IPL 2023, MI Vs PBKS Highlights: Mumbai Indians Beat Punjab Kings By 6 Wickets - Sakshi
Sakshi News home page

IPL 2023 PBKS Vs MI: చెలరేగిన ఇషాన్‌ కిషన్, సూర్య.. 4 వికెట్లే కోల్పోయి 7 బంతులు ఉండగానే ఛేదన

Published Thu, May 4 2023 12:31 AM | Last Updated on Thu, May 4 2023 8:34 AM

 Mumbai Indian chase down 215 for fifth win - Sakshi

మొహాలి: మూడు రోజుల క్రితం 213 పరుగుల లక్ష్యం...4 వికెట్లే కోల్పోయి 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదన...ఇప్పుడు లక్ష్యం 215 పరుగులు...4 వికెట్లే కోల్పోయి 7 బంతులు ఉండగానే ఛేదన... ఐదుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మెల్లగా తమ స్థాయి ఏమిటో చూపిస్తోంది. మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుపు ప్రదర్శనతో చెలరేగుతున్న ఆ జట్టు మరోసారి బ్యాటింగ్‌ బలంతో కీలక విజయాన్ని అందుకుంది.

బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్‌ (42 బంతుల్లో 82 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), జితేశ్‌ శర్మ (27 బంతుల్లో 49 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు వేగంతో పరుగులు సాధించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 53 బంతుల్లోనే అభేద్యంగా 119 పరుగులు జోడించారు.

అనంతరం ముంబై 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (41 బంతుల్లో 75; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (31 బంతుల్లో 66; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 55 బంతుల్లోనే 116 పరుగులు జత చేసి గెలుపులో కీలకపాత్ర పోషించారు.  

మెరుపు భాగస్వామ్యం... 
ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ (9) విఫలం కాగా, మరో ఎండ్‌లో కెపె్టన్‌ శిఖర్‌ ధావన్‌ (20 బంతుల్లో 30; 5 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లేలో పంజాబ్‌ స్కోరు 50 పరుగులకు చేరింది. శిఖర్, మాథ్యూ షార్ట్‌ (26 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌) లను తక్కువ వ్యవధిలో చావ్లా వెనక్కి పంపడంతో స్కోరు 11.2 ఓవర్లలో 95/3 వద్ద నిలిచింది. అయితే ఆ తర్వాత పంజాబ్‌ జోరు మొదలైంది.

ఆర్చర్‌ ఓవర్లో జితేశ్‌ మూడు ఫోర్లతో దూకుడు మొదలు పెట్టగా, అర్షద్‌ ఓవర్లో లివింగ్‌స్టోన్‌ మూడు ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో 32 బంతుల్లో లివింగ్‌స్టోన్‌ అర్ధసెంచరీ పూర్తయింది. అతని బ్యాటింగ్‌లో ఆర్చర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్‌ తొలి మూడు బంతుల్లో వరుసగా 6, 6, 6తో చెలరేగిన లివింగ్‌స్టోన్‌ ఆఖరి బంతికీ ఫోర్‌ కొట్టడంతో స్కోరు 200 దాటింది. ఈ ఓవర్లో మొత్తం 27 పరుగులు రావడం విశేషం.  

రోహిత్‌ విఫలం... 
తొలి ఓవర్లోనే రోహిత్‌ శర్మ (0)ను డకౌట్‌ చేసి రిషి ధావన్‌ ముంబైని దెబ్బ తీశాడు. అయితే ఇషాన్, గ్రీన్‌ (18 బంతుల్లో 23; 4 ఫోర్లు) ధాటిగా ఆడి ఇన్నింగ్స్‌ను నడిపించారు. అర్ష్ దీప్‌ ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన ఇషాన్, రిషి ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. గ్రీన్‌ వికెట్‌ కోల్పోయిన జట్టు పవర్‌ప్లే ముగిసేసరికి 54 పరుగులు చేసింది.

ఈ దశలో ఇషాన్, సూర్యకుమార్‌ అద్భుత బ్యాటింగ్‌ ముంబైని గెలుపు దిశగా నడిపించింది. 29 బంతుల్లో ఇషాన్, 23 బంతుల్లో సూర్యకుమార్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. కరన్‌ ఓవర్లో సూర్య వరుసగా 6, 6, 4, 4తో చెలరేగాడు. ఆ తర్వాత అర్ష్ దీప్‌ ఓవర్లో ఇషాన్‌ వరుసగా సిక్స్, 2 ఫోర్లు బాదాడు. వీరిద్దరిని 8 పరుగుల వ్యవధిలో అవుట్‌ చేసి పంజాబ్‌ ఊపిరి పీల్చుకుంది.

అయితే 23 బంతుల్లో 37 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో ముంబైకి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. తిలక్‌ వర్మ (10 బంతుల్లో 26 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు), టిమ్‌ డేవిడ్‌ (10 బంతుల్లో 19 నాటౌట్‌; 3 ఫోర్లు) కలిసి జట్టును గెలిపించారు. అర్ష్ దీప్‌ వేసిన 17వ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4, 6తో సత్తా చాటిన తిలక్‌...అర్ష్ దీప్‌ తర్వాతి ఓవర్లోనే భారీ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించడం విశేషం.  

స్కోరు వివరాలు 
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) అర్షద్‌ 9; శిఖర్‌ ధావన్‌ (స్టంప్డ్‌) ఇషాన్‌ కిషన్‌ (బి) చావ్లా 30; షార్ట్‌ (బి) చావ్లా 27; లివింగ్‌స్టోన్‌ (నాటౌట్‌) 82; జితేశ్‌ (నాటౌట్‌) 49; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–13, 2–62, 3–95. బౌలింగ్‌: గ్రీన్‌ 2–0–15–0, అర్షద్‌ 4–0–48–1, ఆర్చర్‌ 4–0–56–0, చావ్లా 4–0–29–2, కార్తికేయ 3–0–24–0, ఆకాశ్‌ 3–0–37–0.  
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) షార్ట్‌ (బి) రిషి 0; ఇషాన్‌ (సి) రిషి (బి) అర్ష్ దీప్‌ 75; గ్రీన్‌ (సి) చహర్‌ (బి) ఎలిస్‌ 23; సూర్యకుమార్‌ (సి) అర్ష్ దీప్‌ (బి) ఎలిస్‌ 66; డేవిడ్‌ (నాటౌట్‌) 19; తిలక్‌ వర్మ (నాటౌట్‌) 26; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 216. వికెట్ల
పతనం: 1–0, 2–54, 3–170, 4–178. బౌలింగ్‌: రిషి ధావన్‌ 3–0–20–1, అర్ష్ దీప్‌ 3.5–0–66–1, స్యామ్‌ కరన్‌ 3–0–41–0, ఎలిస్‌ 4–0–34–2, రాహుల్‌ చహర్‌ 3–0–30–0, హర్‌ప్రీత్‌ 2–0–21–0.

ఐపీఎల్‌లో నేడు 
హైదరాబాద్‌ VS  కోల్‌కతా (రాత్రి గం. 7:30 నుంచి) 
స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement