Sarfaraz Khan Brother Musheer Khan: దేశవాలీ టోర్నీల్లో ముఖ్యంగా రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తూ, అభినవ బ్రాడ్‌మన్‌గా కీర్తించబడుతున్న ముంబై చిచ్చరపిడుగు సర్ఫరాజ్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే అతను ఈసారి వార్తల్లోకెక్కింది తన వ్యక్తిగత ప్రదర్శనకు సంబంధించి కాదు. తన తమ్ముడు ముషీర్ ఖాన్ కారణంగా. రంజీల్లో ముంబైకే ప్రాతినిధ్యం వహించే 17 ఏళ్ల ముషీర్ ఖాన్.. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ-2023లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ బాదాడు.
Sarfaraz Khan's younger brother Musheer Khan has smashed a triple century for Mumbai in CK Nayudu Trophy against Hyderabad.#CricTracker #SarfarazKhan #MusheerKhan pic.twitter.com/b7C6VtJoTp
— CricTracker (@Cricketracker) January 23, 2023
ఈ మ్యాచ్‌లో 367 బంతులు ఎదుర్కొన్న ముషీర్.. 34 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 339 పరుగులు స్కోర్ చేశాడు. ముషీర్ కళాత్మకమైన ఇన్నింగ్స్‌లో 190 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో రావడం విశేషం. ట్రిపుల్ హండ్రెడ్‌తో ముషీర్ చెలరేగడంతో ముంబై తమ ఇన్నింగ్స్‌ను 704 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన ముషీర్ గత నెలలోనే రంజీల్లోకి అరంగేట్రం చేసి ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేక జట్టులో స్థానం కోల్పోయాడు.
సౌరాష్ట్రతో జరిగిన తన డెబ్యూ మ్యాచ్‌లో వికెట్లు పడగొట్టకుండా కేవలం 35 (12, 23) పరుగులు చేసిన ముషీర్.. అస్సాంతో జరిగిన రెండో మ్యాచ్‌లో 42 పరుగులు చేసి 2 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. అయితే అతికష్టం మీద లభించిన మూడో అవకాశంలోనూ ముషీర్ తనను తాను నిరూపించుకోలేకపోవడంతో వేటు తప్పలేదు. తన మూడో మ్యాచ్‌లో ఢిల్లీపై ముషీర్ వికెట్లు లేకుండా కేవలం 19 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. తద్వారా ముంబై యాజమాన్యం అతన్ని మరుసటి మ్యాచ్ నుంచి తప్పించింది.
అయితే, అన్న సర్ఫరాజ్ లాగే పట్టువదలని ముషీర్.. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో హైదరాబాద్‌పై ట్రిపుల్ సెంచరీ బాది, ముంబై యాజమాన్యం తిరిగి తనవైపు చూసేలా చేశాడు.
మరోపక్క రంజీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సెంచరీ మీద సెంచరీలు బాదుతూ, టీమిండియాలో చోటు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుత రంజీ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 92.66 సగటున 556 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. అంతకుముందు సీజన్లలోనూ ఇదే తరహాలో రెచ్చిపోయిన సర్ఫరాజ్.. వరుసగా 928 (9 ఇన్నింగ్స్‌ల్లో 154.66 సగటున), 982 (9 ఇన్నింగ్స్‌ల్లో 122.75 సగటున) పరుగులు చేసి టీమిండియా నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు.
తన ప్రదర్శన కారణంగా సర్ఫరాజ్ ఇండియా-ఏ టీమ్‌లో అయితే చోటు దక్కించుకోగలిగాడు కానీ, జాతీయ సెలెక్టర్లు మాత్రం ఈ ముంబై కుర్రాన్ని కరుణించడం లేదు. ఆసీస్‌తో త్వరలో ప్రారంభంకానున్న టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన టీమిండియాలో చోటు ఆశించి భంగపడ్డ సర్ఫరాజ్‌కు శ్రేయస్ అయ్యర్ రూపంలో అదృష్టం కలిసొస్తుందేమో వేచి చూడాలి. గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్‌కు దూరంగా ఉన్న శ్రేయస్.. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ సమయానికి కోలుకోలేకపోతే, సెలెక్టర్లు సర్ఫరాజ్‌ను కటాక్షించే అవకాశాలు లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment