టోక్యో ఒలింపిక్స్‌లో భారతీయుల బంగారు స్వప్నం సాకారమైంది. రెండు వారాలుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ‘పసిడి దృశ్యం’ శనివారం ఆవిష్కృతమైంది. అథ్లెటిక్స్ ఈవెంట్‌లో భాగంగా పురుషుల జావెలిన్ త్రోలో భారత ప్లేయర్ నీరజ్ చోప్రా అద్వితీయ ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలో ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని తన మెడలో వేసుకున్నాడు. తద్వారా ఒలింపిక్స్ అథ్లెటిక్స్ చరిత్రలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన అథ్లెట్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. గతంలో మిల్కా సింగ్ (1960 రోమ్), పీటీ ఉష (1984 లాస్ ఏంజెలిస్) నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాలను కోల్పోయారు.
అభినవ్ బింద్రా (షూటింగ్– 2008 బీజింగ్) తర్వాత ఒలింపిక్స్ క్రీడల్లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారుడిగా నీరజ్ గుర్తింపు పొందాడు. శనివారం భారత్ ఖాతాలో రెండో పతకం కూడా చేరింది. పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియా కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. కాంస్య పతకపోరులో బజరంగ్ 8–0తో నియాజ్‌బెకోవ్(కజ కిస్తాన్)పై గెలిచాడు. మహిళల బాక్సింగ్(69 కేజీల విభాగం)లో కాంస్యం సాధించిన లవ్లీనా శనివారం పతకాన్ని అందుకుంది. మొత్తంగా ‘టోక్యో’ క్రీడల్లో 7 పతకాలతో భారత్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అత్యధికంగా 6 పతకాలు లభించాయి. నేటితో విశ్వ క్రీడలు ముగియనున్నాయి.
బల్లెం దిగింది..బంగారమొచ్చింది
చేతిలో బల్లెం... కళ్లల్లో చురుకుదనం... గుండెల్లో ఆత్మవిశ్వాసం... ప్రపంచాన్ని గెలవాలనే పట్టుదల... పోటీకి సిద్ధమైన వేళ ఆందోళన, ఒత్తిడి ఎక్కడా లేవు... అలా పది అడుగుల ప్రయాణం మొదలైంది... వేగం పెంచుతూ ముందుకు దూసుకొచ్చిన తర్వాత అంతే వేగంగా జావెలిన్ చేయి దాటింది... అలా అలా గాల్లో దూసుకుపోయిన బల్లెం 87.58 మీటర్ల తర్వాత మైదానంలో కసుక్కున దిగింది. అంతే... నీరజ్ చోప్రాకు తాను కొత్త చరిత్ర సృష్టించానని అర్థమైపోయింది. ఇక తానూ టోక్యో నుంచి పతకంతో ఖాయంగా వెళతానని తెలిసిపోయింది. అందుకే సంబరాలు చేసుకునేందుకు ఆలస్యం చేయలేదు. అయితే తాను అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకం మాత్రమే అందించలేదని, అది మరి కొద్దిసేపటిలో పసిడిగా కూడా మారబోతోందని ఆ క్షణాన నీరజ్ ఊహించలేదు. ఆ తర్వాత మిగతా ప్రత్యర్థులంతా కలిసి యాభై నాలుగు ప్రయత్నాల్లోనూ నీరజ్ స్కోరును అధిగమించలేకపోవడంతో అతని ప్రదర్శన శిఖరాన నిలిచింది.
ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారతీయుల ప్రదర్శన అంటే హాజరు పట్టికలో పేర్లు నమోదు చేసుకోవడమే... 1920 నుంచి పోటీల్లో పాల్గొంటున్న మన ఆటగాళ్లు గెలుపు కాదు కదా, ఫైనల్స్ చేరడం కూడా గొప్ప ఘనతగా భావించే పరిస్థితి. క్వాలిఫయింగ్‌కే పరిమితమై వెనుదిరగడం ప్రతీ ఒలింపిక్స్‌లో కనిపించే దృశ్యమే. అథ్లెటిక్స్‌లో మన దేశం పతకాలు సాధించగలదని ఏనాడూ ఏదశలోనూ ఎవరూ కనీసం అంచనా వేయలేదు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో మిల్కా సింగ్, 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పీటీ ఉష నాలుగో స్థానాల్లో నిలిచిన ఘనతలే ఇప్పటి వరకు అత్యుత్తమంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇలాంటి స్థితిలో నీరజ్ సాధించిన బంగారు పతకం గురించి ఎంత చెప్పినా తక్కువే. గత కొన్నేళ్లుగా ఒక్కో మెట్టే ఎక్కుతూ జావెలిన్‌లో అతను వరుస విజయాలు సాధించినా... ఒలింపిక్స్‌కు వచ్చేసరికి అందరిలాగే అతనూ చివరి క్షణంలో తడబడతాడేమోనని ఒకింత ఆందోళన... అయితే నీరజ్ జావెలిన్ అన్ని భయాలను బద్దలు కొట్టింది.
‘నన్ను ఓడించడం నీరజ్ వల్ల కాదు...నేను టోక్యోలో కనీసం 90 మీటర్లకు పైగా జావెలిన్ విసరగలను’... వరల్డ్ నంబర్‌వన్ వెటెర్ ఇటీవల నీరజ్‌కు విసిరిన సవాల్ ఇది. ఈ ఏడాదిలోనే వెటెర్ ఏకంగా ఏడుసార్లు 90 మీటర్ల స్కోరును దాటగా, అత్యుత్తమం 97.76 మీటర్లు. ఒలింపిక్స్‌కు ముందు నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన 88.07 మీటర్లు మాత్రమే. మరో జర్మన్, 9వ ర్యాంక్ వెబర్ అత్యుత్తమ స్కోరు 88.29 కూడా నీరజ్‌కంటే ఎక్కువే. అయితే భారత త్రోయర్ ప్రత్యర్థి పాత ఘనతలకు బెదరలేదు. ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ పోయాడు. క్వాలిఫయింగ్‌లో తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచి ఫైనల్‌కు చేరిన నీరజ్ తన ప్రదర్శన ‘గాలివాటం’ కాదని నిరూపిస్తూ భారతీయులు గర్వపడే ప్రదర్శన చేశాడు. ఒలింపిక్స్ వేదికపై సగర్వంగా భారత జాతీయ పతాకం ఎగరడం మాత్రమే కాదు... 13 ఏళ్ల తర్వాత, అదీ రవీంద్రుడి వర్ధంతి రోజునే జనగణమన...వినిపించడం ప్రతీ భారతీయుడి గుండె భావోద్వేగంతో ఉప్పొంగేలా చేసింది. ఇదీ నీరజ్ దేశానికి అందించిన బంగారపు కానుక.
టోక్యో: భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కొత్త చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో దేశం తరఫున రెండో వ్యక్తిగత స్వర్ణం సాధించిన ఆటగాడిగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఒలింపిక్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కాగా... అదీ స్వర్ణం కావడం నీరజ్ ఘనతను రెట్టింపు చేసింది. శనివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ 87.58 మీటర్ల దూరం బల్లెం విసిరి నంబర్‌వన్‌గా నిలిచాడు. జాకుబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్; 86.67 మీటర్లు), వితెస్లావ్ వెసిలీ(చెక్ రిపబ్లిక్; 85.44 మీటర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచి రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటర్ అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్) స్వర్ణం సాధించిన తర్వాత భారత్‌కు ఒలింపిక్స్ మళ్లీ మరో పసిడి పతకం లభించింది. నీరజ్ స్వర్ణ పతకంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 7కు చేరింది. దీంతో 2012 లండన్ ఒలింపిక్స్‌లో 6 పతకాలతో సాధించిన భారత అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించింది. శనివారంతో టోక్యో క్రీడల్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. ఆదివారంతో టోక్యో ఒలింపిక్స్ క్రీడలు కూడా ముగియనున్నాయి.
రెండో ప్రయత్నంలోనే...
