సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరంభ విధ్వంసం ముంబై బౌలింగ్ ముందు ఆవిరైంది. బాధ్యత పంచుకోని బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ బృందం ముందు తలవంచారు. ఒకదశలో 76 బంతుల్లో 84 పరుగులు చేయాల్సిన సునాయాస లక్ష్యాన్ని మ్యాచ్ జరిగేకొద్దీ క్లిష్టంగా మార్చుకుంది. గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పూర్తి 20 ఓవర్లయినా ఆడకుండానే ఓడిపోయింది.
చెన్నై: హైదరాబాద్ లక్ష్యాన్ని బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యం ముంచేసింది. గెలుస్తుందనున్న మ్యాచ్‌ను చేజేతులా ఓడిపోయింది. ఐపీఎల్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 13 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ (39 బంతుల్లో 40; 5 ఫోర్లు) రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహ్మాన్, విజయ్ శంకర్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్ 19.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. బెయిర్‌స్టో (22 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) కాసేపే ఉన్నా కసిదీరా బాదేశాడు. రాహుల్ చహర్ (3/19) స్పిన్ మాయాజాలం, బౌల్ట్ (3/28) పేస్ అటాక్ ముంబైని విజేతగా నిలబెట్టాయి.
ముంబై కట్టడి
ముంబై ఇండియన్స్ ఆట ఓపెనింగ్ జోరుతో మొదలైంది. తర్వాత కట్టడి అయింది. చివరకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కీరన్ పొలార్డ్ (22 బంతుల్లో 35 నాటౌట్; ఫోర్, 3 సిక్స్‌లు) ఆఖరి ఓవర్ మెరుపులతో పోరాడే స్కోరుకు చేరింది. భువనేశ్వర్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే డికాక్ బౌండరీలతో బాదేశాడు. ముజీబ్‌ను రోహిత్ 4, 6తో శిక్షించాడు. ఇదే జోరుతో భువీ ఓవర్లో సిక్సర్ బాదాడు. 5 ఓవర్లలో ముంబై స్కోరు 48/0. ఇంచుమించు ఓవర్‌కు 10 పరుగుల చొప్పున సాగిన ఇన్నింగ్స్ రోహిత్ (25 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఔటయ్యాక నెమ్మదించింది. విజయ్ శంకర్ తన తొలి ఓవర్లో (ఇన్నింగ్స్ 7వ) ముంబై కెప్టెన్‌ను బోల్తా కొట్టించాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ (6 బంతుల్లో 10; 1 ఫోర్, 1 సిక్స్) వచ్చీ రాగానే బ్యాట్ ఝుళిపించినా అదెంతోసేపు నిలువలేదు. శంకరే అతన్నీ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ పంపాడు. రషీద్ ఖాన్ కూడా కట్టడి చేయడంతో ముంబై ఆటలు సాగలేదు. పరుగులు యథేచ్ఛగా రాలేదు.
పొలార్డ్ సిక్సర్లు
ముంబై హిట్టర్ పొలార్డ్ 14వ ఓవర్లో క్రీజులోకి వచ్చినా... హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తలవంచక తప్పలేదు. 15వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. కానీ ఇషాన్ కిషన్ (12) ముజీబ్ ఉచ్చులో పడ్డాడు. హార్దిక్ పాండ్యా (7)ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. ఇలా ఎవరొస్తే వారిని హైదరాబాదీ బౌలర్లు తప్పించారు. ఇలా 18 ఓవర్లు ముగిసినా కూడా ముంబై స్కోరు 4 వికెట్లకు 126 పరుగులే! ఆఖరి ఓవర్లో పొలార్డ్ రెండు సిక్స్‌ర్లతో మెరవడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
దంచేసిన బెయిర్‌స్టో
రెండు ఓవర్లు పూర్తయినా హైదరాబాద్ 5 పరుగులను మించలేకపోయింది. కానీ మరుసటి ఓవర్ తొలి బంతి నుంచే బెయిర్‌స్టో దంచేసే ఆట మొదలుపెట్టాడు. బౌల్ట్ బౌలింగ్‌లోనైతే తొలి నాలుగు బంతుల్ని వరుసగా 4, 4, 6, 4తో లైన్ దాటించడంతో ఆ ఒక్క ఓవర్లోనే 18 పరుగులొచ్చాయి. నాలుగో ఓవర్ వేసిన మిల్నేపైనా బెయిర్‌స్టో ప్రతాపం కొనసాగింది. రెండు భారీ సిక్సర్లతో మెరిపించాడు. ఈ దశలో వార్నర్ ఆచితూచి ఆడినా కూడా 4.4 ఓవర్లలోనే హైదరాబాద్ స్కోరు 50 పరుగులకు చేరుకుంది. స్కోరు కూడా వడివడిగా సాగిపోయింది.
