.75 సగటున 223 పరుగులు చేసింది. నాలుగో టీ20లో బౌచియర్ చేసిన స్కోర్ (91) ఆమె కెరీర్‌లో అత్యుత్తమ స్కోర్‌గా నమోదైంది. ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ 4-1 తేడాతో గెలుచుకుంది.
అమేలియా కెర్: మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కెర్ ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో కెర్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 114 పరుగులు చేసి ఆరు వికెట్లు పడగొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment