
హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ
టీమిండియా ప్రధాన సమస్య అదేనన్న మాజీ బ్యాటర్.. ఇకనైనా కళ్లు తెరవాలంటూ హితవు
‘In search of diamond we lost gold’: వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో టీమిండియా సన్నద్ధతపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో అనుభవజ్ఞులైన సీనియర్లను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నాడు. ప్రయోగాలు చేసేందుకు సమయం లేదని, ఐసీసీ టోర్నీకి ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాల్సి ఉందని పేర్కొన్నాడు.
సెమీస్‌లో నిరాశ
టీ20 ప్రపంచకప్-2021లో కనీసం సెమీస్ కూడా చేరకుండా నిష్క్రమించిన టీమిండియా... ఈసారి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన రోహిత్ సేన కనీసం ఫైనల్ చేరకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓటమి బౌలర్ల వైఫల్యాన్ని ఎత్తిచూపింది.
వచ్చే ప్రపంచకప్‌లోనైనా
ఇదిలా ఉంటే... స్వదేశంలో వచ్చే ఏడాది భారత జట్టు వన్డే ప్రపంచకప్ ఆడనుంది. ఎఫ్‌టీపీ క్యాలెండర్ ప్రకారం.. ఈ మెగా ఈవెంట్ కంటే ముందు టీమిండియా సుమారు 25 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డేల్లో తలపడుతోంది.
ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ప్రసారకర్త అమెజాన్ ప్రైమ్ వీడియోతో ముచ్చటించిన మహ్మద్ కైఫ్ జట్టు కూర్పు, వన్డే వరల్డ్‌కప్ సన్నద్ధతపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘వరల్డ్‌కప్ చాంపియన్‌గా ఉన్న ఇంగ్లండ్ జట్టులోని ఆటగాళ్ల సగటు వయసు 31 ఏళ్లు.
అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటం జట్టుకు ఎల్లప్పుడూ ప్రయోజనకరంగానే ఉంటుంది. ఒకవేళ టీమిండియా ప్రపంచకప్ టోర్నీకి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలనుకుంటే న్యూజిలాండ్ సిరీస్‌తోనే మొదలుపెట్టాల్సింది.
టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్
అసలు సమస్య అదే
‘‘టీమిండియాను వేధిస్తున్న ప్రధాన సమస్య బౌలింగ్. ప్రస్తుత సిరీస్‌లో శార్దూల్ ఠాకూర్ విషయాన్నే చూడండి. మొదటి వన్డేలో ఆడించి రెండో మ్యాచ్‌కే పక్కన పెట్టారు. ఇక సిరాజ్‌ను ఇంటికి పంపేశారు. తనను వన్డేల్లో కూడా ఆడించాల్సింది.
అసలు ఈ సిరీస్‌కు భువనేశ్వర్ కుమార్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో నాకైతే అర్థం కాలేదు. తను మంచి బౌలర్. అయినా జట్టులో అతడికి చోటు లేదు. అదేదో సామెత ఉంటుంది కదా! వజ్రాల వేటలో పడి బంగారం పోగొట్టుకున్నారు అని! ప్రస్తుతం జట్టు పరిస్థితి అలాగే ఉంది.
కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం మంచిదే.. అయితే, అనుభవం ఉన్న ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదు. జట్టు సమతుల్యంగా ఉండాలి. ముఖ్యంగా ప్రపంచకప్ ఈవెంట్‌కు సమయం తక్కువగా ఉన్నందున ఇప్పుడు ప్రయోగాలు పనికిరావు. కాబట్టి జట్టులో ఎవరిని ఉంచాలి.. ఎవరిని పక్కనపెట్టాలో నిర్ణయించుకోండి.
పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్‌కుమార్, మహ్మద్ షమీలతో పాటు ఉమ్రాన్ మాలిక్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్స్‌ట్రా బౌలర్‌గా తనని పరిగణనలోకి తీసుకోవాలి’’ అని మహ్మద్ కైఫ్ బీసీసీఐ సెలక్టర్లకు సూచించాడు.
చదవండి: Ind Vs NZ: అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్‌గా లక్ష్మణ్..
ICC WC Super League: వర్షం చేసిన మేలు! టాప్‌లో టీమిండియా.. లంకకు షాకిచ్చి ముందడుగు వేసిన అఫ్గనిస్తాన్
PT Usha: చరిత్ర సృష్టించిన దిగ్గజ అథ్లెట్.. కీలక పదవిలో పీటీ ఉష! ఏకగ్రీవ ఎన్నిక