స్వర్ణ పతకం ఖాయమయ్యాక ట్రాక్‌పై ప్రణమిల్లిన నీరజ్
సాక్షి క్రీడా విభాగం: ‘విజయం సాధించాలనే కాంక్ష మీకు నిద్ర పట్టనివ్వకపోతే... కష్టపడటం తప్ప మరే విషయం మీకు నచ్చకపోతే... ఎంత శ్రమించినా గానీ అలసట అనిపించకపోతే... విజయంతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నట్లు అర్థం చేసుకోండి’... దాదాపు రెండేళ్ల క్రితం ఈ స్ఫూర్తిదాయక వ్యాఖ్యను ట్వీట్ చేసిన నీరజ్ చోప్రా ఇప్పటికీ దానినే తన పిన్‌డ్ ట్వీట్‌గా పెట్టుకున్నాడు. బహుశా రాబోయే రోజుల్లో తాను భారత క్రీడా చరిత్రలో కొత్త చరిత్రను లిఖిస్తాననే ఆత్మవిశ్వాసం కావచ్చు, కానీ నిజంగానే నీరజ్ శనివారం అతి పెద్ద ఘనతను నమోదు చేసి ఒలింపిక్స్ ‘బంగారు బాబు’గా నిలిచాడు. వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌తో మొదలు పెట్టి ఆసియా చాంపియన్‌షిప్, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల్లో స్వర్ణాలతో ఇప్పటికే ఈతరంలో భారత అత్యుత్తమ అథ్లెట్‌గా గుర్తింపు తెచ్చుకున్న నీరజ్ కళ్ల ముందు ఒలింపిక్ పతకమే లక్ష్యంగా నిలిచింది. ఇప్పుడు పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే ఏకంగా స్వర్ణం కొల్లగొట్టి అతను తన స్థాయిని ఒక్కసారిగా పెంచుకున్నాడు.
ఇంతింతై...
నీరజ్ విజయం ఒక్కసారిగా, అనూహ్యంగా వచ్చిం ది కాదు. అతని కెరీర్‌ను చూస్తే ఒక్కో దశలో తన ఆటను మెరుగుపర్చుకుంటూ, ఒక్కో పతకాన్ని తన ఖాతాలో చేర్చుకుంటూ మెల్లగా ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. జూనియర్ స్థాయిలో ఆకట్టుకునే ప్రదర్శనల తర్వాత 2016 ‘శాఫ్’ క్రీడల్లో 82.23 మీటర్ల త్రో విసిరి అతను తొలిసారి అందరి దృష్టిలో పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత పోలాండ్‌లో జరిగిన అండర్–20 వరల్డ్ చాంపియన్íషిప్‌లో నీరజ్ సత్తాను గుర్తించేలా చేసింది. 86.48 మీటర్లతో అతను ప్రపంచ రికార్డు నెలకొల్పడం విశేషం. నిజానికి ఈ దూరంతో అతను రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేవాడే. కానీ ఒలింపిక్స్ కటాఫ్ తేదీ ముగిసిన తర్వాత ఈ ఈవెంట్ జరగడంతో అతనికి అవకాశం పోయింది.
గాయంతో ఆట ఆగినా...
వరుస టోర్నీలు, విజయాలతో పాటు సహజంగానే అథ్లెట్ల వెన్నంటి గాయాలు కూడా ఉంటాయి. రెండేళ్ల క్రితం నీరజ్ కూడా దాని బారిన పడ్డాడు. జావెలిన్ త్రో కారణంగా ఒత్తిడి ఎక్కువగా ఉండే కుడి మోచేతి గాయం కారణంగా నీరజ్‌కు శస్త్ర చికిత్స కూడా చేయాల్సి వచ్చింది. 2019 వరల్డ్ చాంపియన్‌షిప్ సహా అతను పలు టోర్నీలకు దూరమయ్యాడు. దాంతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం కష్టంగా మారింది. చివరకు 2020 జనవరిలో అతను తన తొలి టోర్నీలో సత్తా చాటి క్వాలిఫై అయ్యాడు. అయితే కరోనా కారణంగా క్రీడలు ఏడాది వాయిదా పడ్డాయి. ఈ సమయాన్ని అతను సమర్థంగా వాడుకున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో పాటు తన శరీరాన్ని మరింత దృఢంగా మార్చుకునే పనిలో పడ్డాడు.
‘ఫౌల్’ సమస్య రాకుండా తన టెక్నిక్‌ను మార్చుకోవడంతో పాటు ఎదురు గాలి వీచే వాతావరణ పరిస్థితుల్లోనూ సమస్య రాని విధంగా ఉండే జావెలిన్‌లను కూడా ఎంచుకొని సాధన చేశాడు. ఒలింపిక్స్‌లో పతకం సాధించే అంచనాలు ఉన్న డిఫెండింగ్ చాంపియన్ థామస్ రోలర్, వరల్డ్ సిల్వర్ మెడలిస్ట్ మాగ్నస్ కర్ట్, ఆండ్రీస్ హాఫ్‌మన్ గాయాలతో ఒలింపిక్స్ నుంచి ముందే తప్పుకోగా... 2012 చాంపియన్ వాల్కాట్, 2019 వరల్డ్ చాంపియన్ పీటర్స్, మార్సిన్ క్రుకోస్కీ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగారు. తన ప్రతిభకు తోడు అన్ని కలిసి రావడంతో నీరజ్ ఇప్పుడు స్వర్ణ ఘనతను సాధించాడు. చూపుల్లో బాలీవుడ్ హీరోలా కనిపించే నీరజ్ సినిమాలు కాకుండా మరో దారిని ఎంచుకొని ఎవరెస్ట్ స్థాయిని అందుకున్నాడు. ఇప్పుడు భారత క్రీడా రంగానికి అతను ఒక పెద్ద ‘పోస్టర్ బాయ్’గా మారాడు.
ప్రపంచ అండర్–20 స్వర్ణ పతకంతో...
Comments
Please login to add a commentAdd a comment