న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల జట్ల (వన్డే, టీ20) ఫుల్ టైమ్ కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ న్యూజిలాండ్ అధికారికంగా ప్రకటించింది. సాంట్నర్.. కేన్ విలియమ్సన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడు. కేన్ మామ ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
32 ఏళ్ల సాంట్నర్ న్యూజిలాండ్ తరఫున 100కు పైగా వన్డేలు, టీ20లు ఆడాడు. సాంట్నర్ ఇప్పటికే 24 టీ20లు, 4 వన్డేల్లో న్యూజిలాండ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. న్యూజిలాండ్ ఫుల్ టైమ్ కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్ ప్రస్తానం ఈ నెలాఖరులో జరిగే శ్రీలంక సిరీస్‌తో మొదలవుతుంది. సమీప భవిష్యత్తులో న్యూజిలాండ్ బిజీ షెడ్యూల్ (పరిమిత ఓవర్ల సిరీస్‌లు) కలిగి ఉంది. శ్రీలంకతో సిరీస్‌ల అనంతరం పాక్‌తో కలిసి ట్రయాంగులర్ సిరీస్‌లో పాల్గొంటుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. దీని తర్వాత స్వదేశంలో పాక్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉంది.
న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్‌గా ఎంపిక కావడంపై సాంట్నర్ స్పందిస్తూ.. ఇది చాలా గొప్ప గౌరవమని అన్నాడు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు న్యూజిలాండ్‌కు ఆడాలనేది తన కల అని చెప్పాడు. అలాంటిది ఏకంగా తన జట్టును ముందుండి నడిపించే అవకాశం రావడం అదృష్టమని తెలిపాడు. కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టడం సవాలుగా భావిస్తున్నానని అన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ రెడ్ బాల్ (టెస్ట్) కెప్టెన్‌గా టామ్ లాథమ్ కొనసాగనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment