న్యూఢిల్లీ: ‘‘నేటితో నాలుగేళ్లు పూర్తయ్యాయి. నిన్ను మళ్లీ ఒక్కసారి చూడాలని ఉంది నాన్నా, ఈ తలుపు గుండా లోపలికి వచ్చెయ్. ఇది అసాధ్యమని నాకు తెలుసు. నా కన్నీళ్లను నువ్వు చూస్తూనే ఉంటావు. నేను ఏడవకూడదని కోరుకుంటావు. నిన్ను శాశ్వతంగా కోల్పోయినపుడు గుండెపగిలేలా ఏడ్చాను. ఈ విషాదం నుంచి తేరుకునేందుకు ధైర్యాన్ని ఇవ్వమని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. నీకు కొడుకుగా పుట్టినందుకు ఎంతగానో గర్విస్తున్నా. మిస్ యూ, లవ్ యూ డాడ్!’’ అంటూ టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ భావోద్వేగానికి లోనయ్యాడు. తండ్రి నాలుగో వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయనను స్మరించుకుంటూ నివాళులు అర్పించాడు. కాగా షమీ తండ్రి 2017లో గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. (చదవండి: ఐసీసీ సరికొత్త అవార్డు.. పరిశీలనలో వారి పేర్లు!)
ఇక ఆస్ట్రేలియాతో జరిగిన అడిలైడ్ టెస్టు మ్యాచ్‌లో గాయపడిన షమీ.. మిగతా మూడు మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. పింక్‌బాల్ టెస్టులో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కుడిచేయికి గాయమైంది. దీంతో అతడు స్వదేశానికి తిరిగి వచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగనున్న టెస్టు సిరీస్ తొలి రెండు మ్యాచ్‌లకు ప్రకటించిన జట్టులో షమీకి చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు భారత్ తరఫున 50 టెస్టులాడిన షమీ.. 180 వికెట్లు తీశాడు. 79 వన్డేల్లో 148 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పొట్టిఫార్మాట్‌లో ఇప్పటివరకు 12 వికెట్లు తీశాడు. (చదవండి: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: పూర్తి షెడ్యూల్ ఇదే!)
Comments
Please login to add a commentAdd a comment