క్వాలిఫయింగ్ ఈవెంట్లో 86.65 మీటర్లు జావెలిన్ విసిరి అగ్రస్థానంతో ఫైనల్స్‌కు అర్హత సాధించిన నీరజ్ శనివారం కూడా అంతే ఆత్మవిశ్వాసంతో ఆటను మొదలు పెట్టాడు. తన తొలి ప్రయత్నంలో అతను విసిరిన బల్లెం 87.03 మీటర్లు దూసుకుపోయింది. ఫైనల్లో పాల్గొన్న 12 మంది తొలి ప్రయత్నాల్లో నీరజ్ అందరికంటే ఎక్కువ దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఇక రెండో ప్రయత్నంలో దానిని మరింత మెరుగుపర్చుకుంటూ 87.58 మీటర్లతో అతని జావెలిన్ మరింత ముందుకు వెళ్లింది. ఈ దూరమే నీరజ్ చివరి వరకూ నిలబెట్టుకోగలిగాడు. తర్వాతి నాలుగు ప్రయత్నాల్లో (మొత్తం ఆరు) అతను వరుసగా 76.79 మీటర్లు, ఫౌల్, ఫౌల్, 84.24 మీటర్లు జావెలిన్ విసిరినా నష్టం లేకపోయింది. ఫేవరెట్‌లలో ఒకడైన జొనాస్ వెటెర్ (జర్మనీ) తన తొలి ప్రయత్నంలో 82.52 మీటర్లు జావెలిన్ విసిరి వెనుకబడ్డాడు. తర్వాత రెండు ప్రయత్నాల్లోనూ ‘ఫౌల్’ చేసిన అతను 9వ స్థానం లో నిలిచాడు. దాంతో టాప్–8 లో పోటీ పడే అవకాశం కూడా లేకుండా వెటెర్ నిష్క్రమించాడు. మిగతా త్రోయర్లు చివరి వరకు ప్రయత్నించినా నీరజ్ స్కోరును అందుకోలేకపోయారు.
‘సూరజ్’ వరకు ‘నీరజ్’ జావెలిన్
నీరజ్ చోప్రాకు అభినందనలు. అథ్లెటిక్స్‌లో స్వర్ణం గెలవాలనే వందేళ్ల భారతీయుల కలను నువ్వు నిజం చేశావు. ఈ విజయం దేశంలోని ఇతర క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది.
–కె.చంద్రశేఖర రావు, తెలంగాణ ముఖ్యమంత్రి
భారత సైన్యంలో పని చేస్తున్న సిపాయి ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో స్వర్ణం సాధించి దేశం గర్వపడేలా చేశాడు. తొలి ఒలింపిక్స్‌లోనే జావెలిన్‌తో నీరజ్ చరిత్ర సృష్టించాడు.
–వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
భారత జాతి కల నెరవేర్చిన నీకు కృతజ్ఞతలు. మా బంగారు క్లబ్‌లోకి ఆహ్వానం. చాలా గర్వంగా ఉంది. నిన్ను చూస్తే సంతోషం వేస్తోంది.
–అభినవ్ బింద్రా
ఇలాంటి రోజు కోసం నాన్న ఎన్నో ఏళ్లు ఎదురు చూశారు. ఇప్పుడు అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణంతో ఆయన కల తీరింది. నాకు కన్నీళ్లు ఆగడం లేదు. ఇది సాధించిన నీరజ్‌కు కృతజ్ఞతలు. నువ్వు గెలవడమే కాదు నాన్నకు పతకాన్ని అంకితమివ్వడం చాలా గొప్పగా అనిపిస్తోంది.
–జీవ్, మిల్కా సింగ్ కుమారుడు
37 ఏళ్ల క్రితం అసంపూర్తిగా మిగిలిపోయిన నా కల ఇప్పుడు పూర్తయింది. థ్యాంక్యూ మై సన్.
–పీటీ ఉష
నీ వల్ల భారత్ ప్రకాశిస్తోంది నీరజ్... నీ జావెలిన్ త్రివర్ణాన్ని ఎగురవేసి అందరూ గర్వపడేలా చేసింది.
–సచిన్ టెండూల్కర్
నమ్మలేకపోతున్నా. తొలిసారి అథ్లెటిక్స్‌లో భారత్‌కు స్వర్ణం అందించడం చాలా గొప్పగా అనిపిస్తోంది. నేనూ, నా దేశం గర్వించే క్షణమిది. నేను విసిరిన దూరం బంగారం అందిస్తుందని ఊహించలేదు. ఇంకా ఆ భావోద్వేగంలోనే ఉన్నాను. నేను మామూలుగా మారేందుకు కొంత సమయం పడుతుందేమో. నా జీవితంలో ఇదే అత్యుత్తమ క్షణం. త్రో సమయంలో నేను ఒక్కసారి కూడా ఒత్తిడికి లోను కాలేదు. బలంగా జావెలిన్ విసరాలని మాత్రమే అనుకున్నా. ఇటీవలే కన్నుమూసిన దిగ్గజం మిల్కా సింగ్‌కు నా పతకం అంకితం. స్టేడియంలో భారత జాతీయగీతం వినపడాలని ఆయన కోరుకున్నారు. ఆయన లేకపోయినా ఆ కల నేను పూర్తి చేశాను.
– నీరజ్ చోప్రా
Comments
Please login to add a commentAdd a comment