ఈ దశలో దురదృష్టవశాత్తూ బెయిర్‌స్టో హిట్‌వికెట్ కావడం హైదరాబాద్‌ను దెబ్బతీసింది. తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇతను ఔటయ్యే సమయానికి సన్‌రైజర్స్ విజయానికి 76 బంతుల్లో 84 పరుగులు కావాలి. వార్నర్‌లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఉన్న హైదరాబాద్‌కు ఇది ఏమాత్రం కష్టం కాదు. కానీ అవతలివైపు కాస్త పట్టు బిగించేసరికి హైదరాబాద్ బెదిరిపోయింది. బ్యాటింగ్ ఆర్డర్ చెదిరిపోయింది. స్కోరు బోర్డుపై కెప్టెన్ వార్నర్ (34 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) బెయిర్‌స్టో, విజయ్ శంకర్ (25 బంతుల్లో 28; 2 సిక్స్‌లు) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరైన చేయలేకపోయారు. కృనాల్ పాండ్యా, బుమ్రా చెరో వికెట్ తీశారు.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) సబ్–సుచిత్ (బి) ముజీబ్ 40; రోహిత్ (సి) విరాట్ సింగ్ (బి) శంకర్ 32; సూర్యకుమార్ (సి అండ్ బి) శంకర్ 10; ఇషాన్ కిషన్ (సి) బెయిర్‌స్టో (బి) ముజీబ్ 12; పొలార్డ్ (నాటౌట్) 35; హార్దిక్ (సి) విరాట్ సింగ్ (బి) అహ్మద్ 7; కృనాల్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 150.
వికెట్ల పతనం: 1–55; 2–71, 3–98, 4–114, 5–131.
బౌలింగ్: భువనేశ్వర్ 4–0–45–0, ఖలీల్ అహ్మద్ 4–0–24–1, ముజీబ్ 4–0–29–2, అభిషేక్ శర్మ 1–0–5–0, శంకర్ 3–0–19–2, రషీద్ 4–0–22–0.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (రనౌట్) 37; బెయిర్‌స్టో (హిట్‌వికెట్) (బి) కృనాల్ పాండ్యా 43; మనీశ్ పాండే (సి) పొలార్డ్ (బి) రాహుల్ చహర్ 2; విరాట్ సింగ్ (సి) సూర్యకుమార్ (బి) రాహుల్ చహర్ 11; శంకర్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 28; అభిషేక్ (సి) మిల్నే (బి) రాహుల్ చహర్ 2; సమద్ (రనౌట్) 7; రషీద్ ఖాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బౌల్ట్ 0; భువనేశ్వర్ (బి) బౌల్ట్ 1; ముజీబ్ (నాటౌట్) 1; ఖలీల్ అహ్మద్ (బి) బౌల్ట్ 1; ఎక్స్‌ట్రాలు 137; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 137.
వికెట్ల పతనం: 1–67, 2–71, 3–90, 4–102, 5–104, 6–129, 7–130, 8–134, 9–135, 10–137.
బౌలింగ్: బౌల్ట్ 3.4–0–28–3, బుమ్రా 4–0–14–1, మిల్నే 3–0–33–0, కృనాల్ పాండ్యా 3–0–30–1, రాహుల్ చహర్ 4–0–19–3, పొలార్డ్ 2–0–10–0.
ఐపీఎల్‌లో నేడు
రాయల్ చాలెంజర్స్ X బెంగళూరు కోల్‌కతా
నైట్‌రైడర్స్ X ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment